తెలంగాణాలో మావోయిస్టు పార్టీ తాజా కార్యకలాపాలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ కీలక ప్రకటన చేశారు. నిన్న చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ఘటన నేపథ్యంలో విడుదల చేసిన ప్రకటనలో అనేక కీలక అంశాలు ఉండడం గమనార్హం. మావోయిస్టు నక్సలైట్ల కదలికలకు సంబంధించి ఎస్పీ ఏమంటున్నారంటే…
తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ కమిటీ ఈనెల 21 నుండి 27 వ తారీఖు వరకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా తెలంగాణలో విధ్వంసం సృష్టించడానికి చాలా యాక్షన్ టీంలను, మావోయిస్టు దళాలను చత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలకు పంపించినట్లుగా తమకు విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. ప్రభుత్వ ఆస్తులను, పోలీసులపై దాడి చేయడానికి వ్యూహరచన చేసుకున్నట్లు సమాచారం ఉందన్నారు. ఈ సమాచారం మేరకు జిల్లాలోని చర్ల, మణుగూరు అటవీ ప్రాంతాల్లో పోలీసు బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ ను నిర్వహించడం జరుగుతోందననారు.
ఇందులో భాగంగానే బుధవారం చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నాపురం అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి 01 పిస్టల్, ఒక 8mm రైఫిల్, బ్లాస్టింగ్ సామాగ్రిని, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు.
ఈ నెల 27 వరకు జరగనున్న మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా పోలీసు బలగాలు జిల్లాలోని చర్ల, మణుగూరు, ఛత్తీస్ గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. మావోయిస్టులు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా పోలీసు బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తూనే ఉంటారని వెల్లడించారు.