పార్లమెంటరీ, అన్ పార్లమెంటరీ పదాలు వదిలేయండి. ఇప్పడు భాషతోగాని, దాని సౌందర్యంతోగాని పని లేదు. ప్రత్యర్థులను పద విన్యాసంతో చీల్చి చెండాడామా? లేదా? అన్నదే ప్రస్తుత రాజకీయాల్లో ముఖ్యం కాబోలు. తెలంగాణా సీం కేసీఆర్ ‘భాష’పై ఆ రాష్ట్ర విపక్ష పార్టీల నేతలు అనవసరంగా ఆడిపోసుకుంటారు గాని, పక్కనే గల ఏపీలో అధికార పార్టీ నేతల భాషా సౌందర్యం చూడండి…ఎంత వినసొంపుగా ఉందో? కేసీఆర్ ఏయే పదాలను ఎక్కువగా వాడుతారు? సన్నాసులు, దద్దమ్మలు, దరిద్రులు, లఫంగులు, లత్కోర్లు అంటారు. ‘కర్రు కాల్చి వాత పెడ్తరు’ వంటి సామెతలను ఎక్కువగా వాడుతుంటారు. మహా అయితే నోరు జారి… వాడు…వీడు అనే పదాలను ఎక్కడైనా వాడి ఉండొచ్చు. అంతేగాని అమ్మామొగుడు…అక్క మొగుడు…ఏస్కుందాం..సూస్కుందాం వంటి పదాలను వినియోగించిన దాఖలాలు లేవు కదా? తెలంగాణా మాండలికపు పదాలను ఔపోసన పట్టిన కేసీఆర్ తిట్లు కూడా వినసొంపుగా ఉంటాయి అంటాడు కాకలు తీరిన జర్నలిస్టు ఒకాయన తన రాతల్లో. సరే… కేసీఆర్ తిట్ల దండకపు పదాల సొంపు సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఇప్పడు ఏపీ రాజకీయనేతల తిట్ల దండకపు మాధుర్యంపై రసవత్తర చర్చ జరుగుతోంది. మొన్నామధ్య గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో ఎలా తిట్టుకున్నారో తెలిసిందే కదా?. అక్కడ మొదలైన తిట్ల దండకం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరింత తీవ్రతరమైంది కూడా. గుడివాడ ఎమ్మెల్యే, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమ గురించి ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే చదవండి..
‘రెండ్రోజుల నుంచి తెలుగుదేశం పార్టీలో సంక్షోభం. వంశీ ఆళ్లను తిట్టాడు. ఆళ్లు వంశీని తిట్టారు. అవినాష్ ఒచ్చి మా పార్టీలో చేరాడు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం జేత్తారు? పొద్దునే ప్రెస్ మీట్లు బెట్టి…ఆడు సన్నాసి, ఈడు సన్నాసి… సూస్కుందాం… కాస్కుందాం… ఏస్కుందామంటే…ఏం జూస్కుంటాడు? ఏం గాస్కుంటాడు? ఏస్కుంటాడు? రమ్మనమండి…ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ దగ్గర ఉంటా…ఉమాని. ఒక తన్నుతంతే ఫుట్ బాల్ లాగా ఎగిరి కృష్ణా నదిలో పడ్తడు. ఏం జూత్తాడాడు? మీ పార్టీలో ఏమన్నాగొడవలుంటే…మీరు జూస్కోండి. మీ గొడవల్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టి…? అయినా అసలు చంద్రబాబుకో…ఉమాకో…ఆ పప్పుకో…ఏం అర్హత ఉంది? మాట్లాడే అర్హత? ఇరవై మూడు మంది శాసనసభ్యులను పశువుల్లాగా కొనుక్కున్నారు కదా? ఆళ్లలో నాలుగురికి మంతుర్లిచ్చారు కదా? వాళ్లతో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిచ్చారు కదా? చంద్రబాబునాయుడు ఎకిలి నవ్వులు నవ్వుకున్నాడు కదా? ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు కదా? నువ్వు చేసి…ఇంకా మేం ఏం చేయకుండానే, నువ్వు అట్టా జేత్తవ్…ఇట్టా జేత్తవ్ అని తిడితే…? నువ్ జేత్తే సంసారం…నేన్ జేత్తే వ్యభిచారమా? తిట్టే వాడు లేక…సన్నాసులకీ, ఏది మాట్టాడినా చలామణి అవుద్దనీ…ఎవడి ఇష్టమొచ్చినట్టు ఆడు మాటాడుతున్నాడు. కాబట్టి మా నాయకున్ని మాటాడినపుడు మాకు ఆవేశం ఒత్తది…కోపం ఒత్తది…గట్టిగా, ధీటుగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఒత్తది…చెబుతామ్. నేను సన్నబియ్యం ఇత్తనని ఆడికి జెప్పానా? ఆడి అమ్మా మొగుడికి జెప్పానా? ఎవడికి జెప్పా? కుంభ కర్ణుడి లాగా ఆర్నెల్లు ఇస్క తిన్నాడు…పడుకున్నట్టున్నాడు…ఇప్పుడే లెగిసొచ్చాడు…పొద్దున్నే. ఇప్పడే లెగిసొచ్చి…సన్న బియ్యం ఇత్తా అన్నాడు…సన్నాసి మంత్రీ అంటాడు? ఇప్పడున్న బియ్యం ఎవరిది? ఈళ్లు కొన్నదేగా? ఈళ్లు ఎక్వయిర్ జేసి, ఈళ్లు బెట్టిందేగా? గోడవున్లో? ఈట్ని సన్నంగ నేన్ జేత్తనా? నేన్ జెప్పానా? ఈడికి? మేం ప్యాడీ కొంటమ్…ఆటిల్లో నాణ్యమైనయ్…గత ప్రభుత్వాలు ఇచ్చిందానికన్నా, నూకగాని, డిస్కలర్ గాని తగ్గిచ్చి, స్వర్ణ, బీపీటీ పనికొచ్చేటువంటి వెరయిటీల్నిఏప్రిల్ నుంచి ఇస్తమని చెప్పాం. ఈడికి జెప్పానా? సన్నాసి? పిచ్చివాగుడు? ఎవడ్ర నువ్వు? బొడ్డు గోసి పేరు బెట్టావా? జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి? తాట దీత్తం..ఉమా గాడు గావచ్చు… ఆడి బాబు గావచ్చు…చంద్రబాబు గావచ్చు…చంద్రబాబు బాబు గావచ్చు…’ అన్నారు మంత్రి కొడాలి నాని… ఓ టీవీకి ఇచ్చిన బైట్ లో. విశేషమేమిటంటే…‘ఇటువంటి వార్తలనే జనం ఎక్కువగా చూస్తున్నారు సార్…’ అంటాడు ఓ టీవీ జర్నలిస్టు. అదీ సంగతి.