కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు, ఆమాటకొస్తే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు స్వయం శక్తి సంపన్నులు. బ్రతకడం కోసం ఎంతదూరం అయినా వెళ్ళగలరు. ఔత్సాహికులు. ముందుచూపు ఉన్నవాళ్ళు. ప్రభుత్వాలపై ఆధారపడరు. శ్రమించే లక్షణం ఉంది. పొదుపుగా సొమ్ము వాడుకొని పెట్టుబడిగా మార్చుకునే ఒడుపు ఉంది. చదువుకోసం ప్రభుత్వ బడికి వెళ్ళరు. వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళరు. కాకపోతే ఆర్ధిక స్థోమత లేక ఇంకా ప్రభుత్వంపై ఆధారపడుతున్నారు. పూర్తిగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి సంగతి వేరు. వారికి కూడా కాస్త ఆర్ధిక వెసులుబాటు ఉంటే ఈ ప్రభుత్వం కోసం చూడరు. ఈ పాలకులకు సలాములు కొట్టరు.
ఏ ప్రభుత్వం సహాయం చేస్తే దశాబ్దాల క్రితమే అమెరికా వెళ్ళారు? ఏ ప్రభుత్వం చెపితే దశాబ్దాలుగా పొట్టచేతపట్టుకొని శ్రీకాకుళం నుండో, మార్కాపురం నుండో అనంతపురం నుండో బెజవాడో, హైద్రాబాదో, దుబాయో వెళ్తున్నారు? ప్రభుత్వాలు ఉపాధి చూపడంలో విఫలం అయినా ఆటో నుండి కర్రీ పాయింటు వరకూ, ఓలా నుండి స్విగ్గీ వరకూ స్వయం ఉపాధి వెతుక్కొని బ్రతుకుతున్నారు? బ్రతకడం ఎలాగో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు పాలకులు నేర్పించాల్సిన పని లేదు.
అధికారంలోకి వచ్చిన నాయకులు తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని ప్రజల జీవితాలు వారి చేతుల్లో ఉన్నాయనుకుంటే పొరపాటే. ప్రతిరోజూ ప్రజలది కాకపోవచ్చు. ఐదేళ్ళకోసారి వచ్చే ఆ ఒక్కరోజు చాలు ఈ పాలకులను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేస్తారు. ఈ లోగా పాలకులు ఆడే రాజకీయ క్రీడలకు కొందరే బెదురుతారు. కొందరే ఆందోళన చెందుతారు. కొన్ని గుండెలే ఆగిపోతాయి. కొన్ని ఛాతీలపైనే బూటుకాళ్ళు నృత్యం చేస్తాయి. కొన్ని వీపులపైనే లాఠీలు మోగుతాయి. అంత మాత్రాన ప్రజలు బెదిరిపోతారా? ఇంతేలే మా బ్రతుకులు అనుకుంటారా? ఆగుతారు. ఆలోచిస్తారు. ప్రత్యామ్నాయం వెతుక్కుంటారు. ఐదేళ్ళకోసారి వచ్చే ఆ రోజు కీలెరిగి వాతలు పెడతారు.
రాజధాని అమరావతిలో పెడతానంటే ఎగిరి గంతేసిందీ లేదు. ఇప్పుడది ఎక్కడికో తీసుకుపోతానంటే భయపడి పోయేదీ లేదు. పోయేదేదైనా ఉంటే అది నాయకుల అధికారమే. మద్రాసు అయినా, హైద్రాబాదు అయినా, అమరావతి అయినా ఈ ప్రజల బ్రతుకులు వారివే… వారి పనులు వారివే… వారి వలసలు వారివే … ఇప్పుడు విశాఖ అయినా వారి పనులు వారివే. రాజధాని అమరావతిలో ఉన్నా, విశాఖలో ఉన్నా, తిరిగి చెన్నయ్ తీసుకెళ్ళినా బుగ్గకార్లు వచ్చేది, పోయేది నేతలకే గాని ప్రజలకు కాదు. ఈ ప్రజలకు ఏం కావాలో వారికి తెలుసు. నేతలకు ఏం కావాలో కూడా ప్రజలకు తెలుసు. ప్రజలేకేం కావాలో తెలుసుకోవాల్సింది నేతలే. తెలుసుకోలేకపోతే పోయేది వారి బుగ్గకార్లే… ఇదే వాస్తవం. మిగతాదంతా కల్పితం.
-దారా గోపి, సీనియర్ జర్నలిస్ట్, విజయవాడ