దశాబ్ధాల నక్సల్బరి ఉద్యమ చరిత్రలో ఎప్పుడూ, ఎన్నడూ లేని విధంగా, సరికొత్త పోకడకు తెరతీస్తూ ఒకప్పటి పీపుల్స్ వార్, ప్రస్తుత మావోయిస్టు పార్టీ విడుదల చేసిన వీడియో ఒకటి దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. యాధృచ్ఛికమో, కాకతాళీయమో తెలియదుగాని నక్సల్బరి ఆవిర్భావ దినోత్సవానికి ముందు రోజే మావోయిస్టులు ఈ వీడియోను విడుదల చేయడం గమనార్హం. ‘విన్ప అంబుష్ ఎగెనెస్ట్ ప్రహార్’ శీర్షికన మావోయిస్టు పార్టీ దండకారణ్య ఎస్ఎమ్సీ పేరుతో 12.15 నిమిషాల నిడివి గల వీడియోను నక్సల్స్ విడుదల చేశారు.
వీడియోలో ఏముందనే అంశాలను క్లుప్తంగా ప్రస్తావిస్తే… విన్ప ఎన్కౌంటర్ చుట్టూనే దృశ్యాలన్నీ తిరిగాయి. పదిహేడు మంది పోలీసు భద్రతా బలగాలను తమ పార్టీకి చెందిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) మట్టుబెట్టిందని, భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని, తమ సహచరులు కూడా ముగ్గురు మరణించారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రస్తావిస్తూ, అణచివేతను, నిర్బంధాన్ని ఎదుర్కునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పార్టీ ఆయా వీడియోలో వెల్లడించింది. ఉద్యమపరంగా ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా, తాము వెనుకంజ వేసే ప్రసక్తే లేదని మావోయిస్టు పార్టీ ప్రకటించడంలో కొత్త విశేషంగాని, ప్రత్యేకతగాని లేకపోవచ్చు. ఉద్యమ పోరాట ప్రస్థానంలో, పార్టీ పంథాలో ఇదీ ఓ భాగమే కావచ్చు. కానీ…?
అసలు ఈ వీడియోను మావోయిస్టు పార్టీ ఎందుకు విడుదల చేసినట్లు? అసలు నక్సలైట్ల ఎత్తుగడ ఏమిటి? సాయుధ పోరాటంలో కొత్తగా వీడియో విడుదల వ్యూహమేంటి? ఆశించిన లక్ష్యమేమిటి? ఇవీ అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ), రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) నిఘా వర్గాల సందేహాలు. అందుకే మావోయిస్టు పార్టీ విడుదల చేసిన వీడియో తాలూకు తాజా పరిణామాలను ఆయా నిఘా వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. వాస్తవానికి ఒకప్పటి పీపుల్స్ వార్, ప్రస్తుత మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకులు ఇటువంటి ప్రచార ఎత్తుగడలకు విరుద్ధం. ఓ రకంగా చెప్పాలంటే మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేటపుడు ముఖాన్ని కూడా సరిగ్గా ఫొటో తీసుకోనివ్వకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. వీపు వెనుకవైపు నుంచిగాని, క్లోజప్ షాట్ లో తుపాకీనిగాని మాత్రమే ఫొటో తీసుకునేందుకు అనుమతిస్తారు. ఇది గతం… మరి ఇప్పడేమిటి ఇలా…?
ఇటీవల అనారోగ్యంతో మరణించిన మావోయిస్టు పార్టీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి రామన్న దాదాపు పదేళ్ల క్రితం ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా తన ముఖాన్ని నేరుగా ఫొటో కూడా తీసుకోనివ్వలేదు. టవల్ తో ముఖాన్ని కప్పుకుని మాత్రమే ఈ ‘కలానికి’ సాక్షి పత్రిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతకు ముందు మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన సందె రాజమౌళి, అనుపురం కొంరయ్య తదితర అగ్రనేతలు కూడా ఎన్నడూ ముఖాలు కనిపించే విధంగా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. పీపుల్స్ వార్ నుంచి మావోయిస్టు పార్టీ ప్రస్థానం వరకు ప్రచారపు తరహా ఇంటర్వ్యూలకు నక్సల్ నేతలు మొగ్గు చూపలేదు.
తాజాగా మావోయిస్టు పార్టీ విడుదల చేసిన వీడియోలో మాత్రం పార్టీ బలగాలను, తమ వెంట గల ప్రజల బలాన్ని, క్షేత్ర స్థలాలను బహిర్గతం చేస్తూ మావోయిస్టు పార్టీ వీడియోను రూపొంందించడం గమనార్హం. ఆయుధ సంపత్తిని సైతం వీడియోలో ప్రదర్శనకు పెట్టారు. సంక్షిప్తంగా చెప్పాలంటే పార్టీ ఆనవాళ్లు ‘అడవి అడవినా’ బహిరంగపర్చారనే చెప్పాలి. ఎందుకిలా…?
ఈ వీడియోలో పాత తరం మావోయిస్టు నేతలెవరూ కనిపిస్తున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీనియర్ నాయకులెవరూ ఇందులో కనిపించలేదు. తుపాకీ కాల్పుల మోతకు సంబంధించిన శబ్దం వీడియోలో వినిపిస్తుంటుంది. ఇదే సమయంలో పరుగెత్తుతున్న సాయుధ నక్సల్స్ కనిపిస్తుంటారు. ఓ భారీ ఎన్కౌంటర్ జరిగే ఉత్కంఠ వాతావరణంలో వీడియో తీసే వ్యవధి చిక్కడం గమనించాల్సిన అంశం కాగా, ఆయా ఘటన తాలూకు దృశ్యంగా పేర్కొంటూ దాన్ని బాహ్య ప్రపంచంలోకి మావోయిస్టు పార్టీ ఎందుకు వదలినట్లు? ఏమిటి వీడియో వెనుక నక్సల్స్ అసలు లక్ష్యం?
‘ఇది మా రాజ్యం. మా జనతన సర్కార్. ప్రజల అండ మాకుంది. ప్రజల్లో మేమున్నాం. మా మీదనే కాదు, మా సిద్ధాంతాల మీద కూడా ప్రజలకు విశ్వాసం ఉంది. ఈ ప్రాంతం మాది. మా రాజ్యంలో అడుగిడే సాహసం చేయవద్దు. వస్తే విన్ప అంబుష్ తరహా నష్టం మీకే’ అని వీడియో ద్వారా మావోయిస్టు పార్టీ పోలీసు బలగాలకు బహిరంగ సవాల్ విసిరినట్లా? దండకారణ్యంలో తమ బలాన్ని, బలగాన్ని మావోయిస్టు పార్టీ అందుకోసమే ప్రదర్శించిందా? ఇదే నిజమైతే తద్వారా పార్టీకి ఒనగూరే ప్రయోజనమేమిటి? ఇటువంటి ప్రదర్శనలు పార్టీకి నష్టం కలిగిస్తాయని గతంలో నక్సల్ నేతలు విశ్వసించేవారు.
తాజా పరిస్థితుల్లో మాత్రం భారీ ఘటనలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను పార్టీనే స్వయంగా విడుదల చేస్తుండడం విశేషం. రామన్న మృతి సందర్భంగా అంత్యక్రియల్లో భారీ ఎత్తున పాల్గొన్న సాయుధ నక్సల్స్ ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ, తాజాగా విన్ప ఎన్కౌంటర్ ఘటన పేరుతో ‘మిక్సింగ్’ వీడియోను విడుదల చేయడం గమనార్హం. ఈ తాజా పరిణామాలపై అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిఘా వర్గాలు మాత్రం డేగకన్ను వేశాయి. పూర్తి సమాచార సేకరణలో నిమగ్నమయ్యాయి.
తెలంగాణాలో తీవ్రవాద ఉద్యమ అణచివేతలో నైపుణ్యతను ప్రదర్శించిన పోలీసు వర్గాలు మాత్రం మావోయిస్టు పార్టీ విడుదల చేసిన వీడియోపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. వీడియోను తాము కూడా చూశామని, ఛత్తీస్ గఢ్, బీహార్, మహారాష్ట్రలకు చెందిన ముఖాలు మాత్రమే సాయుధులై కనిపించారని చెబతున్నారు. మావోయిస్టు పార్టీలో ‘కొత్త తరం చేష్ట’గా వారు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఛత్తీస్ గఢ్ నక్సల్స్ వ్యవహార శైలి ‘అయితే నిశ్శబ్ధం’, లేదంటే భారీ విధ్వంసం, పోలీసులకు పెద్ద ఎత్తున నష్టం చేకూర్చే దిశగా ఉంటుందన్నారు. ఇటువంటి అనేక చర్యలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మావోయిస్టు పార్టీలో కొత్త తరం దుందుడుకు చర్యగా వీడియో విడుదల ఘటనను భావిస్తున్నామని, లేదంటే సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రచారం పొందే చర్య కావచ్చంటున్నారు. మొత్తంగా తమకు కూడా భారీ బలముందనే తరహాలో వీడియోలో ‘ప్రదర్శన’ చేశారని ఓ విశ్రాంత పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు. ‘విప్లవం అంటే మార్పు, కొత్తతరం నక్సల్ నాయకత్వం అనుసరిస్తున్న మార్పులో భాగం కావచ్చు’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
కాగా మావోయిస్టు పార్టీ విడుదల చేసిన ఆయా వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఫొటోలు: మావోయిస్టు పార్టీ విడుదల చేసిన వీడియో నుంచి…