ఎవరీ భారతక్క? ఏమా సినిమా ‘కత’!?-2
‘ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం. ఎవరినీ ఉద్ధేశించినవి కావు’ అని నిర్మాతలు, దర్శకులు ముక్తాయించడం చాలా సినిమాల్లో చూస్తుంటాం. కారణాలు ఏవైనా కావచ్చు… కానీ అబ్బే ఆ పాత్ర మేం సొంతంగా అల్లుకున్నాం, కల్పిత కథనంతో చిత్రీకరించాం అని చెప్పుకోవడం సినిమా వాళ్లకు కొత్తేమీ కాదు. పలు సినిమాల విడుదల సందర్భంగా చోటు చేసుకున్న అనేక వివాదాలు ఇదే అంశాన్ని స్పష్టం చేశాయి కూడా.
ఇక సురేష్ ప్రొడక్షన్స్ వారి ‘విరాటపర్వం’ సినిమాలో భారతక్క ఎవరనేదే కదా అసలు ప్రశ్న. సాయుధ విప్లవోద్యమ చరిత్రలో పులువురు భారతక్కలు ఉన్నప్పటికీ, సంచలనాత్మక పాత్ర గల భారతక్క మాత్రం ఒక్కరే ఉన్నారు. ఆ భారతక్క ఎవరో తెలుసుకునే ముందు అసలు ‘విరాటపర్వం’ అంటే ఏమిటి…? టైటిల్ పౌరాణిక సినిమాను తలపిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రచారపు పోస్టర్లు లేదంటే మోషన్ పిక్చర్స్… సినిమా పరిభాషలో ఏదైనా వాటి భాష్యం ఏదైనా కావచ్చు. కానీ, ఆ పోస్టర్లు చెబుతున్నదేమిటి? విరాటపర్వం పక్కా విప్లవ సినిమా అని.
దగ్గుబాటి రానా తన మూతికి ఎర్రని మాస్క్ కట్టుకుని దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన విప్లవయోధుడిలా కనిపిస్తున్నారు. సాయిపల్లవి అమరవీరుల స్థూపం వద్ద కూర్చుని ఎవరికోసమో వెయిట్ చేస్తోంది. పౌరహక్కుల సంఘం నాయకురాలా? లేక నక్సల్ అగ్రనేత ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టా? ప్రియమణి అలివ్ గ్రీన్ డ్రెస్, అధునాతన ఆయుధాన్ని ధరించి సాయుధ నక్సల్ గా కనిపిస్తున్నారు. సో… మొత్తంగా సినిమా యావత్తూ ‘ఎర్రజెండా’ కథనమే కావచ్చు. ఇక విరాటపర్వం అంటే పౌరాణిక గాథ ప్రకారం ‘అజ్ఞాత వాసం’ అన్నమాట. అరణ్యవాసం ముగిశాక పాండవులు ఏడాదిపాటు పాటించిందే ‘అజ్ఞాత వాసం’. మారువేషాల్లో సంచరించే పంచ పాత్రలు. కాబట్టి ‘విరాటపర్వం’ టైటిల్ చెబుతున్నదేమిటి…? ‘అజ్ఞాత’ వాసానికి సంబంధించిన ‘కథ’ అని. జనజీవనంలో కాకుండా అడవుల్లో ‘అజ్ఞాత’ వాస యుద్ధం చేసిన విప్లవ నేపథ్యమే విరాటపర్వం సినిమా కథగా గోచరిస్తోంది. మరి భారతక్క ఎవరు?
ఒకప్పటి పీపుల్స్ వార్, ప్రస్తుత మావోయిస్టు పార్టీ అగ్రనేత రామకృష్ణ అలియాస్ పోలం సుదర్శన్ రెడ్డి భార్య. చంద్రకళ అలియాస్ భారతక్క. అప్పటి పీపుల్స్ వార్ జిల్లా కమిటీ సభ్యురాలు. ఉత్తర తెలంగాణా కమిటీ కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించడానికి కొద్ది రోజుల ముందే ఆదిలాబాద్ జిల్లా లక్ష్మాపూర్ వద్ద జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో ఆర్కే అలియాస్ సుదర్శన్ రెడ్డి మరణించారు. ఆయన భార్య చంద్రకళ అలియాస్ భారతక్క ప్రస్తుతం ఓ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఏమిటీ భారతక్క కథ అంటే…? పీడిత, తాడిత ప్రజల కోసం ఆర్కే అడుగు జాడల్లో నడిచిన విప్లవ పోరాట నేపథ్యం.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన వరంగల్ జిల్లా ‘కౌకొండ’ గుట్టల్లో జరిగిన భీకర ఎన్కౌంటర్ ఘటన. కౌకొండ గుట్టలను భారీ ఎత్తున పోలీసు బలగాలు చుట్టుముట్టి గంటలకొద్దీ హోరాహోరీ తలపడిన సంఘటన. 2000 సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగిన ఈ ఉదంతంలో దాదాపు 13 మంది పీపుల్స్ వార్ నక్సల్స్ నేలకొరిగారు. ఆర్కే అలియాస్ సుదర్శన్ రెడ్డి, ఆయన భార్య భారతక్క తదితర అనేక మంది ముఖ్య నేతలు ఈ ఎన్కౌంటర్ నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు.
‘టార్చ్’ లైట్ల వెలుతురులో పోలీసులు కౌకొండ గుట్టలను జల్లెడ పట్టారు. అణువణువునా గాలించినప్పటికీ పలువురు ముఖ్య నక్సల్ నాయకులు ఎన్కౌంటర్ నుంచి తప్పించుకోవడం అప్పట్లో కలకలం. గుట్టల్లోని ‘సొరికె‘ (గుహలు)లో దాక్కుని, కిలోమీటర్ల కొద్దీ పాక్కుంటూ వెళ్లి నక్సల్స్ తమ ప్రాణాలను కాపాడుకున్నారు. టూ ఇంచ్ మోర్టార్లను కూడా పోలీసులు తొలిసారి కౌకొండ ఎన్కౌంటర్లో వినియోగించారు. రెండు దశబ్ధాల క్రితం జరిగిన ఈ ఎన్కౌంటర్ ఘటన గుర్తున్నంత వరకు ఇంతే. అటు పోలీసులు, ఇటు నక్సల్స్ హోరాహోరీగా పరస్పరం తలపడిన ఈ ఎన్కౌంటర్ అప్పట్లో భారీ సంచలనం.
ఈ ఘటననే సినిమాగా తీస్తున్నారా? అయితే ‘విరాటపర్వం’ సినిమాలో ప్రియమణి చేత పోషింపజేసిన భారతక్క పాత్ర చంద్రకళ అనే ‘నక్సల్ లీడర్’దేనా? ఇదీ సంశయం. వాస్తవానికి అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో భారతక్క పేరుతో మరో ముగ్గురు, నలుగురు నక్సల్స్ కూడా ఉండేవారు. కానీ వాళ్లు దళసభ్యుల స్థాయిని మించకపోవడం గమనార్హం. ఓ దళాన్ని లీడ్ చేస్తూ జిల్లా కమిటీ సభ్యురాలి స్థాయికి పార్టీలో ఎదిగిన భారతక్క చంద్రకళ మాత్రమేనని మాజీ నక్సల్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ సినిమాలో దగ్గుబాటి రానా పోషిస్తున్నది ఆర్కే అలియాస్ సుదర్శన్ రెడ్డి పాత్రేనా? అనేది కూడా ఈ సందర్భంగా చర్చకు దారి తీస్తోంది. లేదంటే ‘కొయ్యూరు’ ఎన్కౌంటర్ లో చనిపోయిన నల్లా ఆదిరెడ్డి పాత్రను సినిమాలో రానాకోసం అల్లుకున్నారా? అనేది మరో ప్రశ్న. మొత్తంగా ‘విరాటపర్వం’ విప్లవ నేపథ్యపు సినిమాగా తేలిపోయింది. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితమని దర్శకుడు సినిమాలో ప్రకటిస్తారా? లేక వాస్తవ పాత్రల ద్వారా అల్లుకున్న కథనమని చెబుతారా? వేచి చూడాల్సిన అంశం.
కానీ… తాజా పరిణామాల్లో ఇటువంటి విప్లవ సినిమాలపట్ల పాలకుల వైఖరి ఎలా ఉంటుంది? ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి? పోలీసు శాఖ స్పందనేమిటి? సెన్సార్ బోర్డు తిప్పలు తప్పవా? సినిమా పక్కా కమర్షియల్ విలువలతో తీస్తున్నారా? అదే జరిగితే రామోజీరావు తరహాలో బాధ్యులు విమర్శల పాలవుతారా? వక్రీకరణ లేని చిత్రీకరణ ద్వారా ప్రశంసలను అందుకుంటారా? ఇవీ సందేహాలు. ఎందుకంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సాయుధ విప్లవ కార్యకలపాల ఉనికి అంతంత మాత్రమే.