ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై అక్కడి అధికార పార్టీ నాయకుడు జగన్ సొంత పత్రిక సాక్షికి అంతర్గతంగా ఏదేని కోపం ఉందా? ఉందో లేదో తెలియదు గాని, ఆ పత్రిక ప్రచురించిన ఓ వార్తా కథనం ఇటువంటి అనుమానాలనే కలిగిస్తోంది. స్పీకర్ తమ్మినేని సీతారాంపై తెలుగుదేశం పార్టీ వ్యక్తిగత దూషణలకు దిగిందని, మాటల్లో చెప్పలేని, రాయలేని భాషలో ఆయనను దారుణంగా తూలనాడిందని సాక్షి తన వార్తా కథనంలో ఆవేదన చెందింది. స్పీకర్ ను ‘దున్నపోతు…ఆంబోతు‘ అంటూ ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిందంటూ బాధపడింది. శాసనసభ స్పీకర్ కు కనీస గౌరవం ఇవ్వకుండా దారుణ పదాలతో దూషణకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేసింది. ‘దున్నపోతులా సాంబార్ తాగొచ్చి అసెంబ్లీలో నిద్ర పోతాడు…జనం ముందు బయటకు వచ్చి అంబోతులా రంకెలేస్తుంటాడు…నీది కూడా ఒక బ్రతుకేనా’ అంటూ టీడీపీ నీచత్వానికి ఒడిగట్టిందని తన వార్తా కథనంలోసాక్షి పేర్కొంది.
విషయమేమిటంటే స్పీకర్ ను తెలుగుదేశం పార్టీ తూలనాడిందని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడెవరూ ప్రెస్ మీట్ పెట్టి బహిర్గతం చేసిన అంశం కాదిది…ప్రెస్ నోట్ విడుదల చేసిన ఉదంతమూ కాదు. తెలుగుదేశం పార్టీ అధికారిక ఈ-పేపర్ లో ఈ వార్తాకథనాన్ని ప్రచురించిందని ఓ ఇమేజ్ ను కూడా సాక్షి తన వార్తా కథనానికి జత చేసింది. తెలుగుదేశం పార్టీ అధికారికంగా నిర్వహిస్తున్న ఈ-పేపర్ పేరేమిటో? దాని ఎడిటర్ ఎవరో టీడీపీ కార్యకర్తల్లో ఎంత మందికి తెలుసో, తెలియదో కాని, సాక్షి వార్తా కథనం పుణ్యమా అని దూషణ ‘విషయం’ లక్షలాది మంది పాఠకులకు మాత్రం చేరింది. అంతేకాదు తెలుగుదేశం పార్టీకి ఇంటర్నెట్ లో ఓ ఈ-పేపర్ కూడా ఉందనే విషయం ఇప్పటివరకు తెలియని ఆ పార్టీ కార్యకర్తలకు కూడా తెలిసిపోయింది. ఇంటర్నెట్ లో మాత్రమే దర్శనమిచ్చే ఈ-పేపర్ కథనాన్ని లక్షలాది కాపీల సర్క్యులేషన్ గల సాక్షి పత్రికలో ప్రచురించిన ఫలితంగా స్పీకర్ పై టీడీపీ వాడిన పదజాలం ఎంత మందికి చేరి ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. అంతేకాదు ‘మాటల్లో చెప్పలేని, రాయలేని భాషలో స్పీకర్ ను దారుణంగా తూలనాడిందంటూనే, స్పీకర్ ను ఎటువంటి పదాలతో ఈ-పేపర్ లో టీడీపీ దుర్భాషలాడిందనే పదాలనే సాక్షి మరోసారి తన వార్తా కథనంలో రాయడం గమనార్హం. విషయం అర్థమైంది కదా? టీడీపీ ఈ-పేపర్ లో తిట్టినందుకు కాదు…సాక్షి పత్రిక ఈ వార్తా కథనాన్ని తన ఏపీ ఎడిషన్లో మొదటి పేజీలో ప్రముఖంగా స్థానం కల్పించి మరీ ప్రచురించడం ద్వారా లక్షలాది మంది పాఠకులకు అందించినందుకు స్పీకర్ తమ్మినేని అనుయాయులు, అభిమానులు తీవ్రంగా కలత చెందుతున్నారట. అదీ సంగతి. అధికార పార్టీ పత్రిక జర్నలిజం శైలికి ఏపీ ప్రజలే సాక్షి.