ఐదుగురు ఐఏఎస్ అధికారులకు ఆంధప్రదేశ్ హైకోర్టు గురువారం జైలు శిక్ష, జరిమానా విధించింది. కోర్టు శిక్షకు గురైన ఐఏఎస్ అధికారుల్లో పదవీ విరమణ చేసిన మన్మోహన్ సింగ్ కు రూ. 1,000 జరిమానా, అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబుకు రూ. 1,000 జరిమానా, రెండు వారాల జైలు శిక్ష విధించింది.
అదేవిధంగా ఎస్ఎస్ రావత్ కు నెల రోజుల జైలు శిక్ష, రూ. 1,000 జరిమానా, ముత్యాల రాజుకు రెండు వారాల జైలు, రూ. 1,000 జరిమానాతోపాటు మరో ఐఏఎస్ అధికారికి ఏపీ హైకోర్టు శిక్ష విధించింది. నెల్లూరు జిల్లా తాళ్లపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే మహిళ వద్ద భూమి తీసుకుని పరిహారం చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోర్టు తీర్పు చెప్పినప్పటికీ పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం జరగడంతో ఆయా ఐఏఎస్ అధికారుల వేతనాల నుంచి పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. జైలు, జరిమానా శిక్షలపై అప్పల్ చేసుకునేందుకు ఆయా అధికారులకు హైకోర్టు నెల రోజుల గడువునిస్తూ శిక్షను సస్పెండ్ చేసింది.