మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ మృతి ప్రచారంపై భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ కీలక ప్రకటన చేశారు. ఈమేరకు ఓఎస్డీ (ఆపరేషన్స్) వి. తిరుపతితో కలిసి ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. గత కొంత కాలంగా కరోనా వైరస్ సోకి బాధపడుతూ ఈనెల 21వ తేదీన ఉదయం సమయంలో గుండె నొప్పితో హరిభూషణ్ మరణించినట్లు తమకు విశ్వసనీయ సమాచారం ఉందని ఎస్పీ సునీల్ దత్ ప్రకటించారు. మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు సహా కింది స్థాయి సభ్యులు, మిలీషియా కూడా కరోనా వైరస్ బారిన పడినట్లు గతంలోనే తాము వెల్లడించామన్నారు.
మావోయిస్ట్ పార్టీ నేతలు కూకటి వెంకన్న, శారద, సోను, వినోద్, నందు, ఇడుమ, దేవె, మూల దేవేందర్ రెడ్డి, దామోదర్, భద్రులు కూడా కరోనా వైరస్ సోకి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తమకు విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. కానీ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ నేతలు నంబాల కేశవరావు @ బసవరాజు, మల్లోజుల వేణుగోపాల్ రావు @ అభయ్ లు మాత్రం మావోయిస్ట్ పార్టీలో ఎవరూ కూడా కరోనా బారిన పడలేదని ప్రకటనలు విడుదల చేశారని గుర్త చేశారు. తెలంగాణ స్టేట్ కమిటీ కార్యదర్శి హరిభూషణ్ (50) మరణంతో మావోయిస్ట్ పార్టీలోని అగ్రనాయకులు, దిగువ స్థాయి నాయకులు, సభ్యులు కూడా కరోనా వైరస్ సోకి బాధపడుతున్నట్లు తేటతెల్లమైందన్నారు. సరైన వైద్యం అందక మావోయిస్ట్ నేతలు సోబ్రాయి, నందు, హరిభూషణ్ తోపాటు ఇతర నాయకుల మరణాలకు మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలే భాద్యత వహించాలని ఎస్పీ సునీల్ దత్ వ్యాఖ్యానించారు.
మావోయిస్ట్ పార్టీలోని నాయకులు, సభ్యులు కరోనా వైరస్ సోకి సరైన వైద్యం అందక ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. మావోయిస్ట్ పార్టీని వదిలి బయటకు రావాలని చూస్తున్న నాయకులను, సభ్యులను పార్టీ అగ్రనాయకత్వం బయటకు రానివ్వకుండా అడ్డుపడుతూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీ హరిభూషణ్ మరణంతో రాష్ర్టంలో మావోయిస్ట్ పార్టీ పూర్తిగా తమ ఉనికిని కోల్పోయినట్లయిందని ఈ సందర్భంగా చెప్పారు. నిషేధిత మావోయిస్ట్ పార్టీలో కరోనా వైరస్ సోకి ఇబ్బందులు పడుతున్న నాయకులు పోలీసుల ఎదుట లొంగిపోయి మెరుగైన వైద్యం పొందవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుండి అందాల్సిన అన్ని రకాల ప్రతిఫలాలను పోలీసు శాఖ తరపున అందేలా తాము భాద్యత తీసుకుంటామని ఎస్పీ సునీల్ దత్ స్పష్టం చేశారు.