పదమూడేళ్ల మైనర్ బాలిక ఘటనలో పూజ ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ బాబూరావుకు గురువారం బెయిల్ లభించింది. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అల్లం మారయ్య అనే వ్యక్తి అఘాయిత్యయత్నానికి పాల్పడగా, ప్రతిఘటించిన ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన గురించి తెలిసిందే. బాధిత బాలిక చికిత్స పొందుతూ మరణించిన ఈ ఘోర ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది.
కాలిన గాయాలతో గల మైనర్ బాలిక ఉదంతాన్ని దాచిపెట్టి రహస్యంగా చికిత్స చేశారనే అభియోగంపై ఖమ్మం నగరంలోని పూజ ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ బాబురావును పోలీసులు గత నెల 23న అరెస్ట్ చేశారు. అయితే బాలిక ఘటనలో సమాచారం చెప్పలేదనే నేరం తప్ప, పోలీసుల అభియోగం ప్రకారం ఉద్దేశపూర్వకంగా విషయాన్ని దాచిపెట్టలేదని కేసులో నిందితుడైన డాక్టర్ బాబురావు తరపున ప్రముఖ న్యాయవాది స్వామి రమేష్ కుమార్ వాదించారు. అందువల్ల తమ క్లయింటుకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా స్వామి రమేష్ కుమార్ కోర్టును కోరారు.
ఈమేరకు పూజ ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ బాబురావుకు ఖమ్మం మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. రూ. 10 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తును ఇవ్వాల్సిందిగా కూడా బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశించింది.