ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ వ్యవహారంలో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుందా? ఇంతకీ ఏం జరగబోతోంది? నామినేషన్ల దాఖలు, బీ ఫాం సమర్పణకు గడువు మరో 48 గంటలు మాత్రమే ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలోని మూడు పార్లమెంటు స్థానాల్లో తమ అభ్యర్థులెవరో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ తేల్చలేదు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులు అనేక చోట్ల నామినేషన్లు దాఖలు చేసి, ప్రచారంలో దూసుకుపోతున్నా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తేల్చలేకపోతుండడం గమనార్హం. ముఖ్యంగా ఖమ్మం స్థానంలో పడుతున్న పీటముడులను విప్పడంలో పార్టీ మల్లగుల్లాలు పడుతున్నట్లు కనిపిస్తోంది. కరీంనగర్, హైదరాబాద్ స్థానాల్లో అభ్యర్థులెవరనేది ఇప్పటికే క్లారిటీ వచ్చినప్పటికీ, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ ఖమ్మం విషయంలో మాత్రం రోజుకో విధంగా ‘రాజకీయం’ మలుపు తిరుగుతుండడమే అసలు విశేషం.
వాస్తవానికి వరంగల్ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురాంరెడ్డికి పార్టీ టికెట్ ఖరారైనట్లు కాంగ్రెస్ వర్గాల నుంచి లీకులు వచ్చాయి. ఈ పరిస్థితుల్లోనే రఘురాంరెడ్డి వర్గీయులు రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. అయితే ఈ నామినేషన్లు దాఖలైన పరిణామాల్లోనే ఖమ్మం టికెట్ అంశంలో మళ్లీ సీన్ మారిందనే సమాచారం అందుతోంది. ఈ అంశంలో నిజానిజాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఇప్పటికీ తన తమ్ముడు ప్రసాదరెడ్డికే టికెట్ కేటాయించాలని మంత్రి పొంగులేటి గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరిక సమయంలోనే తనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మంత్రి పొంగులేటి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ పొంగులేటి కుటుంబీకులెవరికీ టిెకెట్ ఇవ్వవద్దని కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పట్టుబడుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఖమ్మం కాంగ్రెస్ టికెట్ పై కాంగ్రెస్ అధిష్టానం నామినేషన్ల దాఖలు గడువు ముగిసినా ఓ నిర్ణయమంటూ తీసుకుంటుందా? అని కాంగ్రెస్ వర్గాలు నిర్వేదాన్ని వ్యక్తం చేస్తున్నాయి.