ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి తన లైవ్ షోల్లో కేవలం అరవడం ద్వారానే బాగా పాపులర్ అయ్యారా? తను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక గల కారణాలు ఏమిటి? జర్నలిజంలో తన ప్రస్థానమేమిటి? అసలు ‘టైమ్స్ నౌ’ ఛానల్ నుంచి ఆయన ఎందుకు నిష్క్రమించారు? రిపబ్లిక్ చానల్ ను ఎందుకు స్థాపించారు? దాన్ని ప్రస్తుతం నంబర్ వన్ స్థాయికి ఎలా తీసుకువెళ్లగలిగారు? ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ మరణానికి సంబంధించిన అంశంలో ఆర్నబ్ సాధించిన విజయమేంటి? ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలతో ఎవరోగాని ఓ కథనాన్ని రాశారు. ఇందులో వాస్తవ, అవాస్తవాల సంగతి ఎలా ఉన్నప్పటికీ ఆద్యంతం చదివించేదిగా కథనం ఉండడమం గమనార్హం. ఈ కథనం సోషల్ మీడియాలో తిరుగుతోంది. భాషా దోషాలను సవరిస్తూ అక్కడక్కడా ‘ఎడిట్’ చేసిన ఆయా ఆసక్తికర కథనాన్ని దిగువన మీరూ చదివేయండి.
ఆర్నాబ్ గో స్వామి ‘టైమ్స్ నౌ’ నుండి ఎందుకు బయటికి వచ్చాడు? తను సొంతంగా ఎందుకు ‘రిపబ్లిక్’ చానెల్ పెట్టుకున్నాడు? 2016లో ఇవన్నీ మన కళ్ల ముందే జరిగాయి. కానీ ఎక్కడా దీనికి కారణమేంటో ఎవరూ చెప్పలేదు. ఏదో గొడవలు వచ్చి ఉంటాయనుకున్నారు. కానీ అసలు ఆ గొడవ ఏంటో ఎవరికీ తెలీదు. ఇలా ఒక చానెల్ నుండి ఇంకో చానెల్ కి మారడం మనం తరుచూ చూస్తూనే ఉంటాము. కానీ ఒక న్యూస్ చానెల్ లో పనిచేసి బయటికి వచ్చి సొంతంగా న్యూస్ చానెల్ పెట్టుకొని, అప్పటివరకూ తను పనిచేసిన న్యూస్ చానల్ నంబర్ వన్ స్థానానికి కారకుడైన వ్యక్తి దాన్ని నంబర్ వన్ స్థానం నుంచి కిందకి నెట్టి రిపబ్లిక్ టీవీని ఆ స్థానంలోకి తీసుకురావడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ని స్వీకరించి దానిని సక్సెస్ చేయడం అనేది ఆర్నాబ్ గో స్వామికే చెల్లింది.
ఆర్నాబ్ గోస్వామి 1973 మార్చ్ 7న అస్సాంలోని గువాహటిలో జన్మించారు. తండ్రి మనోరంజన్ గోస్వామి ఆర్మీలో 30 ఏళ్ళు పని చేసి కల్నల్ గా చేసి రిటైర్ అయ్యారు. మనోరంజన్ గోస్వామి ఆర్మీలో ఆఫీసర్ గా పనిచేసినా… మంచి రచయిత కూడా. పత్రికలకీ కాలమ్స్ రాసేవారు. అలాగే చాలా పుస్తకాలు కూడా రాశారు. మనోరంజన్ గోస్వామి రచనలకు అస్సాం సాహిత్య సభ అవార్డ్ ఇచ్చింది. తల్లి సుప్రభా జైన్ గోస్వామి ప్రసిద్ధ రచయిత్రి.
ఆర్నాబ్ తన జర్నలిజం కెరీర్ ని కలకత్తా లోని ‘ది టెలీగ్రాఫ్’తో మొదలుపెట్టారు. అక్కడ ఒక సంవత్సరం పనిచేశాక 1996లో ఎన్డీటీవీలో న్యూస్ రీడర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టారు. ఎన్డీటీవీలో ‘News Tonight’ అనే ప్రోగ్రామ్ చాలా ఫేమస్ అయ్యింది. బెస్ట్ ఆసియా న్యూస్ యాంకర్ గా 2004లో అవార్డ్ దక్కింది. 1996 నుండి 2006 వరకు ఎన్డీటీవీలో పనిచేశారు తరువాత 2006లో కొత్తగా లాంచ్ చేసిన ‘టైమ్స్ నౌ’లో ఎడిటర్ – ఇన్ -చీఫ్ గా ఆర్నబ్ జాయినయ్యారు.
టైమ్స్ నౌ లో రాత్రి 9 గంటలకి ప్రసారమయ్యే NEWS HOUR ప్రోగ్రామ్ చాలా ఫేమస్ అయ్యింది. న్యూస్ అవర్ ప్రోగ్రామ్ లైవ్ టెలీకాస్ట్ లో చాలా మంది ప్రముఖలను ఆహ్వానించేవారు. చర్చ చాలా ఉద్వేగపూరితంగా, సూటిగా సాగేది. చర్చ పక్కదారి పట్టినప్పుడల్లా ఆర్నాబ్ తీవ్ర స్వరంతో తన ప్రశ్నని పదే పదే అడిగేవాడు. అప్పట్లో అది అందరికీ నచ్చింది. కానీ అవే ప్రశ్నలు అంతే తీవ్రస్వరంతో అందరినీ అడగడం మొదలుపెట్టేసరికి కొందరికి కోపం వచ్చింది , అహం దెబ్బతిన్నది.
ఫలితంగా ఆర్నాబ్ తన పదేళ్ల టైమ్స్ నౌ కెరీర్ ని వదులుకోవాల్సి వచ్చింది. అందుకు బయటికి చెప్తున్న కారణాలు వేరు. అంతర్గతంగా న్యూస్ రూమ్ రాజకీయాలు వేరు. ఏ మీడియా హౌస్ లలో అయినా న్యూస్ రూమ్ పాలిటిక్స్ ఉంటాయి. ఏ వార్తను హైలైట్ చేయాలి ? మరే వార్త తీవ్రతను తగ్గించి చెప్పాలి? ఇలా ఉంటాయి ప్రాధాన్యతలు. అఫ్కోర్స్ మీడియా హౌస్ బాస్ కి ఏదో ఒక రాజకీయ పార్టీతో సత్ [?] సంబంధాలు, తద్వారా మొహమాటాలు, ఇచ్చి పుచ్చుకోవడాలు ఉంటాయనే ప్రచారం ఉండనే ఉంది. బదులుగా వాళ్ళకి సంబంధించిన వార్తలను అసలు కవర్ చేయకపోవడమో, లేదా చివరలో ఓ రెండు ముక్కలు ప్రస్తావించడమో జరుగుతుంటాయి. ఇవన్నీ మనకి తెలిసినవే.
కానీ అర్నాబ్ అలాంటి మొహమాటాలకి పోయే వ్యక్తి కాదు. తను చెప్పదలుచుకున్న వార్తను, దాని ప్రాముఖ్యతని బట్టి తీవ్రంగా స్పందిస్తాడు. అలాగే సూటిగా ప్రశ్నలు వేస్తాడు. ఇంతకీ టైమ్స్ నౌ నుండి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హత్య కేసు, దానికి డ్రగ్స్ లింకులు బయటపడడం అది కాస్తా బాలీవుడ్ ని షేక్ చేయడం అన్నిటికీ ఒక దానికి ఒకటి లింక్ ఉంది కదా?. అదేవిధంగా 2016లో కాశ్మీర్ సరిహద్దు పట్టణమైన ‘యూరీ ‘లో పాకిస్తాన్ టెర్రరిస్ట్ దాడిలో చనిపోయిన భారత జవాన్ల సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ‘అయ్ దిల్ ముష్కిల్ ‘ సినిమా కూడా రిలీజైంది. అయితే ఇందులో ప్రధాన పాత్ర పోషించిన పాకిస్తాన్ నటుడు ఫహద్ ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్ , షారూఖ్ ఖాన్ కానీ ఉగ్రవాద దాడులమీద ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. దీనినే అర్నాబ్ తన ‘NATION WANTS TO KNOW ‘ ప్రోగ్రామ్ లో నేరుగా షారూఖ్, అమీర్, సల్మాన్ లని ప్రశ్నించాడు సూటిగా. ఇది ఖాన్ త్రయానికి నచ్చలేదు వెంటనే కరణ్ జోహార్ దగ్గరికి వెళ్ళి ఒక జర్నలిస్ట్ మనల్ని ప్రశ్నించడమేంటి అని నిలదీశారు. కరణ్ తన మిత్రుడు, సహ నిర్మాత వినీత్ కుమార్ జైన్ ని నేరుగా ప్రశ్నించాడు.
వినీత్ కుమార్ జైన్ టైమ్స్ నౌ కి బాస్. తను కూడా జర్నలిస్టే కానీ ఎన్డీటీవీలో పనిచేస్తున్న అర్నాబ్ లోని స్పార్క్ ని చూసి మొదట ఒక చిన్న స్టూడియో లో టైమ్స్ నౌ చానెల్ 2006లో మొదలుపెట్టాడు. అర్నాబ్ ప్రతిభ వల్ల అంచెలంచాలుగా ఎదిగి తరువాతి కాలంలోనే No.1 చానెల్ గా అవతరించింది. అయితే టైమ్స్ నౌ ని అర్నాబ్ చూసుకుంటూ ఉండడం, అది బాగా పనిచేస్తుండడంతో వినీత్ కుమార్ జైన్ సినిమా రంగం వైపు అడుగులు వేశాడు. కరణ్ జోహార్ తన ప్రాణ స్నేహితుడైన (ఎలా అని అడగవద్దు) వినీత్ కుమార్ జైన్ తో కలిసి సహ నిర్మాతగా ‘RAAZI’ అనే సినిమా తీశాడు కూడా. సో… ఈ నేపథ్యంలోనే తన ప్రాణ స్నేహూతుడుకి కానుకగా ఆర్నాబ్ ని టైమ్స్ నౌ నుండి అవమానకరంగా తీసేశాడు వినీత్ కుమార్ జైన్. ఉదయాన్నే తను స్టూడియోలోకి అడుగుపెడుతున్న సమయంలో సెక్యూరిటీ గార్డ్ ఆర్నాబ్ ని ఆపేశాడు ప్రవేశం లేదంటూ. విషయం అర్ధం చేసుకున్న ఆర్నాబ్ వెనక్కి వెళ్లిపోయాడు.
తన పార్టీలలో కొందరిని మంచి చేసుకుని బతికే ఒక సినిమా డైరెక్టర్ ఒక నెంబర్ వన్ చానెల్ తో పాటు నెంబర్ వన్ జర్నలిస్టుని ప్రభావితం చేయడం ఆర్నాబ్ కి అస్సలు నచ్చలేదు. అసలు తన విధానమేమిటో ‘ఆర్నాబ్ కి బాగా తెలుసు. ఎవరూ చెప్పనవసరంలేదు. డ్రగ్స్ అనేది అటు రాజకీయాలను, ఇటు దేశంలోని అన్ని చిత్ర పర్రిశ్రమలనే తన గుప్పిట్లో పెట్టుకొని, సినీ హత్యలు… అది కూడా దావూద్ గ్యాంగ్ ఒక ప్రముఖ నటుడు సుశాంత్ ని, అతని మేనేజర్ ని హత్య చేయించి, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడమనేది తీవ్రమయిన విషయమే. అందుకే ఆత్మహత్యగా మొదట చిత్రీకరించిన సుశాంత్ ఘటనను తన వరుస ఇంటర్వ్యూలతో వెలుగులో తీసుకురావడం వల్లనే అది హత్య అనీ, అందులో డ్రగ్స్ వ్యవహారం ఉందనీ ప్రపంచానికి తెలియజేశారు ఆర్నాబ్.
ఎస్…! దమ్మూ, ధైర్యం, నిజాయితీ ఉన్న నిఖార్సయిన జర్నలిస్ట్ తను. తన తండ్రి పనిచేసిన సైన్యం అంటే ఆర్నబ్ కు విపరీతమయిన గౌరవం. అదే తనను తిరిగి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టింది. తను సొంతంగా పెట్టిన రిపబ్లిక్ చానెల్ ఇప్పుడు దేశంలో నంబవర్ వన్ స్థానంలో ఉంది. తను ఓవర్ గా యాక్ట్ చేశాడని విమర్శించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే… డ్రగ్స్, హత్యా రాజకీయాలు, హవాలా ద్వారా దావూద్ డబ్బు బాలీవుడ్ లో ఎలా రాజ్యమేలుతున్నదో దేశానికి తెలియజెప్పాడు. IPL నెపంతో అందరూ కట్ట గట్టుకుని దుబాయ్ కి వెళ్ళిపోయారంటేనే తెలుస్తున్నది డొంక ఎంత లోతుగా కదిలిందో? ఇంకో పక్క కర్నాటకలో కూడా డ్రగ్స్ వ్యవహారం సంచలనాలు రేపుతున్నది. బుజ్జిగాడు సినిమాలో యాక్ట్ చేసిన కన్నడ నటి సంజనాతో పాటు రాగీణీ ద్వివేదీని అరెస్ట్ చేసింది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. ఇక సంజనా అయితే తన వెనుక చాలా పెద్దవాళ్ళు ఉన్నారంటూ పోలీసులను బెదిరించే దాకా వెళ్లిందంటే అర్ధం చేసుకోవచ్చు దీని వెనక ఎంత పెద్ద రాకెట్ ఉందో? షరా మామూలుగానే వీటన్నిటినీ మూసేసేస్తారా? లేక లెక్కలు బయటికి తీసి లోపలేస్తారా ? మోటా భాయ్ తలుచుకుంటే ఇదో పెద్ద విషయం కాదు కదా?
జైహింద్!
(అజ్ఞాత రచయితకు కృతజ్ఞతలతో…)