వరంగల్ మహానగరంలో జర్నలిస్టులు రోడ్డెక్కారు. సహచర జర్నలిస్టు ప్రాణాన్ని కాపాడేందుకు జోలెపట్టి భిక్షాటన చేస్తున్నారు. తోటి పాత్రికేయున్ని రక్షించుకునేందుకు దిక్కుతోచని స్థితిలో, అనివార్యంగా బిచ్చమెత్తుతున్నారు. జర్నలిస్టుల సంక్షేమమే తమ ధ్యేయమని నినదించే నేతల మాటల సాక్షిగా ఇదో దిగ్భ్రాంతికర ఘటన. కరోనా కల్లోలంలో జర్నలిస్టు జీవితాన్ని ప్రతిబింబిస్తున్న దృశ్యమిది. జర్నలిజం ముసుగులో కోట్లు కూడాబెట్టుకున్నట్లు ప్రాచుర్యంలో గల కొందరు జర్నలిస్టుల గురించి వదిలేయండి. జర్నలిజాన్నే నమ్ముకున్న సగటు పాత్రికేయునిపై మహమ్మారి జబ్బు దాడి చేస్తే, కార్పొరేట్ ఆసుపత్రులు బిల్లు రూపేణా దోపిడీకి పాల్పడిన ఫలితపు దారుణాన్ని కళ్లకు కట్టినట్లు చూపే ఉదంతమిది.
జనగామ జిల్లా జఫర్ గఢ్ కు చెందిన బెలిదె శ్రీనివాస్ ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. కరోనా మహమ్మారి బారిన పడిన శ్రీనివాస్ గడచిన 34 రోజులుగా సికిందరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆసుపత్రి నిర్వాహకులు శ్రీనివాస్ చికిత్సలో 33వ రోజుకు వాళ్ల కుటుంబానికి ఇచ్చిన బిల్లు మొత్తం 28,99,535 రూపాయలు. ఇందులో రూ. 5.00 లక్షలు ఆరోగ్య బీమా కింద చెల్లించి, పదకొండు లక్షల మొత్తాన్ని నగదుగా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు చెల్లించారు. ఇంట్లోని నగలు, భూములు అమ్మి తల తాకట్టు పెట్టి తమ సభ్యున్ని బతికించుకునేందుకు చికిత్స కోసం వెళ్ళిన శ్రీనివాస్ కుటుంబానికి మిగతా మొత్తపు బిల్లు చుక్కలు చూపిస్తోంది. దిక్కుతోచని స్థితిని కల్పించింది.
ఈ నేపథ్యంలో శ్రీనివాస్ కుటుంబానికి ఇతర దాతలు కూడా ఆర్ధిక సహాయం అందించి ప్రాణభిక్ష పెట్టాలంటూ వరంగల్ జర్నలిస్టులు భిక్షాటనకు దిగారు. వరంగల్ ప్రెస్ క్లబ్ నుండి మొదలైన భిక్షాటన అమరవీరుల స్తూపం వరకు కొనసాగింది . జర్నలిస్టుగా ఫోటోగ్రాఫర్ గా ఎన్నో సేవలు అందించిన శ్రీనివాస్ ప్రాణాన్ని కాపాడేందుకు సహచర జర్నలిస్టులు రోడ్డెక్కారు. జర్నలిస్టుల సేవలతో ఎన్నో పదవులు పొందిన ప్రజా ప్రతినిధులు, రాజకీయనాయకులు, స్వచ్చంద సంస్థలు శ్రీనివాస్ కు ఆర్ధిక సహాయం అందించి ప్రాణ భిక్ష పెట్టాలని వరంగల్ జర్నలిస్టులు చేతులు జోడించి ప్రార్థిస్తున్నారు. కరోనా బారిన పడి ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్న జర్నలిస్టులను ఆదుకొని అండగా నిలవాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి తాము అది చేశాం… ఇది చేశామని గొప్పలు చెప్పుకునేవారికి ఈ దృశ్యం కనిపిస్తున్నట్లే కదా!