ఖమ్మం నగరంపై బీజేపీ దృష్టి సారించింది. ఖమ్మం నగర పాలక సంస్థకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోందనే వార్తల నేపథ్యంలో బీజేపీ ముందస్తుగా రెడీ అవుతుండడం గమనార్హం. ఇందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఈ వారంలో ఖమ్మం నగర పర్యటనకు వస్తున్నారు. రావడమే కాదు కనీసం మూడు రోజులపాటు ఖమ్మం నగరంలోనే ‘మకాం’ వేసి పార్టీ స్థితి, గతులను పరిశీలించనున్నారు.
మార్నింగ్ వాక్ వంటి కార్యక్రమాల ద్వారా తనదైన శైలిలో సంజయ్ ఖమ్మంలో ‘పొలిటికల్ స్ట్రైక్’ నిర్వహించబోతున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వారంలోనే బండి సంజయ్ తోపాటు కేంద్ర హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వంటి ముఖ్యనేతలు కూడా ఖమ్మం నగర పర్యటనకు రెడీ అవుతున్నారు. అయితే సంజయ్ మాత్రం కనీసం మూడు రోజులు ఖమ్మం నగరంలోనే ఉండే విధంగా స్థానిక నాయకత్వం కార్యక్రమాన్ని ఖరారు చేస్తోంది.