బీజేపీకి చెందిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ అధికారిక భద్రతను తిరస్కరించారు. తన వ్యక్తిగత భద్రతా సిబ్బందినేగాక, నాలుగు రోజుల క్రితం కల్పించిన అదనపు భద్రతను కూడా ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈమేరకు తెలంగాణా డీజీపీ మహేందర్ రెడ్డికి గురువారం ఓ లేఖను కూడా సంజయ్ కుమార్ పంపించారు.
డీజీపీ మహేందర్ రెడ్డికి రాసిన లేఖలో సంజయ్ కరీంనగర్ పోలీస్ కమిషనర్ వైఖరిపై ఆరోపణలు చేయడం గమనార్హం. ఈనెల 18న జరిగిన సంఘటనకు సంబంధించి కరీంనగర్ సీపీ చేసిన ప్రకటనను సంజయ్ ఆక్షేపించారు. కమిషనర్ పై సత్వర చర్యలకు కూడా డిమాండ్ చేస్తూ డీజీపీకి లేఖ రాశారు. సంజయ్ రాసిన లేఖ రాజకీయంగా చర్చకు దారి తీసింది.
ఇదిలా ఉండగా 24 గంటలపాటు అదృశ్యమైన సంజయ్ గురువారం రాత్రి 8 గంటలకు తన నివాసంలోనే ప్రత్యక్షం కావడం విశేషం. తాను ఎక్కడికీ వెళ్లలేదని, స్థానికంగానే ఉన్నానని, పోలీసులే తనపై దుష్ప్రచారం చేశారని తనను కలిసిన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ సంజయ్ చెప్పారు.
కరీంనగర్ సేఫ్ జోన్ గా సీపీ ప్రకటించారని, సేఫ్ జోన్ లో సెక్యూరిటీ అవసరం లేదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ లో తాను బైక్ పైనే తిరుగుతానని, కరీంనగర్ దాటితే భద్రత గురించి అప్పుడు ఆలోచిస్తానని ఆయన చెప్పారు. శుక్రవారం జరిగే కరీంనగర్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోలింగ్ సరళి పరిశీలనకు కూడా బైక్ పైనే వెడతానని ఆయన ప్రకటించారు. ఈమేరకు గురువారం రాత్రి ఆయన కరీంనగర్ వీధుల్లో బైక్ పైనే పయనించడం విశేషం. ఎంపీ బైక్ పై పయనిస్తున్న వీడియోను దిగువన వీక్షించవచ్చు.