దేశంలో అత్యున్నత స్థాయి సర్వీసు అధికారులపై, ముఖ్యంగా ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేయడంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రికార్డును సొంతం చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సివిల్ సర్వీసెస్ అధికారులపై సస్పెన్షన్ కొరఢా ఝళిపించాలంటే పాలకులకు ఉండాల్సిన తెగువపైనా చర్చ జరుగుతోంది. తాజా ఘటనలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపై చంద్రబాబు ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ముంబయి సినీ నటి కాదంబరి జెత్వానీ అరెస్ట్ అంశంలో ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఇంతకీ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? లేదా? అనే ప్రశ్నలు కూడా 26 ఏళ్ల క్రితమే ఉద్భవించాయి. అప్పట్లో కరీంనగర్ జిల్లాలో జరిగిన ఓ భారీ విధ్వంస ఘటన ఇందుకు ప్రధాన కారణం. కరీంనగర్ జిల్లా ఎస్పీగా ఉమేష్ చంద్ర విధులు నిర్వహించిన 1998లో ఆయనను ప్రభుత్వం బదిలీ చేసింది. ఉమేష్ చంద్ర బదిలీకి నిరసనగా ఆయన వీరభక్తులుగా ప్రాచుర్యం పొందిన కొందరు కిందిస్థాయి పోలీసు అధికారుల నాయకత్వంలో పోలీసులే భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. ప్రజల ఆస్తులకు పెద్ద ఎత్తున నష్టం కలిగించారు. అప్పటి మంత్రి సుద్దాల దేవయ్య, జెడ్పీ చైర్మెన్ రాజేశం గౌడ్ తదితరుల ఇళ్లపై కూడా పోలీసులు దాడికి తెగబడిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారానికి దారి తీసింది. పోలీసుల దాడుల్లో పెద్ద ఎత్తున విధ్వంసానికి గురైన కరీంనగర్ పట్టణానికి అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు హుటాహుటిని తరలి వచ్చారు.
కరీంనగర్ పట్టణం నలుమూలలా జరిగిన భారీ విధ్వంసాన్ని చంద్రబాబు కళ్లారా చూసి చలించిపోయారు. ప్రజలకు, వారి ఆస్తులకు రక్షణ కల్పించాలని పోలీసులే విధ్వంసానికి దిగిన ఉదంతంపై సీఎం చంద్రబాబు ఆగ్రహించారు. దీంతో అప్పటి ఎస్పీ ఉమేష్ చంద్రను బాధ్యునిగా చేస్తూ చంద్రబాబు సస్పెండ్ చేశారు. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనం. అత్యున్నత సర్వీసులో గల ఓ ఐపీఎస్ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడం ఏమిటి? అసలు రాష్ట్ర ప్రభుత్వానికి గాని, ముఖ్యమంత్రికిగాని సివిల్ సర్వీసెస్ అధికారులను సస్పెండ్ చేసే అధికారం ఉందా? అనే ప్రశ్నలు ఉద్భవించాయ. ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసెస్ అధికారులను సస్పెండ్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరమని విశ్లేషణలు జరిగాయి. అయితే కేంద్రం నుంచి అనుమతి పొందాకే ఉమేష్ చంద్రను చంద్రబాబు సస్పెండ్ చేశారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఉమేష్ చంద్ర తనకు సమీప బంధువైనప్పటికీ, కరీంనగర్ విధ్వంసాన్ని కళ్లారా చూసిన చంద్రబాబు ఓ సీఎంగా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారనే వ్యాఖ్యలు అప్పట్లో వినిపించాయి.
ఈ ఘటన తర్వాత తాజాగా ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును, విజయవాడ కమిషనర్ గా పనిచేసిన కాంతిరాణా టాటాను, డీసీపీ విశాల్ గున్నీని చంద్రబాబు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో దారి తప్పిన ఐపీఎస్ అధికారులపై వేటు వేయడంలో చంద్రబాబుది సాహస నిర్ణయంగా పలువురు అభివర్ణిస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో ఏబీ వెంకటేశ్వర్ రావు అనే ఐపీఎస్ అధికారి సస్పెన్షన్ వ్యవహారం ఎంతటి చర్చకు దారి తీసిందో బహిరంగమే. ఇతన్ని సర్వీసు నుంచి తొలగించాలని జగన్ ప్రభుత్వం పట్టుబట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించలేదనే వార్తలు కూడా వచ్చాయి. తప్పు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకోవడంలో రికార్డును చంద్రబాబు సొంతం చేసుకున్నారనే చెప్పాలి. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇటువంటి అధికారులను మందలించి, ప్రాధాన్యతలేని విభాగాల్లోకి మార్చి వదిలేసేవారని అంటుంటారు. అదేవిధంగా కేసీఆర్ అనేక మంది అధికారులను తనకు వీరభక్తులుగా, చివరికి తన కాళ్లు మొక్కే విధంగా మల్చుకున్నారనేందుకు అనేక ఉదంతాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ అధికారులను సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా? అనే ప్రశ్నపై ప్రస్తుతం కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నియామకం, కేటాయింపు వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని, తప్పులు చేసినట్లు ఆరోపణలు వచ్చిన అధికారులపై చర్యలు తీసుకునే అధికారం సంబంధిత రాష్ట్రాలకు ఉంటుందని రిటైర్డ్ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయాలకు ఆ తర్వాత కేంద్రం నుంచి రాటిఫికేషన్ ను మాత్రమే తీసుకుంటాయని చెబుతున్నారు. మొత్తంగా వివాదాస్పదమైన ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకోవడంలో చంద్రబాబుది ప్రత్యేక సాహసంగా పలువురు అభివర్ణిస్తున్నారు.