నిన్ననే కదా.. అభియోగాలు ఎదుర్కుంటున్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న ప్రజలను ఏమనుకోవాలి? అని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి పత్రిక అధినేత వేమూరి రాధాకృష్ణ అలియాస్ అర్కే తన ‘కొత్త పలుకు’ కాలమ్ ద్వారా ప్రశ్నించిందీ…? నిందించింది?? అంతేకాదు ‘న్యాయస్థానంలో చేతులు కట్టుకుని నిలబడిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో న్యాయ స్థానాలు ఎక్కడ ఉండాలో నిర్ణయించబోతున్నారు’ అని కూడా వెటకరించారు.
ప్రతి ఆదివారం తన కొత్త పలుకు కాలమ్ ద్వారా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడమే ప్రధానంగా ఆయన రాతలు సాగుతుంటాయి. పేజీలకు పేజీలు నింపిస్తుంటారు కూడా. ఈ శైలి పాత పలుకే. కానీ ఆంధ్రజ్యోతిలో ఈ రోజు నిజంగానే ‘కొత్త పలుకు’ సాక్షాత్కరించింది. ఔను సరికొత్త పలుకే. అదే అశ్యర్యం. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన గ్రామ సచివాలయ కొలువులకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఆంధ్రజ్యోతి ‘పండుగ’గా అభివర్ణించడమే ఈ ‘సరి కొత్తపలుకు’ లోని విశేషం. తన పత్రిక ‘లైన్’ కు విరుద్ధంగా దాదాపు పేజీ మొత్తం నింపినట్లుగా కొలువుల విశేషాలను ఆవిష్కరించడమే ఆశ్చర్యకరంగా పలువురు సీనియర్ పాత్రికేయులు అభివర్ణిస్తున్నారు. నిన్నటి కొత్త పలుకు కాలమ్ లో అవినీతి కేసులో నిందితుడు- కోర్టులో నిలబడిన సన్నివేశం-కోర్టులు ఎక్కడ ఉండాలో చేతులు కట్టుకుని న్యాయస్థానంలో నిల్చున్న ముఖ్యమంత్రి నిర్ణయించబోతున్నారంటూ తీవ్ర ఆందోళన చెందిన ఆర్కే, దీన్ని బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అనాలో, ఐరనీ ఆఫ్ డెమోక్రసీ అనాలో తెలియని పరిస్థితి అని కూడా అయోమయ సంశయాన్ని వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే ఆర్కే ఆంధ్రజ్యోతి పత్రిక తన సహజశైలికి విరుద్దంగా జగన్ సర్కార్ ప్రకటించిన సచివాలయ ఉద్యోగాలను పండుగగా పేర్కొనడం ‘ఓపెన్ హార్ట్ విత్ జర్నలిజం ఎథిక్స్’ గా నమ్మొచ్చా? దీన్ని బ్యూటీ ఆఫ్ జర్నలిజం అనాలా? ఐరనీ ఆఫ్ జర్నలిజం అనాలా? లేక బ్యూటీ ఆఫ్ బిజినెస్ అనాలా? అదీ అసలు సందేహం. ఎందుకంటే ఈ ‘సచివాలయ కొలువుల పండుగ’ శీర్షిక కథనంలో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనిగాని, జగన్మోహన్ రెడ్డి సర్కార్ అని గాని ప్రస్తావించకపోవడం గమనార్హం. కేవలం ‘ప్రభుత్వం’ అని మాత్రమే ఉటంకించడం ‘స్టైల్ ఆఫ్ ఆర్కే మార్క్ జర్నలిజం’.