సల్వాజుడుంలో చేరకపోతే మావోయిస్టు నక్సలైట్ల కింద లెక్కే… ప్రభుత్వ వ్యతిరేకులే… మవోయిస్టుల్లో జాయిన్ కాకపోతే సల్వాజుడుం కార్యకర్తలే, విప్లవోద్యమ ద్రోహులుగా పరిగణించక తప్పదు. ఆయా సంస్థల్లో చేరని వారు వాటి విధానాలను అనుసరించని ద్రోహుల కింద లెక్కే. కొంత కాలం క్రితం వరకు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల సరిహద్దుల్లోని ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో గల పరిస్థితి ఇది. ఇదేం గోలరా బాబూ అనుకుంటూ, భయకంపితులై.. బతుకు జీవుడా అనుకుంటూ పొరుగున గల తెలుగు రాష్ట్రాలకు అక్కడి గిరిజనులు అనేక మంది వలస బాట పట్టక తప్పలేదు. సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ బతికి ఉన్నంత కాలం దాని ప్రాభవం, ప్రభావమే వేరు. ఈ సంస్థ దెబ్బకు అటు మురియా, ఇటు గొత్తికోయ తెగలకు చెందిన ఆదివాసీ గిరిజనులు ప్రాణభయంతో కాలం గడిపారు. కాలగమనంలో సల్వాజుడుం చట్టబద్దతపై న్యాయ వ్యవస్థ ప్రశ్నించడం, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం, సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మ మావోల కాల్పుల్లోనే మరణించడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అక్కడి సమస్యలు తీరినట్లు లేదుగాని రూపం మార్చుకున్నాయి అంతే.

ఇప్పుడు తెలంగాణా రాజకీయాల్లోకి వద్దాం. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న రోజుల్లో..అంటే 2014లో రాష్ట్రం సిద్ధించేవరకు కూడా తెలంగాణా ఉద్యమంలో కలిసిరాని నాయకులే కాదు అన్ని వర్గాల వారు కూడా తెలంగాణా ద్రోహుల కిందే లెక్క. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగుతున్న అప్పటి రోజుల్లో తెలంగాణా సెంటిమెంట్ ముందు ఎంతటి కాకలు తీరిన రాజకీయ నేతలైనా తలవంచక తప్పలేదు. తెలంగాణా అంశంలో చిన్న వ్యతిరేక మాట దొర్లినా వారిని ద్రోహులుగానే తెలంగాణా వాదులు పరిగణించేవారు. ఉద్యమ ప్రస్థానంలో, ప్రత్యేక రాష్ట్ర సాధనలో అనుసరించిన వైఖరిలో ఇదో వ్యూహం కూడా. ‘ద్రోహులు’ అనే పద ప్రభావపు ధాటికి అన్ని రంగాల ప్రముఖులు కూడా జై తెలంగాణా అని నినదించక అనివార్య పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సైతం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు లేఖ ఇవ్వక తప్పలేదు. అధికారంలో గల కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక మంది తమ పదవులకు రాజీనామా చేయక తప్పలేదు. పార్లమెంటులో ప్ల కార్డుల ప్రదర్శన ద్వారా వీర సమైక్యవాదాన్ని ఆలపించిన జగన్ మానుకోట రాళ్లదాడి అనుభవాన్ని చవి చూసిన సంగతి తెలిసిందే.

ఇవన్నీ పాత సంగతులే కదా…అని తీసి పారేయకండి. ఇదిగో అచ్చం ఇటువంటి ‘ద్రోహుల’ పదం అనుభవాన్నే ఆంధ్రప్రదేశ్ లోని పలు పార్టీల నేతలు తాజాగా ఎదుర్కుంటున్నారట. ముఖ్యమంత్రి జగన్ విసిరిన ‘మూడు ముక్కల’ రాజధాని విషయంలో తమ ‘పొలిటికల్ లైఫ్’ ఉంటుందో, ఊడుతుందో తెలియని భయానక పరిస్థితిని ఎదుర్కుంటున్నారట. ఉత్తరాంధ్రకు రాజధాని వద్దనే వారిని ఆ ప్రాంత ద్రోహులుగా అభివర్ణిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ‘ఉత్తరాంధ్రకు రాజధాని వద్దా?’ చెప్పండి అని నిలదీస్తున్నారట. దీంతో అక్కడి టీడీపీ నేతలు తమ పరిస్థితి ఏమిటో తెలియక లోలోనే కుమిలిపోతున్నారట. విపక్షాలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ విశాఖ రాజధానికి వ్యతిరేకమనే సెంటిమెంట్ ను అధికార పార్టీ నేతలు మసాలా దట్టించి మరీ రెచ్చగొడుతున్నారట. దీంతో పార్టీ విధానం ప్రకారం అమరావతికి మద్ధతునిస్తే తమకు రాజకీయ భవిత ఉండదనే ఆందోళనతోనే కార్యనిర్వాహక రాజధానికి అక్కడి టీడీపీ నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే మొత్తం ఎపిసోడ్ లో కొసమెరుపు ఏమిటంటే..అధికార పార్టీ నేతలు కోస్తాంధ్రా ద్రోహులనే నినాదాన్ని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన టీడీపీ నాయకులు అందుకోబోతున్నారట. అమరావతిని నిర్వీర్యం చేయడం కూడా ‘ద్రోహం’ అనే వాదనకు దిగబోతున్నారట. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర నేతల సంగతి సరే, రాయలసీమ వాసులేమంటున్నారనేగా చివరి ప్రశ్న. వీలైతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని రగిల్చే దిశగా సమాలోచనలు చేస్తున్నారట. మొత్తంగా జగన్ విసిరిన మూడు ముక్కల రాజధాని ప్రకటన విపక్ష టీడీపీ నేతలనేకాదు, అధికార పార్టీ నాయకుల్లోనూ తీవ్ర కలవరానికి కారణమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాల వైఎస్ఆర్ సీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో తమ పరిస్థితిపై ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోందట. అధినేత నిర్ణయాన్ని వ్యతిరేకించలేరు.. అలాగని మూడు రాజధానులు ఉండాల్సిందేనని గట్టిగా చెప్పే పరిస్థితి లేదట. పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అన్య మనస్కంగానే చెబుతున్నారట. ఉత్తరాంధ్ర ద్రోహం సరే…కొత్తగా కోస్తాంధ్రా ద్రోహం నినాదమే అసలు ప్రాబ్లంగా మారితే ఎలా? అనే సంశయం అధికార పార్టీ నేతలను వెంటాడుతున్నట్లు సమాచారం.

Comments are closed.

Exit mobile version