తెలంగాణా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర వెనుక గల కారణాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈమేరకు నిందితుడు రాఘవేంద్రరాజు పోలీసుల విచారణలో కీలక అంశాలను వెల్లడించినట్లు సమాచారం. మంత్రి హత్యకు కుట్ర పన్నడం వెనుక పలు కారణాలు ఉన్నట్లు రాఘవేంద్ర రాజు పోలీసులకు వివరించారు.
ముఖ్యంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన వ్యాపారాలను దెబ్బతీసి, ఆర్థికంగా భారీ నష్టం కలుగజేశాడని,పలు విధాలుగా తనను ఇబ్బందులపాలు చేశాడని రాఘవేంద్రరాజు పోలీసులు చెప్పాడు. తనపై అక్రమ కేసు నమోదు చేయించడంతోపాటు తనకు గల రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బ తీశాడని, బార్ షాపును మూయించాడని అతను తెలిపాడు.
అంతేగాక తనపై అక్రమంగా ఎక్సైజ్ కేసులు నమోదు చేయించడమేగాక,తన ఆధార్ నమోదు కేంద్రాన్ని కూడా మంత్రి రద్దు చేయించాడని, తనపై 30 కేసులు పెట్టించాడని, ఒకేరోజు 10 కేసులు నమోదు చేయించాడని, ఆయా కారణాల వల్లనే మంత్రి హత్యకు కుట్ర పన్నినట్లు రాఘవేంద్ర రాజు పోలీసుల విచారణలో వివరించాడు. మంత్రి హత్యకు కుట్ర కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఇంకోవైపు ఈ అంశంలో బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.