‘ఉన్నొక్క మెతుకు గంజిలో పడింది’ అనేది సామెత. ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీకి త్వరలోనే ఈ సామెతను అన్వయించే పరిస్థితి ఏర్పడవచ్చనేది రాజకీయ పరిశీలకుల అంచనా. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం తన కుటుంబంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలవడమే ఇందుకు కారణం. తన నియోజకవర్గ అభివృకి నిధులు మంజూరు చేయాలంటూ ఎమ్మెల్యే వెంకట్రావు సీఎంను కలవడం ఇది మొదటిసారి కాదు.. రెండోసారి కావడం గమనార్హం. ఇంతకీ తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ లో ఉంటారా? కాంగ్రెస్ లో చేరుతారా? ఆదివారం నాటి తాజా సీన్ నేపథ్యంలో భద్రాచలం ఎమ్మెల్యే తదుపరి రాజకీయ అడుగులపై సహజమైన చర్చే జరుగుతోంది.
నిజానికి వెంకట్రావు రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆయన పయనం ఎటువైపు? అనే అంశం ఇట్టే బోధపడుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తెల్లం వెంకట్రావు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శిష్యుడనే విషయం బహిరంగమే. పొంగులేటి ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన వెంకట్రావు మహబూబాబాద్ నుంచి 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పొంగులేటితోపాటే బీఆర్ఎస్ లో చేరారు. భద్రాచలం నుంచి 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి పరాజయం పాలయ్యారు. గత జూలై 2వ తేదీన పొంగులేటితోపాటు రాహుల్ గాంధీ సమక్షంలో వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో తెల్లం వెంకట్రావుకు పొంగులేటి టికెట్ ఇప్పించే అవకాశం లేకుండాపోయింది. భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఉండడంతో గత ఆగస్టు 17న మంత్రి కేటీఆర్ సమక్షంలో వెంకట్రావు తిరిగి బీఆర్ఎస్ లో చేశారు. భద్రాచలంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి సరైన అభ్యర్థి కూడా లేకపోవడంతో అనివార్యంగా ఆయనకే పార్టీ టికెట్ దక్కింది. కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యపై వెంకట్రావు 5,179 ఓట్లతో గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగిడారు. గత ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఫలితాలు వెలువడుతుండడం, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే సంఖ్యా బలం వెల్లడి కాగానే వెంకట్రావు కాంగ్రెస్ చేరనున్నట్లు అదేరోజు వార్తలు వెలువడడం గమనార్హం. వెంకట్రావు మంత్రి పొంగులేటి శిష్యుడు కావడమే ఇందుకు ప్రధాన కారణం.
ఈ నేపథ్యంలోనే వెంకట్రావు గతంలోనే సీఎం రేవంత్ రెడ్డిని ఓసారి కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవగా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ సీన్ లో ఉండడం గమనార్హం. దీంతో తెల్లం వెంకట్రావు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయంగా ప్రచారం జరుగుతోంది. అయితే అది పార్లమెంటు ఎన్నికలకు ముందా? తర్వాతా? అనేది తేలాల్సి ఉందంటున్నారు. మొత్తంగా వెంకట్రావు కాంగ్రెస్ లో చేరడం జరిగితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నొక్క ఎమ్మెల్యే చేజారినట్లుగానే భావిస్తున్నారు.
ఇమేజ్: తన కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, చిత్రంలో మంత్రి పొంగులేటి కూడా ఉన్నారు.