కరోనా వైరస్ చికిత్సకు ఆయుర్వేద మందు కూడా వచ్చేసింది. విశ్వవ్యాప్తంగా మానవాళిని వణికిస్తున్న కరోనా చికిత్సకు ఇప్పటికే పలు సంస్థలు అల్లోపతి మెడిసిన్ ను విడుదల చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఓ వైపు పరిశోధనలు చేస్తున్న క్రమంలోనే అనేక సంస్థలు తాము మందును కనిపెట్టినట్లు ప్రకటిస్తున్నాయి.
ఇందులో భాగంగానే గ్లెన్ మార్క్ ఫార్మా సంస్థ ‘ఫాబిఫ్లూ’ అనే టాబ్లెట్స్ ను ఇటీవల విడుదల చేసింది. హైదరాబాద్ కు చెందిన హెటిరో సంస్థ ‘కోవిఫర్’ పేరుతో ఇంజక్షన్ ను రూపొందించినట్లు ప్రకటించింది. సిప్లా కంపెనీ ‘సిప్రిమిని’ కూడా కరోనా చికిత్సకు వినియోగించవచ్చని, వైద్యుల సిఫారసు ప్రకారమే వాటిని వాడాలనే సారాంశంతో వార్తలు వస్తున్నాయి. ఆయా కంపెనీల మాత్రలు, ఇంజక్షన్ల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలోనే ప్రముఖ దేశీయ ఆయుర్వేద కంపెనీ పతంజలి కూడా కరోనా చికిత్సకు తామూ మెడిసిన్ తీసుకువచ్చినట్లు ప్రకటించింది.
‘కొరోనిల్’ పేరుతో కరోనా మందును టాబ్లెట్ల రూపంలో మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు పతంజలి సంస్థ సహ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ ప్రకటించారు. ఈమేరకు హరిద్వార్ లోని యోగ్ పీఠ్ లో జరిగిన కార్యక్రమంలో ఆయుర్వేద మందును ఆయన ఆవిష్కరించారు. ఆయుర్వేదంతో కరోనాను నయం చేయవచ్చని, తమ మందు ద్వారా మూడు రోజుల అబ్జర్వేషన్ లో 69 శాతం మందికి నెగిటివ్ రిజల్ట్ వచ్చినట్లు వెల్లడించారు. వారం వ్యవధిలోనే వంద శాతం మంది కోలుకున్నట్లు చెప్పారు. తమ సంస్థ ఆవిష్కరించిన ‘కొరోనిల్’ ఆయుర్వేద టాబ్లెట్లు ఐదు నుంచి 14 రోజుల్లో కరోనాను నయం చేస్తుందని బాబా రాందేవ్ వివరించారు.