మునసబు గారి చిన్నబ్బాయ్ శానా మంచోడండీ… అంటే అర్థం ఏంటి…? పెద్దబ్బాయ్ సన్నాసి అన్నట్టేనా…?. అయ్యో… నేను చిన్నబ్బాయ్ మంచోడు అని మాత్రమే చెప్పాను…పెద్దబ్బాయ్ సన్నాసి అనలేదు… అంటే కుదురుతుందా? కుదరదు కదా? చిన్నబ్బాయ్ శానా మంచోడని ప్రత్యేకంగా చెప్పారంటే…పెద్దబ్బాయ్ గురించి సదభిప్రాయం లేనట్టేనా?… ఇదిగో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇటువంటి సామెత తరహాలోనే తాను చేసిన వ్యాఖ్యలపై చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకష్ణంరాజు పార్లమెంట్లో తెలుగు భాషపై చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో తీవ్ర దుమారాన్నే కలిగిస్తున్నాయి. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టనున్న ఇంగ్లీష్ మీడియం గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా? అయితే జగన్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు సాక్షాత్తూ పార్లమెంటులో మాట్లాడారన్నది తాజా వివాదం. ప్రభుత్వ, పార్టీ వైఖరికి భిన్నంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తీసుకునే ప్రక్రియలో భాగంగా అవసరమైతే పార్టీ నుంచి బహిష్కరించడానికి కూడా వెనుకాడేది లేదని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ రఘురామకృష్ణంరాజుకు క్లాస్ తీసుకోవలసిందిగా ఉభయగోదావరి జిల్లాల పార్టీ ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డిని జగన్ ఆదేశించినట్లు తాజా వార్తల సారాంశం. అయితే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తాను పార్లమెంటులో మాట్లాడలేదని, తాను చేసిన ప్రసంగపు మాటలు రికార్డుల్లో ఉన్నాయని ఎంపీ చెబుతున్నారు. ‘నేను తెలుగు భాషకు మద్ధతుగా మాట్లాడానే తప్ప…ఇంగ్లీష్ మీడియానికి కాదు…’ అని ఎంపీ వివరణ కూడా ఇచ్చారు. తనకు తెలుగు భాష అంటే ఇష్టమని, కాబట్టే తెలుగుకు మద్ధతు తెలిపానని, తెలుగును పరిరక్షించుకోవాలన్నది పార్టీ సిద్ధాంతమని కూడా నరసాపురం ఎంపీ చెబుతున్నారు. జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా నరసాపురం ఎంపీ చేసినట్లు పేర్కొంటున్న వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు భాషపై ఎంపీ అభీష్టాన్ని ‘మునసబుగారి చిన్నబ్బాయ్ శానా మంచోడు’ సామెతకు అన్వయిస్తున్నారట ఏపీలోని రాజకీయ పరిశీలకులు. ఈ వివాదం అధికార పార్టీలో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి మరి.

Comments are closed.

Exit mobile version