అభిమానానికి ప్రాంతీయ భేదం లేదు. ఉండాల్సిన అవసరం కూడా లేదు. ప్రజాసేవే పరమావధిగా భావించే నేతలకు ఎక్కడైనా, ఎప్పుడైనా అభిమానులు ఏర్పడవచ్చు. ఇది కొత్త విషయమేమీ కాదు. కరోనా క్లిష్ట పరిణామాల్లో ఆదివాసీ గిరిజన గూడేలను చుట్టేస్తూ, అడవి బిడ్డలకు నిర్విరామంగా నిత్యావసర సరుకులు అందజేస్తున్న తెలంగాణాలోని ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్కకు ఒడిషా సరిహద్ధుల్లోని ఆంధ్రప్రదేశ్ లో గల శ్రీకాకుళం జిల్లాలో అభిమానులు ఏర్పడడం విశేషం. గిరిజన పల్లెల్లో సీతక్క సేవలకు ప్రజాచైతన్య వేదిక వ్యవస్థాపకుడు కలిశెట్టి అప్పలనాయుడు ముగ్ధుడయ్యారు. ఆమె సేవలను కొనియాడుతూ శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో అభిమానంతో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అంతేకాదు సీతక్క సేవలను కీర్తిస్తూ తనే స్వయంగా ఓ వార్తా కథనాన్ని కూడా రాశారు. అందుకు సంబంధించిన ఫొటోలను, సీతక్కపై తాను రాసిన వార్తా కథనాన్ని అప్పలనాయుడు ts29 ‘సైట్’కు ప్రత్యేకంగా పంపడం మరో విశేషం. ఆంధ్రా-ఒడిషా బోర్డర్ లోని ‘సిక్కోలు’ అభిమాని కలిశెట్టి అప్పలనాయుడు సీతక్క గురించి ఏం రాశారో దిగువన చదవండి.
సీతక్క… మీ సేవలకు అడవి తల్లి పులకరిస్తోంది
ఎమ్మెల్యే అంటే కేవలం భోగాలు, విలాసాలు కాదు. ప్రజల సమస్యల పట్ల అంకితభావం, ప్రజలపై ప్రేమ అభిమానం చూపించడమే అసలైన ప్రజాసేవ అని నిరూపించుకుంటున్నారు మన తెలుగు బిడ్డ ములుగు అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యురాలు సీతక్క. నిరాడంబరత, చిత్తశుద్ధే పరమావధిగా పని చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవి ప్రజలు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావించారు ఆమె. అందుకే అడవితల్లి పులకరించిపోయే విధంగా అక్కడ మన్యం ప్రజలను ఆదుకుంటున్నారు. ఆమె అనుసరిస్తోన్న నిరాడంబరత, చేస్తోన్న సేవ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు గర్వపడే విధంగా ఉంది.
గతంలో ప్రజల హక్కుల సాధన కోసం తుపాకి పట్టుకోవడమే కాదు….. ప్రజలు బాధలను తన ఆత్మీయ స్పర్శతో స్వయంగా ఆదుకోవడం కూడా తెలుసునని నిరూపిస్తున్నారు సీతక్క. కరోనా వైరస్ తో లాక్ డౌన్ లో ఉన్న ప్రజానీకానికి నిత్యావసర సరుకులు స్వయంగా అందజేస్తున్నారు. నేను ఉన్నానని భరోసా ఇస్తున్నారు. మనసుంటే మార్గాలు ఎన్నో ఉంటాయని ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారు ఉక్కు మనిషి సీతక్క.
సరైన రహదారి సౌకర్యాలు కూడా లేని ఎన్నో గిరిజన గ్రామాలకు కాలినడకన పయనిస్తోంది. రహదారి పక్కనే సామాన్యులతో, సామాన్యురాలిగా మమేకమై భోజనాలు చేస్తోంది. వాగులు, వంకలు దాటుకుంటూ గిరి పుత్రులకు నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. అమయాక గిరిజనులకు కరోనా మహమ్మారిపై అవగాహన కల్పిస్తోంది సీతక్క. వారిలో ధైర్యాన్ని నింపుతోంది.
గత 50 రోజులుగా నియోజవర్గం ప్రజలే కాకుండా పరిసర ప్రాంత మన్యంలో జీవిస్తున్న అడవి తల్లి బిడ్డలను ఆదుకోవడం లో ఆమె చూపిస్తున్న చొరవ మానవత్వానికి నిదర్శనం. సేవ గుణానికి నిర్వచనం. ఆమె చేస్తున్న సేవల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో శభాష్ అనిపించుకున్నారు సీతక్క. ప్రజా ప్రతినిధి అంటే ఇలాగే ఉండాలని భావి ప్రజా ప్రతినిధులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు సీతక్క. ఆమెను ఎన్నుకొన్న ఆ నియోజకవర్గం ప్రజలకు మనస్ఫూర్తిగా వందనాలు. అభినందనలు…. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా సీతక్కను అభినందిస్తే అది ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్లే.
అభినందనలతో…
కలిశెట్టి అప్పలనాయుడు
ప్రజా చైతన్య వేదిక వ్యవస్థాపకులు
శ్రీకాకుళం జిల్లా
ఆంధ్ర ప్రదేశ్ …
9440436426