తెలంగాణా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి నిర్మల్ జిల్లా భైంసాలో గట్టి షాక్ తగిలింది. పురపాలక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ జెండా రెపరెపలాడుతుండగా, భైంసాలో మాత్రం కారుకు ‘జీరో’ ఫలితాలే రావడం గమనార్హం. అయితే ఈ ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండడం విశేషం. తెలంగాణాలో టీఆర్ఎస్, ఎంఐఎం స్నేహబంధంపై గల ప్రచారమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు.
భైంసా పురపాలక సంఘం పరిధిలో మొత్తం 26 వార్డులు ఉండగా, టీఆర్ఎస్ నుంచి 23 మంది, కాంగ్రెస్ 16, బీజేపీ 13, ఎంఐఎం 18, ఇండిపెండెంట్లు 15, ఇతరులు 85 మంది అభ్యర్థుల చొప్పున పోటీ చేశారు. అయితే శనివారం నాటి ఫలితాల్లో ఎంఐఎం పోటీ చేసిన 18 స్థానాల్లో 15 చోట్ల, బీజేపీ 13 స్థానాలకు గాను 9 వార్డుల్లో విజయం సాధించాయి. మరో రెండు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ పార్టీలకు సున్నా ఫలితాలే మిగలడం గమనార్హం. భైంసాలో పోలింగ్ కు ముందు నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇక్కడి ఫలితాలు సహజంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికి కారణమయ్యాయి.