ఖమ్మంలో మరో బీజేపీ నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడే గల వారు అతని ప్రయత్నాన్ని నిలువరించారు. సాయిగణేష్ అనే బీజేపీ నాయకుడి ఆత్మహత్య ఘటనకు సంబంధించిన వివాదం పూర్తిగా సద్దుమణగక ముందే మరో బీజేపీ నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర కలకలానికి దారి తీసింది. పూర్తి వివరాల్లోకి వెడితే…
ఈనెల 15వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖమ్మం పర్యటనకు వచ్చి ఆత్మహత్య చేసుకున్న ఆ పార్టీ స్థానిక నేత సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు నిరసనగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నిన్న బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకులు, కార్యకర్తలు జెడ్పీ సెంటర్ వద్ద మంత్రి అజయ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం యత్నానికి నేడు ప్రయత్నించారు. అయితే బీజేపీ కేడర్ చర్యను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అనంతుల ఉపేందర్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్రమత్తమైన అక్కడే గల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉపేందర్ ను అడ్డుకుని అతని ఒంటిపై నీళ్లు చల్లి నిలువరించారు. ఈ ఘటన ఖమ్మంలో తీవ్ర కలకలం కలిగించింది.