బహుషా ఎల్లో మీడియాగా ప్రాచుర్యం పొందిన ప్రసార మాధ్యమాలకు నేడు ఇది పండగ లాంటి వార్త కావచ్చు. సీఎం హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారహో… అని తాటికాయలంత అక్షరాలతో వార్తలు రాసుకునే పత్రికా స్వేచ్ఛకు ఎటువంటి భంగం కూడా కలగకపోవచ్చు. అక్రమాస్తుల అభియోగపు కేసులో జగన్మోహన్ రెడ్డి అనే నిందితుడు సీబీఐ కోర్టుకు హాజరు కావడం ఇది తొలిసారి కాదు. ఇదే చివరి సారి కూడా కాకపోవచ్చు. కానీ నిరుడు మార్చి1వ తేదీన ఈ కేసులో ఏ1 (అక్యూజ్డ్ నెం. 1) గా జగన్ చివరిసారిగా హాజరయ్యారు. అనంతర పరిణామాల్లో ఎన్నికలు రావడం, వైఎస్ఆర్ సీపీ విజయదుందుభి మోగించడం, జగన్ అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం తెలిసిందే.
ఏపీ సీఎం అయ్యాక జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యే విషయంలో ఆయన తరపున లాయర్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ హాజరు కావడం లేదంటూ సీబీఐ అభ్యంతరం చెప్పడంతో, ఈనెల 10న జగన్ తోపాటు రెండో నిందితుడైన ఎంపీ విజయసాయిరెడ్డి కూడా వ్యక్తిగతంగా హాజరు కావలసిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరు కావడానికి ఏపీ సీఎం జగన్ బయలుదేరినట్లు కూడా తాజా వార్తల సారాంశం. సరే.. అక్రమాస్తుల కేసులో జగన్ సీబీఐ కోర్టుకు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి హాజరవుతున్నారన్నదే కదా తాజా టాపిక్? సీఎం హోదాలో కోర్టుకు హాజరవుతున్న జగన్ దేశంలో తొలి సీఎం కాకపోవడమే ఈ సందర్భంగా గమనార్హం.
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దివంగత జయలలిత కూడా సీఎం హోదాలో బెంగళూరు కోర్టుకు హాజరయ్యారు. జార్ఖండ్ లో మధు కోడా, బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్, హిమాచల్ ప్రదేశ్ లో వీరభద్రసింగ్ తదితరులు కూడా వేర్వేరు కేసుల్లో, సందర్భాల్లో సీఎంల హోదాలోనే కోర్టు విచారణకు హాజరైన ఉదంతాలు ఉన్నాయి. వీరిలో జయలలిత హాజరునే ఇప్పటికీ పలువురు ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. తమిళనాడు సీఎంగా బెంగళూరు కోర్టుకు హాజరయ్యేందుకు జయలలిత బయలుదేరాలంటే పెద్ద తతంగమే ఉండేది. తాను ఏ హోటల్లోనూ ఉండేవారు కాదు. గెస్ట్ హౌజ్ లో మాత్రమే బస చేసేవారు. దీంతో నాలుగైదు ట్రక్కుల్లో మందీ, మార్బలం, వంట సామాగ్రి, వైద్యులు, అంబులెన్సు వెంట తరలిరాగా జయలలిత కోర్టుకు హాజరయ్యే సీన్ ‘హంగామా’ను తలపించేదని చెబుతుంటారు. ఓ రకంగా వేడుకను కూడా తలపించేదట. జయలలిత ఆరోగ్యం తదితర అంశాల కారణంగా అనేక రకాల వాహనాలతో భారీ కాన్వాయ్ ఉండేదట.
వాస్తవానికి ఆరోపణలు, కేసుల వ్యవహారం వేర్వేరుగా ఉన్నప్పటికీ కోర్టుకు హాజరయ్యే అంశంలో జగన్మోహన్ రెడ్డికి, మిగతా ముఖ్యమంత్రులకు వ్యత్యాసం ఉండడమే ఇక్కడ అసలు విశేషం. జయలలిత, లాలూ ప్రసాద్, మధుకోడా, వీరభద్రసింగ్ వంటి నాయకులు ముఖ్యమంత్రులు అయ్యాక మాత్రమే ఆరోపణలు, కేసుల నమోదు, కోర్టుకు హాజరు కావడం వంటి పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి. అదీ ఆయా ముఖ్యమంత్రులు తమకు గల ‘హోదా’తో కోర్టుకు హాజరయ్యే అంశంలో గల వ్యత్యాసం.
న్యాయ పరిభాషలో చెప్పాలంటే ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా కోర్టుకు ఒకటే. ఇక్కడ జగన్ హాజరవుతున్నది తెలంగాణాలోని సీబీఐ కోర్టుకనే విషయం గమనార్హం. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలోకి వచ్చినపుడు భద్రత కల్పించడమనేది సంబంధిత రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం బాధ్యత. జగన్ వంటి నేతకే కాదు పలువురు రాజకీయ నేతలకు అనేక మంది శత్రువులు ఉంటారు. విశాఖ విమానాశ్రయపు ‘కోడి కత్తి’ ఘటన ఇందుకు నిదర్శనం. వ్యక్తిగత భద్రత, ప్రాధాన్యతా క్రమం ప్రామాణికంగా ఏ ముఖ్యమంత్రికైనా భద్రత కల్పించడం సంబంధిత రాష్ట్ర పోలీసుల విధి.
ఈ నేపథ్యంలోనే జగన్ ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు హాజరవుతున్నారన్నది అసలు ‘విషయమే’ కాదు. ఎందుకంటే అభియోగాలకు సంబంధించిన కేసులన్నీ జగన్ ముఖ్యమంత్రి కాకముందే నమోదు కావడం గమనార్హం. అందువల్ల కోర్టు హాల్లోకి ప్రవేశించకముందు మాత్రమే జగన్ ముఖ్యమంత్రి హోదాను కలిగి ఉంటారు. కోర్టు బోనులోకి వెళ్లాక మాత్రం జగన్ అక్రమాస్తుల అభియోగపు కేసులో నిందితుడు మాత్రమే. ఇటువంటి సందర్భంలో ఏ హోదాలో ఉన్న వ్యక్తికైనా అన్ని ప్రత్యేక ప్రతిపత్తులు పోతాయి. కోర్టు హాల్లో నిందితునికి హోదా వర్తించదు. చట్టం ముందు అందరూ సమానులే (ALL ARE EQUAL BEFORE LAW). అది వైఎస్ జగన్ కావచ్చు, మరెవరైనా కావచ్చు. ఇక్కడ హోదాల్లేవమ్మా.. ఉండవ్ కూడా!