కరోనా పాజిటివ్ పేషెంట్లు అనవసరంగా బెంబేలెత్తుతుంటారు. ప్రాణం పోతుందేమోనని భీతిల్లుతుంటారు. కరోనాతో సహజీవనం చేయాలని పాలకులు ఎంతగా మొత్తుకుంటున్నా ప్రజలకు ఇప్పటికీ బోధపడడం లేదు. టెస్టుల్లో కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్ ఎలా ప్రవర్తించాలి? చికిత్సకు బయలుదేరే సన్నివేశం రక్తి కట్టాలి. కత్తీ, డాలు పట్టుకుని యుద్ధానికి బయలుదేరుతున్నట్లు ప్రవర్తించాలి. మాంచి సమరోత్సాహాన్ని తలపించాలి. వీలైతే కుటుంబ సభ్యుల పాదాలకు ప్రణమిల్లి నన్ను దీవించు తల్లీ… అంటూ ఆశీర్వాదం తీసుకోవాలి. విజయీ భవ… దిగ్విజయీ భవ… అంటూ స్థానిక ప్రజల చేత జేజేలు పలికించుకోవాలి. జనం ఈలలు, కేరింతల మధ్య అంబులెన్స్ ఎక్కి ఆసుపత్రికి బయలుదేరాలి.
ఏమిటీ వింత… అనుకుంటున్నారు కదూ! కావాలంటే దిగువన గల ఈ వీడియోను చూడండి. పేరు తెలియదుగాని, బెంగళూరులోని పదరాయనపుర నియోజకవర్గంలోని మున్సిపల్ కౌన్సిలర్ అట. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు కరోనా ‘పాజిటివ్’ రిజల్ట్ వచ్చిందట. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లాలి కదా? ఇదిగో ఇలా బీభత్సమైన సమరోత్సాహంతో, రణరంగంలోకి దిగకముందే విజయోత్సవ సంబరాన్ని చేసుకుంటున్న విధంగా ఎలా అంబులెన్స్ ఎక్కడో మీరే తిలకించండి. వెళ్లే ముందు జన సమూహ కేరింతల మధ్యే విచ్చలవిడిగా సంచరించిన సదరు నాయకుడి కారణంగా మరింత మందికి కరోనా అంటుకుంటే బాధ్యులెవరని మాత్రం అడక్కండి.
స్వతంత్ర దేశంలో ‘చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్..’ అంటూ ఆకలి రాజ్యంలో సినిమాలోని ఓ పాటలో గేయ రచయిత ఎప్పుడో చెప్పారు కదా! ప్రస్తుతం ‘కరోనా కల్లోలంలో పాజిటివ్ పేషెంటుగా తేలిన ఇటువంటి ప్రజాప్రతినిధి చికిత్సకు వెళ్లే సీన్ కూడా ఓ సంబరమే…’ కావచ్చు. ఇక వీడియో చూసేయండి.