నిజమా…? అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దవుతుందా? లేక ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే పరిస్థితులు మళ్లీ అనివార్యమవుతాయా? ఈమేరకు రాజకీయ ప్రత్యర్థులు ఏదేని చక్రం తిప్పుతున్నారా? అందుకే రాజధాని అంశంపై విశాఖ పర్యటనలో జగన్ సైలెంట్ అయ్యారా? కిమ్మనకుండా తన పర్యటనను ముగించుకుని వచ్చారా? సుజనా చౌదరి ఘీంకరింపుల అంతరార్థం ఏమిటి? ఇవీ ఏపీ రాజకీయాల్లో తాజా సందేహాలు.
ఏపీ రాజధాని మూడు ముక్కల అంశంలో తాజా రాజకీయ పరిణామాలు ఏం చెబుతున్నాయి? మొత్తం 16 మందితో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు కదా? మూడు వారాల్లో నివేదిక సమర్పణకు గడువు కూడా విధించారు. ఈ నేపథ్యంలోనే ‘అమరావతి అంగుళం కదిలినా ఊర్కోం. కేంద్రంతో మాట్లాడే చెబుతున్నా. అవసరమైనప్పుడు జోక్యం తప్పదు. రాజధాని రాష్ట్ర నిర్ణయమే కానీ, ఇప్పుడు కుదరదు. తరలిస్తే రూ. లక్షన్నర కోట్ల పరిహారం చెల్లించకతప్పదు. కేంద్ర సంస్థలకు కూడా భూములున్నాయ్.’ అంటూ తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన రాస్యసభ సభ్యుడు సుజనాచౌదరి ఘీంకరిస్తున్నారు. ‘మీ మాటేమైనా శాసనమా? నువ్వు చంద్రబాబుకు తొత్తువా? వ్యాపారం తప్ప నీకేం తెలుసు?’ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగానే స్పందించారనుకోండి.
ఈ తాజా పరిణామాల నేపథ్యంలోనే ‘మూడు ముక్కల’ ఆంధ్రా రాజధాని అంశంపై రాజకీయ వర్గాల్లో అంతర్గతంగా భారీగానే చర్చలు సాగుతున్నాయి. రాజధాని అంశంలో రైతుల ఆందోళన, రాజకీయ విమర్శల నేపథ్యంలో శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ దాదాపు తుది నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికల అధ్యయనం కోసం హైపవర్ కమిటీ నియమించాలని కేబినెట్ లో నిర్ణయించారు. అధికార వికేంద్రీకరణ ప్రకటన తర్వాత శనివారం సీఎం జగన్ విశాఖ ఫర్యటనకు వెళ్లారు. దాదాపు 1,300 కోట్ల విలువైన అబివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. శనివారం జగన్ విశాఖ పర్యటనలో 24 కిలోమీటర్ల మేర మానవహారంతో ప్రజలు ఆయనపై పూలవర్షం కురిపించిన దృశ్యాలు భారీ ఎత్తున కనిపించాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు గోదావరి జిల్లాల నుంచి కూడా ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ‘థాంక్యూ సీఎం’ అంటూ నినదించగా, సాగర తీరం హోరెత్తినట్లు జగన్ సొంత మీడియా నివేదించింది. అధికార వికేంద్రీకరణ ప్రకటన అనంతరం తొలిసారి విశాఖకు వెళ్లిన సీఎం జగన్ అక్కడి ప్రజలు మరింత సంతోషపడేలా ఎగ్జిక్యూటివ్ రాజధాని గురించి మాట్లాడుతారని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. కానీ ఇందుకు విరుద్ధంగా జగన్ తన విశాఖ పర్యటనను ముగించారనే వాదనపైనే ప్రస్తుతం వేడి వేడి చర్చ జరుగుతోంది.
సీఎం విశాఖ పర్యటన సందర్భంగా గడచిన పది రోజులుగా జరిగిన హడావిడి అంతా ఇంతా కాదట. మంత్రులు, అధికారగణం సీఎం పర్యటనపై ఊదరగొట్టే తరహాలు ప్రచారం చేశారట. అయితే పట్టుమని గంటసేపు కూడా జగన్ వేదికపై వుండకుండా… ఇలా వచ్చి అలా వెళ్లిపోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి రావడమే గంట ఆలస్యంగా జగన్ విశాఖకు వచ్చారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో 24 కి.మీ. దూరాన్ని గంటన్నర ప్రయాణించి కైలాసగిరికి చేరుకున్నారు. శంకుస్థాపనలు చేశాక, వెంటనే సిటీ సెంట్రల్ పార్కుకు చేరుకున్నారు. అక్కడ శిలాఫలకాలు ఆవిష్కరించాక, పుష్ప ప్రదర్శన తిలకించకుండానే ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన విశాఖ ఉత్సవ్ కార్యక్రమానికి హాజరయ్యారు. వేదికపై మొత్తం 25 నిమిషాల పాటు జగన్ ఉండగా, నిర్వాహకులు 20 నిమిషాలు విద్యుద్దీపాలు ఆపేసి లఘుచిత్రం, లేజర్ షో ప్రదర్శించారు. ఆ తరువాత ఐదు నిమిషాల్లో ఈఎన్సీ దంపతులను సత్కరించిన జగన్ ప్రజలకు నమస్కారించి వెళ్లిపోయారట. ఎగ్జిక్యూటివ్ రాజధాని గురించి మాట్లాడకపోయినా కనీసం విశాఖ ఉత్సవ్ గురించి అయినా నాలుగు మాటలు చెప్పి వుంటే బాగుండేదని కొందరు వ్యాఖ్యానించడం వెనుక రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి.
రాజధాని అంశంలో తెలుగుదేశం పార్టీ నేతలతోపాటు బీజేపీలో చేరిన సుజనాచౌదరి వంటి ఎంపీలు జగన్ పై కుట్రలు సాగిస్తున్నారని, జగన్ బెయిల్ రద్దు చేయించే దిశగా ఈ ప్రయత్నాలు సాగుతున్నాయన్నది తాజాగా జరుగుతున్న ప్రచారపు సారాంశం. చంద్రబాబు కుట్రలు చేస్తున్నారంటూ వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా పలువురు ఉటంకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు తెరవెనుక అనేక ప్రయత్నాలు సాగుతున్నాయంటున్నారు. ఈ అంశంలో సమాచారం ఉండడం వల్లే అటు మంత్రివర్గ సమావేశంలోనూ, ఇటు విశాఖ పర్యటనలోనూ రాజధాని గురించి జగన్ ‘దూకుడు’ గా ప్రకటన చేయలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైపవర్ కమిటీ ఏర్పాటు పరిణామాలు ఇందులో భాగమనే వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయి. ఔనా..నిజమేనా? జగన్ దూకుడుకు కళ్లెం వేయగలిగే శక్తి సామర్థ్యాలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇంకా కలిగే ఉన్నారా? ఇదీ ఇప్పడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. ఏం జరుగుతుందన్నది హైపవర్ కమిటీ నివేదిక వచ్చే వరకు అంటే…మరో మూడు వారాలు, కాస్త ఆలస్యమైతే నెల రోజుల వరకు వేచి చూడాల్సిందే.