‘జగనన్న’గా అభిమానులు పిల్చుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చిన్నారులు ఇక నుంచి ‘జగన్ మామ’గా పిలుచుకోవచ్చు. ‘ఈ జగన్ మామ అండగా ఉన్నాడు’ అని చదువుకునే చిన్నారులకు చెప్పాల్సిందిగా తల్లులను ఆయన కోరడం విశేషం.
‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పథకం పైలట్ ప్రాజెక్టుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో పథకం పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మందడుగు వేసిందని, పిల్లల భవిష్యత్ కోసం మరో నాలుగు అడుగులు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 9వ తేదీన ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రారంభిస్తున్నామని, పిల్లల చదువు విషయంలో తల్లులెవరూ భయపడాల్సిన అవసరం లేదని జగన్ భరోసా ఇచ్చారు. ‘జగన్ మామ’ అండగా ఉన్నాడని పిల్లలకు చెప్పాల్సిందిగా ఆయన సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నామని, ప్రపంచంతో పోటీ పడవచ్చని కూడా జగన్ స్పష్టం చేశారు.