గౌరవనీయ బి. శివకుమార్ గారు,

సమన్వయకర్త,

తెలంగాణా సాంస్కతిక సారథి కళాకారుల నియామక కమిటీ.

అన్నా,

విషయం: ఉద్యోగం కోసం

నా పేరు గద్దర్. నేనొక గాయపడ్డ ప్రజల పాటను. చిన్నప్పటి నుండే ప్రజల పాటను పాడుతున్నాను. రాయడం, పాడటం, ఆడటం నా వృత్తి. నా వద్ద ప్రస్తుతం ఎలాంటి సర్టిఫికెట్లు లేవు. కళాకారునిగా నన్ను నియమించగలరు.

వందనాలతో…

గద్దర్

కేసీఆర్ సర్కార్ లో కళాకారుని కొలువు కోసం ప్రజాగాయకుడు గద్దర్ చేసుకున్నదరఖాస్తు పూర్తి పాఠం ఇది. ఓ కళాకారునిగా ఉద్యోగానికి దరఖాస్తు చేసింది నిజమేనని గద్దర్ కూడా స్పష్టం చేశారు. ఇందులో ఎటువంటి వివాదం కూడా లేదు. కానీ, 73 ఏళ్ల వయస్సులో గద్దర్ ఉద్యోగానికి దరఖాస్తు చేయడం వెనుక అసలు మతలబు ఏమిటి? దరఖాస్తు తీరులో దాగి ఉన్న నర్మగర్భ అర్థం, పరమార్థం ఏమిటి? ఇవీ ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వ వర్గాలు పడుతున్న మల్లగుల్లాలు. గద్దర్ దరఖాస్తు పూర్తి పాఠాన్ని ఓసారి మళ్లీ చదవండి. ప్రతి పదంలోని అక్షరాన్ని అణువణువునా నిశితంగా పరిశీలించండి. గద్దర్ తన ‘అవసరం’ కోసమే ఉద్యోగ దరఖాస్తు చేశారా? వాస్తవ పరిస్థితుల్లో గద్దర్ కు ప్రస్తుతం ఉద్యోగ అవసరం ఉందా? ఇవే ఇప్పుడు ప్రభుత్వ నిఘా వర్గాలను వేధిస్తున్న సందేహాలు.

ఓ కళాకారునిగా, ప్రజాగాయకుడిగా, తెలంగాణా ఉద్యమంలో ఆడి, పాడిన నాయకుడిగా ఉద్యోగాన్ని అడిగే హక్కు గద్దర్ కు ఉంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఉద్యోగాల నియామకం విషయంలో తెలంగాణా సాంస్కతికి సారథి (టీఎస్ఎస్)కి నిర్దేశిత నిబంధనలు కూడా ఉన్నాయి. నియామకాల షెడ్యూల్ ప్రకారం ఉద్యోగ నియామక ప్రక్రియను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. మొత్తం 18 మంది నిపుణులతో ఆరు బోర్డుల ద్వారా దీన్ని నిర్వహిస్తున్నారు. ఈనెల 7వ తేదీకల్లా ఇంటర్వ్యూల ప్రక్రియ కూడా పూర్తవుతుంది. మొత్తం 550 కళాకారుల పోస్టుల కోసం 5,200 దరఖాస్తులు వచ్చాయి. ఉద్యోగాల నియామకాలకు సంబంధించి వయో పరిమితి 44 ఏళ్లు కాగా, షెడ్యూల్డు కులాలు, బీసీలకు అయిదేళ్లు సడలింపు ఇచ్చారు. దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంది. కళాకారుల నియామకానికి సంబంధించి ఇవీ ప్రభుత్వ నిబంధనలు.

ఈ నేపథ్యంలోనే ఉద్యోగం కోసం గద్దర్ దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కళాకారుని ఉద్యోగానికి ప్రస్తుతం గద్దర్ అర్హతలు సరిపోవు. ముఖ్యంగా ఏ రకంగా చూసినా ఆయన వయస్సు అందుకు అనుమతించదు. వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగం చేయాల్సిన ‘ఆర్థిక అవసరం’ కూడా గద్దర్ కు లేకపోవచ్చు. మరి ఈ పరిస్థితుల్లో గద్దర్ ఉద్యోగ దరఖాస్తు వెనుక గల అసలు అర్థమేమిటి? లక్ష్యమేమిటి? గద్దర్ కోసమే నిబంధనలను సడలించి ఆయనకు ఉద్యోగం కల్పిస్తే, నియామకాల అంశంలో ప్రభుత్వ వైఖరిని పరోక్షంగా బట్టబయలు చేసినట్లవుతుందా? తల్చుకుంటే అన్ని నిబంధనలను కేసీఆర్ ప్రభుత్వం సడలిస్తుందని గద్దర్ పరోక్షంగా చెప్పదలిచారా? ఓ కళాకారునిగా అర్హత ఉన్నప్పటికీ, వయో పరిమితి అనుమతించదు కాబట్టి, ఉద్యోగం ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరిస్తే, గద్దర్ లాంటి ప్రజా గాయకుడు నోరు తెరిచి ఉద్యోగం అడిగితే కేసీఆర్ సర్కార్ ఇవ్వదండీ? అనే చర్చను ప్రజల్లో పెట్టడమే దరఖాస్తు అసలు లక్ష్యమా? రాయడం, పాడడం, ఆడటం తన వృత్తిగా పేర్కొంటూ, తన వద్ద ఎటువంటి సర్టిఫికెట్లు లేవని ఇంజనీరింగ్ చదివిన గద్దర్ తన దరఖాస్తులో ప్రస్తావించడం దేనికి సంకేతం? అంటే ఏ సర్టిఫికెట్లు లేనివారికి కూడా కేసీఆర్ సర్కార్ కళాకారులుగా ఉద్యోగాలు ఇస్తోందని వేలెత్తి చూపే విమర్శలకు గద్దర్ దరఖాస్తు తీరు తావు కల్పిస్తున్నదా? దాదాపు పదిహేను వాక్యాల గద్దర్ దరఖాస్తు. కానీ ఇప్పటికిప్పడు జవాబు లేని ఎన్నో ప్రశ్నలు. గద్దరన్నా…? మీ దరఖాస్తు సారాంశం ఏమిటో తెలియక ప్రభుత్వ అధికారులతోపాటు మీ నేపథ్యం తెలిసిన కొందరు సీనియర్ పోలీసు అధికారులు కూడా జుట్టు పీక్కుంటున్నారు, అసలు విషయం ఏమిటో కాస్త మీరే చెప్పకూడదా అన్నా?.

Comments are closed.

Exit mobile version