తన ఇంటిగేటు బయట దీనంగా, నిస్సహాయ స్థితిలో కూర్చున్న ఈమె పేరు కట్ట శ్యామల. వయస్సు 80 ఏళ్లు. కరోనా పరిణామాలు, లాక్ డౌన్ పరిస్థితులకు ముందే బంధువుల ఇంట్లో ఓ పురుడు కార్యక్రమం ఉంటే షోలాపూర్ కు వెళ్లింది. లాక్ డౌన్ కారణంగా అక్కేడ చిక్కుకుపోయింది. తాజాగా సడలింపుల పరిస్థితుల్లో శుక్రవారం ఉదయం కరీంనగర్ లోని కిసాన్ నగర్ లో గల తన ఇంటికి చేరుకుంది. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఆమె గేటు తీసేందుకు ప్రయత్నిస్తుండగా, కొడుకు నరసింహాచారి, కోడలు దేవిక ఆమెను అడ్డుకున్నారు. లోనికి రావద్దంటూ గేటుకు తాళం వేసి శ్యామలను గెంటేశారు. ముఖం చాటేశారు.
ఉదయం ఆరు గంటల నుంచి పగలు 12 గంటల వరకు కూడా ఆ వృద్ధురాలు గేటు బయటే ఉంది. ఎండవేడికి తాళలేక గేటు ముందే సొమ్మసిల్లింది. అయినప్పటికీ కొడుకు, కోడలు ఆమెను కరుణించలేదు. శ్యామల ఇంట్లోకి వస్తే మానేర్ డ్యాంలో దూకి చస్తామంటూ కొడుకు, కోడలు పోలీసులను కూడా బెదిరించారు. ఇంతకీ శ్యామలను కొడుకు, కోడలు ఇంట్లోకి రాకుండా గేటు బయటే ఎందుకు అడ్డుకున్నారో తెలిస్తే గుండె తరుక్కుపోక తప్పదు. శ్యామల మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి వచ్చింది కాబట్టి, ఆమెకు కరోనా ఉందని వారి అనుమానమట. అందుకే గేటుకు తాళం వేసి గెంటేశారట.
అసలు నిజమేంటంటే…శ్యామలకు ఎటువంటి కరోనా లక్షణాలు లేవని మహారాష్ట్రలోనే టెస్టులు చేసి మరీ చెప్పారట. మీ సొంతూరికి వెళ్లిపోవచ్చని కూడా వైద్యులు సూచించారట. కానీ కరోనా ఉన్నట్లు కొడుకు, కోడలే అనుమానిస్తూ బయటికి గెంటేయడం పలువురిని ఆవేదనకు గురి చేసింది. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ ఎడ్ల సరిత భర్త అశోక్ ఘటనా స్థలానికి చేరుకుని ఆమె ఇద్దరు కొడుకులైన నరసింహాచారి, ఈశ్వరాచారిలకు గట్టి కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో అయిష్టంగానే శ్యామలకు గల ప్రత్యేక గదిలోకి రావడానికి వాళ్లు అనుమతించారు. అదీ కొన్ని షరతుల మీద మాత్రమే. శ్యామల తన వంట తానే చేసుకోవాలి. అన్నం వండి పెట్టేది లేదు. ఇవీ కన్నతల్లికి కొడుకులు విధించిన కండిషన్లు.
అవ్వా… శ్యామలవ్వా ఎందుకు తల్లీ ఇటువంటి ‘కొడుకు’లను కన్నావ్…? కన్నతల్లిపై కించిత్ మమకారం కూడా లేని ఇటువంటి ‘కొడుకులు’ ఏ తల్లికీ వద్దే వద్దు…!! అంటున్నారట కరీంనగర్ లోని కిసాన్ నగర్ ప్రాంత వాసులు.
ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియోను దిగువన చూడండి.