‘రాజకీయం’ అంటే ఇదే మరి. ఊహకు అందకుండా పావులు కదపడాన్నే రాజకీయంగా నిర్వచించవచ్చు. తమ పార్టీలో ఏం జరుగుతోందన్నది ముఖ్యం కాదు, పక్క పార్టీ రాజకీయాలను ప్రభావితం చేసి, తమకు అనుకూలంగా ఉండే నేతను కుర్చీలో కూర్చోబెట్టడమే అసలైన రాజకీయం. అంతర్గత ‘ప్రజాస్వామ్యం’ మరీ ఎక్కువ పాళ్లలో ఉండే కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి రాజకీయాలకు సాధ్యపడే అంశాలు ఎక్కడెక్కడో లింకులు కలిగి ఉంటాయి. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏదైనా మాట్లాడవచ్చనే అభిప్రాయమూ ఉంది. అందరి అంచనాలకు అనుగుణంగా తెలంగాణా పీసీసీ చీఫ్ ఎంపిక జరిగితే అది కాంగ్రెస్ పార్టీ ఎలా అవుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణా కొత్త పీసీసీ అధ్యక్షుని నియామకంపై పార్టీ అధిష్టానం భారీ కసరత్తే చేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ నిర్వహిస్తున్న అభిప్రాయ సేకరణ శనివారంతో ముగిసింది.
ఈ నేపథ్యంలోనే అభిప్రాయసేకరణ ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోఢీకరించి పార్టీ అధిష్టానానికి ఠాగూర్ నివేదిక పంపిస్తారని, కొద్దిరోజుల్లోనే టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని పార్టీ ప్రకటిస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అభిప్రాయ సేకరణలో మాత్రం ఎక్కువగా ఎంపీ రేవంత్ రెడ్డి వైపే మొగ్గు లభించిందనే ప్రచారం జరుగుతోంది. రెండో స్థానంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు నిలిచినట్లు ప్రచారం ఉండగా, అనూహ్యంగా మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేరు కూడా తెరపైకి రావడం గమనార్హం. జీవన్ రెడ్డి, తూర్పు జయప్రకాష్ రెడ్డిల పేర్లు కూడా ఇంకోవైపు వినిపిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ పదవికి ఎంపిక అంశంపై నిర్వహించిన అభిప్రాయసేకరణపైనా భిన్న ప్రచారం జరుగుతోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం… టీపీసీసీ చీఫ్ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ ఈ విషయంలో జోక్యం చేసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి పేరును ప్రకటించవచ్చని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందుకు విరుద్దంగా జరిగితే మాత్రం ఎంపిక మరో విధంగా ఉండవచ్చంటున్నారు. తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో కలకలం కలిగించే తాజా సమాచారం ఏమిటంటే… టీపీసీసీ అధ్యక్షుని ఎంపీకలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత జోక్యం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి దక్కకుండా ఆంధ్రాకు చెందిన ఆ నాయకుడి ద్వారా తెలంగాణాకు చెందిన ముఖ్య నేత ఒకరు పావులు కదుపుతున్నారనేది ఈ ప్రచారపు సారాంశం. ఆంధ్రా నాయకుడి ప్రయత్నం గనుక సఫలమైతే కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ నేత పీసీసీ చీఫ్ కావచ్చనేది కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం.
ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైతే కలిగే ఇబ్బంది ఎవరికి? భవిష్యత్ రాజకీయంపై బెంగ పట్టుకునేదెవరికి? రేవంత్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ పీసీసీ అధ్యక్షుడు కాకుండా అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తెలంగాణాకు చెందిన ఆ ముఖ్య నేత ఎవరు? టీపీసీసీ చీఫ్ ఎంపికలో ఆంధ్రాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మాట నెగ్గితే తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? అంతిమంగా కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయం ఏమిటి? ఇదీ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తలెత్తుతున్న సందేహాలు. ఇంతకీ రేవంత్ రెడ్డి పదవికి ఆంధ్రా కాంగ్రెస్ నాయకుడి ద్వారా మొకాలొడ్డుతున్న తెలంగాణా నేత ఎవరనేది బోధపడుతున్నట్లేగా? ఎంతకీ అర్థం కాకుంటే మీ ఆలోచనను అర్జంటుగా ఓసారి ఢిల్లీవైపు మళ్లించాల్సిందేనని కొందరు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ ఎంపిక కసరత్తు ప్రక్రియలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.