పై ఫొటోను నిశితంగా చూడండి. ఏదో సేద్యపు నారుమళ్లకు రక్షణగా చీరలతో కంచె నిర్మించినట్లు కనిపిస్తోది కదూ! ఔను… ఇది చీరలతో నిర్మించిన కంచే. ఎటువంటి సందేహం లేదు. వెల్లుల్లి (ఎల్లిగడ్డ) నారు పోసిన రైతులు కొందరు ఎంచక్కా ఇలా బతుకమ్మ చీరలతో కంచె నిర్మించిన ఘటన వెలుగు చూడడమే తీవ్ర కలకలానికి దారి తీసింది.
ఎక్కడో కాదు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోనే ఈ ఘటన వెలుగు చూడడంతో చేనేత, జౌళి శాఖ అధికారులు ఆగమేఘాలమీద విచారణ చేపట్టారు. అసలు విషయంలోకి వెడితే.. సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లి మండలం గండిలచ్చక్కపేటలో బతుకమ్మ చీరెలను ఇలా కంచెగా నిర్మించిన సీన్ అధికార యంత్రాగంలో ప్రకంపనలు రేపింది.
గండిలచ్చక్కపేట గ్రామానికి చెందిన జంగిటి అంజయ్య, కాసారపు ఆసయ్య, కాసారపు ఎల్లయ్య అనే ముగ్గురు రైతులు జాయింటుగా ఎల్లిగడ్డ సేద్యంలో భాగంగా నారు పోశారు. నారు పోసి వదిలేస్తే సరిపోదు కదా? ఏ పశువులో వచ్చి నారుమడులను తొక్కి ధ్వంసం చేశాయంటే ఎల్లిగడ్డ నారు ఎందుకూ పనికిరాకుండాపోతుంది. అందుకే కాబోలు ఏకంగా తొమ్మిది చీరలతో ఎల్లిగడ్డ నారుమళ్ల చుట్టూ ఇలా రక్షణగా కంచె నిర్మించారు.
ఇంత అద్భుతమైన సీన్ కనిపిస్తే మీడియా కళ్లు చూస్తూ ఉంటాయా మరి? అందుకే ఓ ఫోటో తీసి రచ్చ రచ్చ చేశారు. అసలే బతుకమ్మ పండుగ సీజన్. తెలంగాణా ఆడబిడ్డల సంతోషం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందలాది కోట్ల రూపాయలను వ్యయం చేసి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో బతుకమ్మ చీరలను ఇలా నారుమళ్లకు కంచెగా నిర్మించారంటే, అందులోనూ మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలోనే ఇటువంటి సీన్ కనిపిస్తే అధికారులు అత్యంత వేగంగా స్పందించడమూ సహజమే కదా?
ఇందులో భాగంగానే చేనేత, జౌళి శాఖకు చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ వి. అశోక్ రావు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. బతుకమ్మ చీరలను ఎల్లిగడ్డ నారుమళ్లకు కంచెగా ఉపయోగించినట్లు మీడియాలో ప్రచారమైన అంశంపై తాము విచారణ జరిపామని పేర్కొన్నారు. కంచెగా నిర్మించిన తొమ్మిది చీరల్లో ఒక్క చీర మాత్రమే బతుకమ్మ చీర అని, అది కూడా 2018లో పంపిణీ చేయగా, లబ్ధిదారు వినియోగించగా చిరిగిపోయిందన్నారు. మిగతా ఎనిమిది చీరలు బతుకమ్మ చీరలు కాదని, షాపుల్లో కొనుగోలు చేసిన బాపతని, ఈ విషయంలో మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తమని, దీనిని ఖండించనైనదని అశోక్ రావు తన ప్రకటనలో వివరించారు.
అయితే బతుకమ్మ చీరలను ఎల్లిగడ్డ నారుమళ్లకు, ఇళ్లముందు మొక్కల రక్షణకు ప్రజలు వినియోగించడం వెనుక అసలు కథ వేరే ఉందంటున్నారు. ఈసారి బతుకమ్మ చీరల పంపిణీలో సిరిసిల్ల నియోజకవర్గంలో అధికారులు ఇష్టానుసారం వ్యవహరించారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సరికొత్త చీరలను పంపిణీకోసం తరలించి, సిరిసిల్ల ఆడబిడ్డలకు మాత్రం గత సంవత్సరం మిగిలిపోయిన పాత చీరలను పంపిణీ చేశారనే విమర్శలు వస్తున్నాయి. అందువల్లే ప్రజలు బతుకమ్మ చీరలను ఇలా బహుళ అవసరాలకు వినియోగిస్తున్నారనే వాదన వినిపిస్తోంది.