మావోయిస్టు పార్టీకి చెందిన మరో నక్సల్ నేత ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీ శబరి ఏరియా డివిజన్ కమిటీ సభ్యారులు జెజ్జరి సమ్మక్క అలియాస్ సారక్క అనారోగ్యంతో ఈనెల 24న మరణించినట్లు ఆయా వార్తల సారాంశం. ఇటీవల కరోనా కాటుకు బలైన మావోయిస్టు పార్టీ రాస్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ కు ఈమె సహచరి. ఈనెల 21వ తేదీన హరిభూషణ్ కరోనాతో మరణించగా, మావోయిస్టులు దండకారణ్యంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.
హరిభూషణ్ ఘటన జరిగిన నాలుగు రోజులకే ఆయన సహమరి సమ్మక్క అలియాస్ సారక్క కూడా అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్లు వార్తలు రావడంతో మడగూడెం, గంగారం గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మడగూడెం హరిభూషణ్, గంగారం సమ్మక్కల గ్రామాలు కావడం గమనార్హం. అయితే సమ్మక్క మరణవార్త పార్టీపరంగా ధ్రువపడాల్సి ఉంది. కాగా సమ్మక్క మరణానికి సంబంధిించి తమకు కూడా సమాచారం ఉందని, దాదాపు నిర్ధారణగానే భావిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) వి. తిరుపతి చెప్పారు.