‘ఐపీసీ 499, 500 సెక్షన్ల ప్రకారం ఎవరేని వ్యక్తుల పరువుకు భంగం కలిగినపుడు వారు పరువు నష్టం దావాను ప్రవేట్ గా నాయస్థానంలో క్రిమినల్ కేసు దాఖలు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఎవరి అనుమతి కూడా అవసరం లేదు. ఇందుకు ఫలానా వారి అనుమతి అవసరమని చట్టంలోనూ నిర్దేశించలేదు.’ ఓ ప్రముఖ న్యాయవాది స్పష్టీకరణ ఇది.
పరువునష్టం అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోని వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బుధవారం జారీ చేసిన ఉత్తర్వునెం. 2430లో పేర్కొన్న అంశాలు మీడియా సర్కిళ్లలోనేగాక సామాన్య ప్రజానీకంలోనూ కొత్త చర్చకు దారి తీశాయి. వాస్తవానికి ఇది జగన్ సర్కార్ కొత్తగా తీసుకువచ్చిన జీవో కూడా కాదు. డాక్టర్ వైస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2007 ఫిబ్రవరి 20వ తేదీన జారీ చేసిన నెం. 938 ఉత్తర్వుకు కాస్త మార్పులు చేస్తూ కొనసాగింపు మాత్రమే. ప్రభుత్వ కార్యకలాపాలపై నిరాధార, తప్పుడు వార్తా కథనాలు ప్రచురించిన లేదా ప్రసారం చేసిన పత్రికలపై, న్యూస్ ఛానళ్లపైనేగాక సోషల్ మీడియాపైనా పరువు నష్టం కేసులు దాఖలు చేయాలని జగన్ సర్కార్ జీవో నెం. 2430 జారీ చేసింది. సరైన సమాచారం ప్రజలకు చేరడానికి నెపంతో 2007లో అప్పటి ప్రభుత్వం జీవో నెం. 938ను జారీ చేసిందని కూడా కొత్త జీవో 2430లో ప్రభుత్వం ఉటంకించింది. అయితే అప్పటి జీవో ప్రకారం కేంద్రీకృతమైన గత అధికారాలను వికేంద్రీకరిస్తూ ఉత్తర్వు జారీ చేయడమే ఇక్కడ గమనార్హం. మీడియా వార్తా కథనాలపై పరువు నష్టం కేసులు దాఖలు చేసే అధికారాలను జగన్ సర్కార్ సంబంధిత శాఖల కార్యదర్శులకు అధికారాన్ని కట్టబెట్టడమే తాజా జీవోలోని కొత్తపాయింట్.
‘ఆ రెండు పత్రికలు‘ అంటూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో పదే పదే ప్రస్తావించి, పరోక్షంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల వైఖరిని వేలెత్తి చూపిన సంగతి తెలిసిందే. ఓ రకంగా చెప్పాలంటే సాక్షి పత్రిక పుట్టుక లక్ష్యం ఏమిటో దాని ప్రారంభానికి ముందు జగన్ సెలవిచ్చారు. అనంతర పరిణామాల్లో చంద్రబాబుపై, ఆయన ప్రభుత్వ విధానాలపై సాక్షి అనుసరించిన వైఖరి, పోషించిన పాత్ర దాని పాఠకులకు తెలిసిందే. సాక్షి పత్రిక, టీవీ విషయంలో చంద్రబాబు పార్టీ, ప్రభుత్వం అమలు చేసిన విధానాలు దాని యాజమాన్యానికి మళ్లీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కానీ పత్రికా స్వేచ్ఛగురించి, ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు ప్రభుత్వం హయాంలో సాక్షి యాజమాన్యం వల్లించిన సూక్తులను ప్రస్తుతం జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం. 2430 సందర్భంగా గుర్తు చేయాల్సిన అసవరం ఏర్పడిందని పాత్రికేయవర్గాలు అంటున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద మీడియా సంస్థను ఏర్పాటు చేసిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తరహా జీవోను జారీ చేయడమే భిన్నభిప్రాయాలకు తావు కల్పిస్తున్నది.
కాగా పత్రికలపై పరువు నష్టం కేసులకు సంబంధించి దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఉదంతాన్ని మీడియావర్గాలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి. మీడియాపట్ల అప్పట్లో ఆమె వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పత్రికలపైనేగాక విపక్ష పార్టీలకు చెందిన నాయకులపై, కార్యకర్తలపై ఇబ్బడి ముబ్బడిగా జయలలిత నమోదు చేసిన పరువు నష్టం కేసులు అప్పట్లో దేశ వాప్తంగా చర్చకు దారి తీశాయి. తమిళనాడు సీఎంగా వ్యవహరించిన జయలలిత 2011-2016 మధ్య కాలంలో, కేవలం అయిదేళ్ల వ్యవధిలో రాజకీయ ప్రత్యర్థులపై, మీడియా సంస్థలపై మొత్తం 213 పరువు నష్టం కేసులు దాఖలు చేశారు. ఇందులో 50 కేసులు కేవలం మీడియా సంస్థలపైనే ఉండడం గమనార్హం.
తన విమర్శకులను, ప్రతిపక్ష పార్టీలను, ఇతరులను బెదిరించే సాధనంగా జయలలిత పరువునష్టం కేసులను సాధనంగా ఉపయోగించిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈమేరకు 2016 ఆగస్టులో జయలలితకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజా జీవితంలో ఉండేవారు విమర్శలను ఎదుర్కోవాలని కూడా హితవు చెప్పింది. మీడియా విషయంలో జయలలిత వైఖరిపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రజాజీవితంలో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన జగన్ మననం చేసుకోవలసిన ఆవశ్యకత ఉందని పత్రికా స్వేచ్ఛ పిపాసులు కాంక్షిస్తున్నారు.