ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత హాట్ టాపిక్ గా ఏటా వార్తల్లో నిలిచే ఓ అంశం గురించి ప్రస్తుతం ఏ చర్చా జరగకపోవడమే ఈ కథనంలోని అసలు విషయం. అమరావతి రాజధాని గొడవల్లో ఓ ‘సరదా’ విషయం మరుగున పడడం విశేషం. అసలు దాని గురించి ఎవరూ పట్టించుకున్నట్లు కూడా లేదు. కానీ రేపో, మాపో ప్రభుత్వం ఏదో ఓ ప్రకటన చేయకపోతుందా? విషయాన్ని తేల్చకపోతుందా? అని ఏపీ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా గోదావరి జిల్లాల ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. విషయమేంటో బోధపడింది కదా? ఔను.. సంక్రాంతి సంబరం గురించే… ప్రస్తుతం ఏపీలో కోడి పందేల ప్రస్తావనే లేదు.
అమరావతి రాజధాని గొడవల్లో రాజకీయ నాయకులు కూడా దీని గురించి పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఇప్పటి వరకు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రమే ఇందుకు సంబంధించి ఓ ప్రకటన చేశారు. కోడిపందేలు సంప్రదాయమని ఆయనేదో ప్రకటన చేసినట్లున్నారు. కానీ ఈ విషయంలో జగన్ సర్కార్ వైఖరేమిటి? ఇదీ అసలు ప్రశ్న. ఎందుకంటే…
మద్యం, జూదం వంటి అంశాల్లో జగన్ సర్కార్ ఇప్పటి వరకు కఠిన వైఖరినే అవలంభిస్తోంది. ఈమేరకు ఏపీ వ్యాప్తంగా పేకాట క్లబ్బులకు తాళాలు బిగించారు. పేకాట రాయుళ్లకు స్థావరాలు లేకుండా చేశారు. అదే విధంగా మద్యం విషయంలోనూ ప్రభుత్వం విధానపరంగా వ్యవహరిస్తోంది. నిర్దిష్ట వేళలను పాటిస్తూ, విక్రయాల్లోనూ నియమ, నిబంధనలను విధించారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. దీంతో అటు జూదరులు, ఇటు మద్యపాన ప్రియులు ఉక్కిరి బిక్కిరవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ‘మగవాళ్లు తిట్టుకున్నా ఫరవాలేదు. అక్కా చెల్లెళ్ల సంతోషమే మాకు ముఖ్యం’ అని పాలక పార్టీ నేతలు మద్యం, జూదం అంశాల్లో వ్యాఖ్యానించిన సందర్భాలు అనేకం.
ఇదిగో ఇటువంటి పరిస్థితుల్లోనే సంక్రాంతి పర్వదినం సమీపించింది. మరో వారం, పది రోజుల్లోనే సంక్రాంతి పర్వదినం ముగుస్తుంది కూడా. ఈ సమయంలోనే గోదావరి జిల్లాలతోపాటు అనేక ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు కోడి పందేల సంబరాల్లో తేలియాడుతుంటారు. కోట్ల రూపాయలు పందేల రూపంలో చేతులు మారుతుంటాయి. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల మూడు రోజులూ కోడి పందేల జోరు గురించి అందరికీ తెలిసిందే. ప్రతి సంక్రాంతి సందర్భాంలో కోడి పందాలకు సంబంధించి ప్రభుత్వానికి, ముఖ్యంగా పాలక పార్టీ అధినేతకు ఓ వైఖరి ఉంటుంది. అధికారికంగా పందేలకు అనుమతి ఇవ్వకపోయినా, చూసీ, చూడనట్లు గతంలో అనేక ప్రభుత్వాలు వ్యవహరించాయి. కొన్ని సందర్బాల్లో కోర్టులు కూడా జోక్యం చేసుకోవలసి వచ్చింది.
చట్టపరంగా ఏ మాత్రం సమర్థనీయం కాని కోడి పందేలు తమకు సంప్రదాయమని ఏపీలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. కోడి పందేలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన రాజకీయ నాయకులు అరుదు. కానీ ఇప్పటి వరకు ఈ విషయంలో జగన్ ప్రభుత్వం తన వైఖరేమిటో స్పష్టం చేయకపోవడమే పందెం రాయుళ్లలో తీవ్ర ఉత్కంఠకు కారణమైంది. పేకాట క్లబ్బుల విషయంలో జగన్ సర్కార్ విధానాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లయితే కోడి పందేలు కూడా జూదమే. పందేల నిర్వహణ తీరు సైతం మూగ జీవాలకు హింసే. కాళ్లకు కత్తులు కట్టిన కోళ్లు.. కుత్తుకలు తెగి రక్తమోడుతున్న స్థితిలోనూ వీరోచితంగా పోరాడుతుంటాయి. పందెం రాయుళ్లు మాత్రం వినోదభరితంగా తిలకిస్తూ కరెన్సీ నోట్లను జూదంలో వెదజల్లుతూ పందేలు కాస్తుంటారు.
కోడి పందేల అంశంలో జగన్ సర్కార్ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయకపోయినా నిర్వాహకులతోపాటు పందెం రాయుళ్లు తమ పని తాము చేసుకుంటూ వెడుతున్నారు. ‘బరులు’ సిద్ధమవుతున్నాయి. సగటున ఒక్కో పందెం కోడిపుంజు ధర రూ. 30 వేలు, గరిష్టంగా రూ. లక్ష వరకు పలుకుతోంది. పందెం నిర్వాహకులు కోళ్ల కొనుగోళ్లలో బిజీ అయ్యారు. ప్రభుత్వ వైఖరి ఏమిటన్నదే అసలు ప్రశ్న. ఇంతకీ ఈ విషయంలో జగన్ సర్కార్ ఏం చేస్తుందనే ప్రశ్నపైనే తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. సంబంధిత జిల్లాల ఎస్పీలు మాత్రం కోడి పందేలను అనుమతించే ప్రసక్తే లేదని ప్రకటనలు జారీ చేస్తున్నరు. పలు ప్రాంతాల్లో లాంఛనప్రాయంగా బైండోవర్ కేసులు కూడా పెడుతున్నారు. ఇదే దశలో… విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘విడికాళ్ల పందెం’ నిర్వహణకు జగన్ సర్కార్ పచ్చ జెండా ఊప వచ్చంటున్నారు. అంటే కత్తులు లేకుండా ‘కాటా’ పోరాటాలు సాగుతాయన్నమాట. కోడి కాలుకు వెనుకవైపున పదునుగా ఉండే పొడవాటి గోరును పందేల పరిభాషలో ‘కాటా’గా వ్యవహరిస్తారు. కత్తులతో పది నిమిషాల్లో ముగిసే పందెం, కాటా తీరులో గంట,గంటన్నర సేపు కొనసాగుతుందన్నమాట. అదీ సంగతి.