పులితో వేట, నాతో ఆట మంచిది కాదు అంటాడు అదేదో సినిమాలో ఓ హీరో. సినిమా డైలాగ్ ను వదిలేయండి. వాస్తవ పరిస్థితుల్లో ఓ చిన్నారి జింక పిల్ల తమను వేటాడే క్రూర జంతువుతో కాసేపు ఆటాడుకుంటే ఎలా ఉంటుంది? జింక పరిస్థితిపై జాలి కలుగుతుంది. కానీ ఈ అందమైన జింక పిల్ల తాను చిరుతతో ఆటేమీ ఆడుకోలేదు. క్రూర జంతువైన చిరుత నుంచి తప్పించుకునేందుకు ఈ జింక పిల్ల చేసిన ప్రక్రియ ఆద్యంతం ఆసక్తికరం.
తాను నడవగలుగుతున్నప్పటికీ వేగంగా పరుగెత్తే పరిస్థితి ఈ జింక పిల్లకు లేదు. తాను పారిపోయే పరిస్థితి లేదని గ్రహించాక చిన్నారి జింక చిరుత తలపై పదే పదే కొట్టడం మనకు ఈ వీడియోలో కనిపిస్తుంది. చిరుత నుంచి తప్పించుకునేందుకు చిన్నారి జింక చేసిన ప్రయత్నాన్ని దాదాపు 1.40 గంటల పాటు వీడియోగా చిత్రీకరించారు ఆండ్రీ ఫౌరీ అనే వీడియో గ్రాఫర్. దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్కులో చిత్రీకరించిన ఈ వీడియోలో చిన్నారి జింక చర్యను తాను ఓ వినోదంగా భావిస్తున్నట్లు చిరుత మనకు కనిపిస్తుంది. అయితే చివరికి చిన్నారి జింకను చిరుత నోట కర్చుకుని వెళ్లడం అత్యంత విషాదకరంగా మనకు సాక్షాత్కరిస్తుంది.