భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు పొద్దుగూకింది. ఎమ్మెల్యేకు పొద్దుగూకడమేంటి..? అని ఆశ్చర్యపోకండి. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పదే పదే ఓ విషయాన్ని ప్రస్తావిస్తుండేవారు. తాను అప్పట్లో నిర్వహించిన వరుస ఆత్మీయ సమ్మేళనాలకు తన వెన్నంటి ఉండే నాయకులను, అనుచరులను హాజరుకాకుండా అప్పటి అధికార బీఆర్ఎస్ నాయకులు నిలువరిస్తున్నారనేది పొంగులేటి వాదన. అధికార బలంతో, నయానో, భయానో ప్రస్తుతానికి వారిని కట్టడి చేసి ఉండవచ్చనేది పొంగులేటి ఆరోపణ. అందువల్లే ఆత్మీయ సమావేశాల్లో పొంగులేటి మాట్లాడుతూ, ‘పొద్దుగూకిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుంది’ అని పదే పదే నిర్వచిస్తుండేవారు. అచ్చం పొంగులేటి చెప్పినట్లే రాజకీయంగా తాజా సీన్ చోటు చేసుకోవడం విశేషం.
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ తరపున భద్రాచలం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంకట్రావుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిజానికి తెల్లం వెంకట్రావు మొదటి నుంచీ పొంగులేటి శిష్యుడే కావడం గమనార్హం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వెంకట్రావు 2014లో మహబూబాబాద్ ఎంపీగా, 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా భద్రాచలం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ రెండు సందర్భాల్లోనూ పొంగులేటి అండతోనే వెంకట్రావు ఆయా టికెట్లను దక్కించుకున్నారు. ఆ తర్వాత పొంగులేటితోపాటే టీఆర్ఎస్ లో కొనసాగిన వెంకట్రావు గత జూలై 2వ తేదీన ఆయనతోపాటే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి తన అనుచరులందరికీ గరిష్టంగా టికెట్లు ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్రయత్నించారు. ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల నుంచి తన అనుచరులకే టికెట్లు ఇప్పించుకోగా, పొంగులేటి సహా నలుగురు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే భద్రాచలం నుంచి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పొదెం వీరయ్య ఉండడంతో వెంకట్రావుకు టికెట్ గగనంగా మారింది. దీంతో అనివార్యంగా వెంకట్రావు బీఆర్ఎస్ లో చేరి టికెట్ దక్కించుకుని, అనూహ్య విజయాన్ని సాధించారు. బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా మిగిలారు.
నిజానికి ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో అప్పటికే విజయం సాధించిన వెంకట్రావు కాంగ్రెస్ లో చేరుతారని అదేరోజు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అనేక పరిణామాల మధ్య ఎట్టకేలకు వెంకట్రావు చివరికి ఆదివారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పొద్దు గూకిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుందనే పొంగులేటి పదే పదే ప్రస్తావించిన అంశాన్ని నిజం చేశారు. పొంగులేటి శిష్యుడైన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో మంత్రి స్థాయికి ఎదిగిన పొంగులేటి చేతుల మీదుగానే కండువా కప్పించుకుని పార్టీ మారడం గమనార్హం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తొమ్మది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పొంగులేటి అనుచర ఎమ్మెల్యే సంఖ్య నాలుగుకు పెరగగా, తనతో కలిపి ఐదుకు చేరడం మరో విశేషం.