నేమ్ బోర్డులో చల్పాక్… అని ఉంటుంది. కానీ ఆ ఊరిపేరు చెల్పాక. ఈ చెల్పాక గ్రామం పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వార్తల్లోకి వచ్చింది. తెలంగాణాలోని ఏటూరునాగారం ఏజెన్సీలో గల చెల్పాక అటవీ గ్రామం దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి రావడానికి కారణం నిన్న జరిగిన భారీ ఎన్కౌంటరే. ఈ ఘటనను జాతీయ మీడియా సైతం భారీ ఎత్తును కవర్ చేసింది. అందువల్లే చెల్పాక గ్రామం పేరు దేశవ్యాప్తంగా నిన్న మార్మోగింది. నిజానికి చెల్పాక పేరు దేశ వ్యాప్తంగా మార్మోగడం ఇది తొలిసారి కాదు.., రెండోసారి.
విప్లవోద్యమ చరిత్ర పుటల్లో చెల్పాకది ప్రత్యేక పేజీ. ఇప్పటి తరానికి తెలియని పాత పేజీలు అనేకం చెల్పాక చరిత్రలో ఉన్నాయి. ఏటూరునాగారం దండకారణ్యాన్ని 1990 దశకంలో అప్పటి పీపుల్స్ వార్, ఇప్పటి మావోయిస్టు పార్టీ ‘గెరిల్లా జోన్’ గా ప్రకటించుకుంది. ఈ గెరిల్లా జోన్ లో పీపుల్స్ వార్ పార్టీకి పెట్టని కోటలుగా చెల్పాక, షాపల్లి, కన్నాయిగూడెం, తుపాకులగూడెం, దొడ్ల, మల్యాల, మేడారం, ఊరట్టం, కాల్వపల్లి తదితర గ్రామాలు ఉండేవి. ఆయా గ్రామాల్లో నెలల తరబడి పీపుల్స్ వార్ నక్సల్స్ ‘మకాం’ వేసినా పోలీసులకు ఏమాత్రం సమాచారం ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా 1989లో ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో పీపుల్స్ వార్ పార్టీకి లభించిన స్వేచ్ఛా, స్వాతంత్రాలే అందుకు కారణంగా సీనియార్ పోలీసు అధికారులు విశ్లేషిస్తుంటారు. ప్రస్తుత మావోయిస్టు పార్టీ ‘పరిస్థితి’కి చెన్నారెడ్డి సర్కారు కల్పించిన వెసులుబాటు కూడా దోహదపడిందనే విశ్లేషణలూ ఉన్నాయనేది వేరే విషం.
పీపుల్స్ వార్ గెరిల్లా జోన్ లో షెల్టర్ ప్లేసులుగా మారిన ఏటూరునాగారం దండకారణ్యంలోని చెల్పాకకు గల చారిత్రక నేపథ్యంలోకి వస్తే.. అది 1991 జూన్ 21వ తేదీ. రాజీవ్ గాంధీ మరణానంతరం పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజు. గుర్తున్నంత వరకు సమయం ఉదయం 10 గంటల ప్రాంతం.. అప్పటి ఏటూరునాగారం సీఐగా ఎస్. సంతోష్ కుమార్, ఎస్ఐగా పి. కిషోర్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో సీఐ, ఎస్ఐలు తెగ టెన్షన్ పడుతున్నారు. చెల్పాక పోలింగ్ కేంద్రంలో పీపుల్స్ వార్ నక్సలైట్లు తిష్ట వేశారని, బ్యాలెట్ బాక్సులో సిరా పోశారని, పోలింగ్ నిలిచిపోయిందనేది పోలీసులకు అందిన సమాచారం. అందువల్లే సీఐ, ఎస్ఐలు టెన్షన్ పడ్డారు. సీఐ సంతోష్ కుమార్ నక్సలైట్లపై దూకుడుగా వ్యవహరించేవారు.
ఈ పరిణామాల్లోనే మహీంద్రా కమాండర్ జీపులో సీఐ సంతోష్ కుమార్, ఎస్ఐ కిషోర్ కుమార్, ఇంకొందరు సీఆర్పీఎఫ్ జవాన్లు ఎట్టకేలకు పగలు పన్నెండు గంటల ప్రాంతంలో చెల్పాకకు బయలుదేరారు. అప్పటికి బూటారం బ్రిడ్జి లేకపోవడంతో ఏటూరునాగారం మీదుగా మాత్రమే ప్రయాణించే వీలుండేది. మార్గ మధ్యంలో రొయ్యూరు వాగు కూడా ఉంటుంది. పోలీసు అధికారులు ప్రయాణిస్తున్న కమాండర్ జీపు రొయ్యూరు వాగులో కూరుకుపోయింది. వాగునీటి ఇసుకలో దిగబడిన జీపు ముందుకు కదలకుండా మొరాయించింది. దీంతో సీఐ, ఎస్ఐలు పక్కనే గల రొయ్యూరుకు వెళ్లి ఓ ట్రాక్టర్ ను తీసుకువచ్చి, జీపును ట్రాక్టర్ తో లాగించి మరీ చెల్పాకకు బయలుదేరారు. నిజానికి చెల్పాకకు వెళ్లేందుకు ఇప్పుడున్న రోడ్డు సౌకర్యం అప్పట్లో లేదు.
మట్టిరోడ్డు.., అందునా ఎడ్ల బండ్ల బాటలో మాత్రమే ప్రయాణించే వీలుంది. ఈ మార్గంలోనే సీఐ, ఎస్ఐ, సీఆర్పీఎఫ్ పోలీసులు ప్రయాణిస్తున్న జీపు వెడుతోంది. దట్టమైన దండకారణ్యం అడవుల నుంచి బండ్ల బాటలో ప్రయాణిస్తున్న పోలీసుల జీపు అనూహ్య రీతిలో ఒక్కసారిగా దాదాపు 150 అడుగుల ఎత్తుకు ఎగిరి తునాతునకలైంది. ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం కూడా లేకుండానే జీపులో గల సీఐ సంతోష్ కుమార్, ఎస్ఐ కిషోర్ కుమార్ సహా ఏడుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు నిర్జీవులగా మారారు. ఎవరు ఎవరో తెలియని స్థితిలో చెట్టుకొకరు, పుట్టకొకరుగా పడి ఉన్నారు. పోలీసుల జీపును లక్ష్యంగా చేసుకుని అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్లు పేల్చిన భారీ మందు పాతర ఘటన ఇది. ఘటనా స్థలం నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో గల మంగపేట వరకు మందుపాతర శబ్ధం వినిపించిందంటే పేలుడు తీవ్రతను అవగతం చేసుకోవచ్చు.
అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ ఘటన మార్మోగింది. ఉమ్మడి రాష్ట్రంలో నక్సలైట్లు పేల్చిన మందుపాతర ఘటనల్లో బహుషా ఇది రెండోది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మందుపాతర ఉదంతం తర్వాత పోలీసులను టార్గెట్ గా చేసుకుని నక్సల్స్ పేల్చిన భారీ విస్ఫోటన ఘటన ఇదే. పీపుల్స్ వార్ అప్పటి ఏటూరునాగారం ఏరియా దళ నేత జంపన్న ఈ ఘటనకు సూత్రధారిగా అప్పట్లో పోలీసులు ప్రకటించారు. దీంతో చెల్పాక గ్రామం 33 ఏళ్ల క్రితమే ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు మరోసారి దేశ వ్యాప్తంగా చెల్పాక గ్రామం వార్తల్లోకి మార్మోగింది. తెలంగాణా రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ కు చెల్పాక కేంద్రం కావడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు.
అప్పటి పీపుల్స్ వార్ నక్సల్స్ పేల్చిన మందుపాతర ఘటనలో సీఐ, ఎస్ సహా ఏడుగురు పోలీసులు, ఇప్పటి ఎన్కౌంటర్ లో ఇద్దరు ఏరియా కార్యదర్శులు సహా ఏడుగురు మావోయిస్ట్ నక్సల్స్ మృతి చెందడం యాధృచ్ఛికమే కావచ్చు. ఒకప్పటి ‘గెరిల్లా జోన్ షెల్టర్’గా పేరు గాంచిన చెల్పాక ప్రస్తుతం నక్సలైట్ల కదలికలకు ఏమాత్రం ‘రహస్యం’ లేని ప్రాంతంగా మారడం గమనార్హం.
– ఎడమ సమ్మిరెడ్డి