పోలీస్ ఇన్ఫార్మర్ పేరుతో మావోయిస్టు నక్సలైట్లు చంపిన వ్యక్తి ఆ పార్టీ రాష్ట్ర అగ్రనేతలు హరిభూషణ్, దామోదర్, చంద్రన్నల కొరియర్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ప్రకటించారు. మావోయిస్టు పార్టీలో పనిచేయాలని మావోయిస్టు పార్టీ హరిభూషణ్ తోపాటు దామోదర్ అతన్ని చిత్రహింసలకు గురి చేసి చంపారన్నారు. ఈమేరకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఎస్పీ సునీల్ దత్ ఈ హత్యోదంతంపై ఏమంటున్నారంటే…
ఈరోజు ఉదయం సుమారుగా 7 గంటల సమయంలో చర్ల మండలం చెన్నాపురం-గోరుకొండ గ్రామాల మధ్యలో అటవీ ప్రాంతంలోని రహదారిపై ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. అనంతరం మృతదేహాన్ని గురించి విచారణ చేపట్టి ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన నాయకులపు ఈశ్వర్ అనే వ్యక్తిగా గుర్తించడం జరిగింది. మృతుని కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు అతను గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణా రాష్ట్ర కమిటీ మావోయిస్టు పార్టీ అగ్రనాయకులైన హారిభూషణ్, దామోదర్, చంద్రన్నలకు కొరియర్ గా పనిచేసేవాడని తెలిసింది.
గత పదిరోజుల నుండి మావోయిస్టు పార్టీ కోసం పనిచేయాలని హరిభూషణ్, దామోదర్ లు ఈశ్వర్ ను తీవ్రమైన ఒత్తిడికి గురిచేసి, చిత్రహింసలు పెట్టి ఈ రోజు అతనిని గొంతు నులిమి చంపివేసినారు. మావోయిస్టులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, సామాన్య ప్రజలలో భయాందోళనలు సృష్టించటానికి అతనిపై పోలీస్ ఇన్ఫార్మర్ అని ముద్ర వేసినారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్ల పోలీస్ స్టేషన్లో క్రైం నెం. 165/2020 క్రింద U/s 143, 147 ,148,302 r/w 149,120 (B) IPC , 25(1-B) IA Act , Sec 10,13,20 UAP Act సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది అని ఎస్పీ సునీల్ దత్ పేర్కొన్నారు.