వరంగల్ నగరంలోని ఎల్బీ నగర్ లో జరిగిన దారుణ హత్యల వెనుక గల కారణాలపై పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య నెలకొన్న భారీ నగదు వివాదమే ఘోర ఘటనలకు దారి తీసినట్లు భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం… చాంద్ పాషా, షఫీ అనే సోదరులు పశువుల వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఇరువురి మధ్య రూ. కోటి మొత్తానికి సంబంధించిన వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ తెల్లవారుజామున సుమారు 3.30 నుంచి 4.00 గంటల మధ్య షఫీ సహా ఎడెనిమిది మంది ఆటోలో చాంద్ పాషా ఇంటికి వచ్చారు.
అనంతరం గేటు తీసుకుని లోనికి వెళ్లారు. యాక్సెస్ బ్లేడ్ వంటి పరికరంతో మెయిన్ డోర్ లాక్ ను కట్ చేస్తుండగా శబ్ధం రావడంతో చాంద్ పాషా కుటుంబీకులకు మెళకువ వచ్చి బయటకు వచ్చారు. దీంతో షఫీ తదితరులు కత్తులతో చాంద్ పాషా కుటుంబీకులపై దాడికి పాల్పడారు.
ఈ ఘటనలో చాంద్ పాషా, అతని భార్య సబీరా బేగం, బావమరిది ఖలీం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చాంద్ పాషా ఇద్దరు కుమారులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు. షఫీ ఈ దారుణానికి పాల్పడినట్లు చాంద్ పాషా కుమార్తె పోలీసులకు తెలిపింది. ప్రాథమిక విచారణలో ఈ అంశాలు వెల్లడయ్యాయని, పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.
వరంగల్ ఎల్బీ నగర్ లో జరిగిన దారుణ హత్యలపై పోలీసు అధికారి కథనాన్ని దిగువన గల వీడియోలో చూడవచ్చు.
ఫొటో: హత్యలకు దారి తీసిన పరిణామాలను వివరిస్తున్న ఏసీపీ స్థాయి పోలీసు అధికారి