తెలంగాణా సరిహద్దుల్లో గల ఛత్తీస్ గఢ్ జిల్లాల్లో బస్తర్ ఐజీ పి. సుందర్ రాజ్ గురువారం పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నక్సలైట్ల ఏరివేతలో భాగంగా తెలంగాణాలో వరుస ఎన్కౌంటర్లు, కూంబింగ్ ఆపరేషన్లు జరుగుతున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అనుకుని ఉన్న పలు ఛత్తీస్ గఢ్ జిల్లాల్లో బస్తర్ ఐజీ పర్యటించడం గమనార్హం.
బీజాపూర్ జిల్లా బాసగూడ, సుక్మా జిల్లా జేగురుగొండ ప్రాంతాలను ఐజీ సుందర్ రాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లలో, బేస్ క్యాంపుల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులతో, జవాన్లతో చర్చించారు.
మావోయిస్టు నక్సలైట్ల కట్టడికి మరింత దూకుడుగా కార్యకలాపాలు చేపట్టాలని, నక్సల్ కార్యకలాపాలను నిరంతర నిఘా వేయాలని సూచించారు. ఇందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించి, ఆయా ప్రాంతాల అభివృద్ధికి సైతం అధికారులు చొరవ తీసుకోవాలన్నారు.
డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సీఆర్పీఎఫ్ వంటి బలగాలు తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్నారని, వారి భద్రతకు పాటించాల్సిన అంశాలను కూడా ఐజీ చర్చించారు. బీజాపూర్, సుక్మా జిల్లాల్లోని రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణ పనులను కూడా ఐజీ సమీక్షించారు. ఐజీ సుందర్ రాజ్ వెంట సీఆర్పీ డీఐజీ కోమల్ సింగ్, బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్ తదితర అధికారులు కూడా ఉన్నారు.