తెలంగాణా సీఎం కేసీఆర్ రైతులకు ప్రకటించబోయే ‘తీపి’ కబురు లీకైందా? ప్రముఖ పత్రికలకూ లభ్యం కాని ‘ఎక్స్ క్లూజివ్’ ఇన్ఫర్మేషన్ ను ఓ తెలుగు పత్రిక పట్టేసిందా? గత నెల 29న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఓ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ‘తెలంగాణా రైతులకు తొందర్లోనే తీపి కబురు చెబుతాను. అది దేశం ఆశ్చర్యపోయే విధంగాఉంటుంది. వారం రోజుల్లోనే ఈ తీపి కబురు చెబుతాను’ అని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై రైతులు తీవ్ర ఉత్కంఠను ఎదుర్కుంటున్నారు.
సీఎం కేసీఆర్ ఈ ప్రకటన చేసి దాదాపు నెల రోజులు కావస్తోంది. మరో రోజు గడిస్తే నెల కూడా పూర్తవుతుంది. కానీ ఇప్పటి వరకు రైతులకు ప్రకటించబోయే ఆ ‘తీపి కబురు’ ఏమిటనే అంశంపై రకరకాల వాదనలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగానే రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఇస్తారనే ప్రచారమూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రభ దినపత్రిక శనివారం ఓ ‘విశేష’ (ఎక్స్ క్లూజివ్) వార్తా కథనాన్ని ప్రచురించింది.
తెలంగాణా రైతులకు పింఛన్ ఇస్తారనేది విశేష వార్తా కథనపు సారాంశం. తద్వారా 35 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, 45 ఏళ్లు నిండిన రైతులకు పింఛన్ ప్రకటిస్తారని, వచ్చే యాసంగి సీజన్ నుంచి కొత్త పథకాన్ని అమలు చేస్తారని ‘ఆంధ్రప్రభ’ తన వార్తా కథనంలో నివేదించింది. ఇందుకు సంబంధించి విధి విధానాలు కూడా ఖరారయ్యాయని, ముఖ్యమంత్రి పరిశీలనలో ఫైల్ రెడీగా ఉందని పేర్కొంది. ‘ఆంధ్రప్రభ’ వార్తా కథనం వాస్తవమేనా? అనే ప్రశ్న అనవసరం.
ఎందుకంటే తోపులమని చెప్పుకునే ప్రముఖ పత్రికలకు చెందిన కొందరు విలేకరులకు మాత్రమే ‘స్కూప్ ఇన్ఫర్మేషన్’ సేకరించే అవకాశం ఉందనుకుంటే పొరపాటు. ఒక్కోసారి కాదు, అనేక సందర్భాల్లో ప్రముఖ పత్రికలకు సైతం సాధ్యం కాని ఇటువంటి సమాచారాన్ని భారీ సర్క్యులేషన్ లేని పత్రికలు సైతం సేకరిస్తుంటాయి. ఇది సంబంధిత పాత్రికేయుని ‘సోర్స్’కు సంబంధించిన కీలక అంశం. అందువల్ల ‘ఆంధ్రప్రభ’ వార్తా కథనం నిజమే కావాలని కోరుకుందాం. రైతులకు కేసీఆర్ ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కల్పిస్తే నిజంగానే దేశం యావత్తూ నివ్వెరపోతుందని చెప్పక తప్పదు.