తెలుగు మీడియాలోని రెండు న్యూస్ ఛానళ్లపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును నిన్న ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్ లో ఎంపీ రఘురామ కృష్ణరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని, రెండు కులాలపై వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపించేలా మాట్లాడారని, ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని సీఐడీ పేర్కొంది. ప్రజల్లో అసంతృప్తి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపించేందుకు పథకం ప్రకారం కొన్ని మీడియా చానళ్లతో కలిసి కుట్ర పన్నారని, కులం, మతం ప్రాతిపదికన విభజన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని సీఐడీ అభియోగాలను మోపింది.ఈమేరకు ఎంపీ రఘురామ కృష్ణరాజుపై ఐపీసీ 124ఏ,153ఏ, రెడ్విత్ 120బి, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఇదే కేసులో ఏ2గా టీవీ 5, ఏ3గా ఏబీఎన్ న్యూస్ ఛానళ్లను పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ రెండు న్యూస్ ఛానల్స్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు స్లాట్స్ కేటాయించాయని సీఐడీ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. కాగా విచారణ పూర్తి అయ్యే వరకు ఎంపీ రఘురామ కృష్ణరాజును మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచవద్దని నిన్న రాత్రి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.