ఈ ఫొటోను నిశితంగా పరిశీలించండి. మూతికి కరోనా మాస్క్, మెడలో తువ్వాలు, ఒంటిమీద బనీను, లుంగీతో మోకాళ్లపై కూర్చున్న ఈయన కూరగాయల బేరం చేస్తున్న దృశ్యమిది. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం కూరగాయల మార్కెట్టు యావత్తూ ఇదే ఆహార్యంతో కలియతిరిగారు. కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. కరోనా పరిస్థితులు, లాక్ డౌన్, 144 సెక్షన్ విధింపు పరిణామాల మధ్య ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులోనే ఉన్నాయా? ధరలు ఎలా నిర్ణయించి విక్రయిస్తున్నారు? వంటి అంశాలను క్షేత్ర స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికి నిర్ణీత ధరలకన్నా రూ. 5 ఎక్కువకు కూరగాయలు విక్రయిస్తున్నట్లు ఈ లుంగీ మాస్టర్ గుర్తించారు.
తప్పు ఎక్కడ జరుగుతున్నదో పసిగట్టారు. అత్యవసరంగా అధికారులతో సమావేశమయ్యారు. నిత్యవసరాల ధరల నియంత్రణకు ప్రణాళికలు సిద్దం చేశారు. ఎక్కువ ధరలకు విక్రయిస్తుంటే మీరేం చేస్తున్నారని దిగువ స్థాయి అధికార గణాన్ని నిలదీశారు. ఈ లుంగీ మాస్టర్ కు అంత సీన్ ఉందా? అని ఆశ్చర్యపడకండి. ఆయనేమీ సాదాసీదా వ్యక్తి కాదు మరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్. కరోనా పరిస్థితుల్లో వ్యాపారుల ఆగడాలను స్వయంగా తెలుసుకునేందుకు ఇదిగో ఇలా బనీన్, లుంగీ వేషధారణలో విజయనగరంలోని కూరగాయల మార్కెట్లను కలియదిరిగారు. క్యాబేజీ ఎంత? టమాటా ధర ఏపాటి? కొత్తిమీర కట్ట ఎంత? అంటూ ధరలను అడిగి తెలుసుకున్నారు. ధరల నియంత్రణకు చర్యలు చేపట్టారు. తమ వద్దకు వచ్చి కూరగాయల బేరం చేసిన లుంగీ వ్యక్తి జిల్లా జాయింట్ కలెక్టర్ అనే విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న వ్యాపారులు ఆశ్చర్యానికి గురయ్యారు.