తెలంగాణాలో ‘మున్నూరు’ రెడ్డి కార్పొరేషన్లు!
పొరుగున గల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సృష్టించిన తాజా సంచలనం ఏమిటి? బీసీ కార్పొరేషన్ కు సంబంధించిన ఓ పదవిని ఉప కులాల వారీగా విభజించి, కాదూ… లేదూ అంటే వర్గీకరించి ఏకంగా 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో కార్పొరేషన్ లో 13 మంది చొప్పున డైరెక్టర్లను నియమించారు. ఔను… ఒక్కటి కాదు, రెండూ కాదు అక్షరాలా యాభై ఆరు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, ఆయా బీసీ కులాలకు చెందిన వందలాది మందికి చైర్మన్, డైరెక్టర్ పదవులను కట్టబెట్టారు. శెట్టి బలిజ, సేనాపతులు, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, వడ్డెర కులాల వారీగా బీసీ కార్పొరేషన్ పదవులు విభజించబడ్డాయన్నమాట. ఆయా కార్పొరేషన్ల పదవులను అధిష్టించినవారు తమ తమ సామాజికవర్గం వారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం విజయవాడలో నిర్వహించిన సభలో ఆకాంక్షించారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్రంలో కార్పొరేషన్ పదవులను ఇలా ఉపకులాల వారీగా, ముక్కలుగా వర్గీకరించారు. గతంలో మాదిరిగా బీసీ కార్పొరేషన్ మాత్రమే ఉంటే ఒక్కరికి మాత్రమే చైర్మెన్ పదవి లభించేది. కానీ ఈ వర్గీకరణ ద్వారా ఎక్కువ మందికి పదవులు లభించినట్లయింది. బీసీల్లో 56 మందికి కార్పొరేషన్ చైర్మెన్లుగా పదవులు దక్కాయి. ఇక డైరెక్టర్ల సంఖ్యకు కొదువే లేదు. దీనివల్ల పాలక వర్గానికి రాజకీయంగానూ ఫాయిదా ఉంటుందనేది పరిశీలకుల అంచనా. కేవలం ఏడాదిన్నర క్రితం సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన జగన్ తీసుకుంటున్న ఇటువంటి సంచలన నిర్ణయాల స్ఫూర్తిగా, అంతకు అయిదేళ్ల ముందే ముఖ్యమంత్రిగా పాలనానుభవం గల టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎందుకు యోచించడం లేదనేది తాజా ప్రశ్న.
ఔను… కేసీఆర్ కు సీఎంగా ఆరున్నరేళ్ల పాలనానుభవం ఉంది. కేవలం రెండు ఎంపీ సీట్ల ద్వారా ప్రత్యేక రాష్ట్రం సాధించిన పొలిటికల్ ట్రాక్ రికార్డు ఉంది. మరి ఏపీ సీఎం జగన్ తరహాలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇటువంటి పదవులను అసంఖ్యాకంగా సృష్టించే అవకాశాలు బోలెడున్నాయ్. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి ఇటీవల దూరమవుతున్నారని భావిస్తున్న ‘రెడ్డి’ వర్గీయుల కోసం అసంఖ్యాకంగా కార్పొరేషన్లను సృష్టించి, వాటికి వందల్లో చైర్మెన్లను, వేలల్లో డైరెక్టర్లను నియమించవచ్చు. తెలంగాణాలో ఆదినుంచీ కాంగ్రెస్ కు ‘పెట్టు’గా ప్రాచుర్యం పొందిన రెడ్లు ప్రస్తుతం తెలంగాణా రాజకీయ చౌరాస్తాలో ఉన్నారు. రాజకీయంగా లేవలేని, చేవలేని దుస్థితిలో గల కాంగ్రెస్ కు దూరమవుతున్నారనే ప్రచారం ఎలాగూ ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని రెడ్లను తనవైపు తిప్పుకునేందుకు బీజేపీ రాజకీయ పథక రచన చేస్తున్నదనే ప్రచారం కూడా సాగుతోంది.
ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ చేయాల్సిందేమిటి? అనే ప్రశ్నకు వస్తే… అర్జంటుగా ఓ ‘మున్నూరు’ కార్పొరేషన్లను క్రియేట్ చేయడమేనట. మున్నూరు అంటే మూడు వందలు అన్నమాట. అదేమిటి… రెడ్లలో ఇన్ని ఉప కులాలు ఉన్నాయా? అని ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. చారిత్రక నేపథ్యం ప్రకారం వ్యవసాయం చేసేవారిని తెలంగాణాలో ‘కాపు’లుగా అభివర్ణిస్తుంటారు. ఇటువంటి మున్నూరు… అంటే మూడొందల సేద్యపు ఉపకులాల సమాహారమే తెలంగాణాలో నివసించే రెడ్లు. వీరిలో మొటాటి, గుడాటి, పాకనాటి, పెడకంటి, రేనాటి, వెలనాటి, దేశ్ ముఖ్, దేశాయ్, చౌదరి… తదితర రెడ్లు ఉన్నారు. ఈ జాబితా మొత్తంలోకి వెడితే ఇంకా చాలా రకాల ‘రెడ్లు’ ఉంటారు. ఈ ప్రాతిపదికన తెలంగాణా సీఎం కేసీఆర్ ‘రెడ్డి’ కార్పొరేషన్ పదవులను సృష్టిస్తే ఇక బీజేపీ ఆటలు సాగవ్… అంటాడు ఓ విశ్లేషకుడు.
అయితే ఈ అంశంలో కొసమెరుపు ఏమిటంటే… మున్నూరు రెడ్లలో 299 రకాల రెడ్లు ఇటువంటి పదవులకు పడిపోవచ్చు. కానీ ‘మొటాటి’ రెడ్లతోనే అసలు సమస్య. తను కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నప్పటికీ ‘పటేలా… మా పొలంలో పనికి వస్తావా?’ అని పిలిస్తే తప్ప మొటాటి రెడ్లు ఇల్లు కదలరు. ఇదిగో ఇటువంటి ‘ఆత్మాభిమానం’ పుష్కలంగా ఉన్న మొటాటి రెడ్లతోనే తెలంగాణాలో అసలు రాజకీయ సమస్య. వేలాది పుస్తకాలను చదివి చరిత్రను ఔపోసన పట్టిన సీఎం కేసీఆర్ కు ఇది తెలియని విషయమేమి కాకపోవచ్చు కూడా.
ఫీచర్డ్ ఇమేజ్: ఫైల్ ఫొటో