ముందుగా పై ఫొటోను చూడండి. ఇదో వైన్ షాపు. దాదాపు 23 మంది ఎటువంటి భౌతిక దూరం పాటించకుండా మందు బాటిళ్ల కొనుగోలు కోసం రాసుకుని, పూసుకుని ఎగబడుతున్న దృశ్యమిది. లాక్ డౌన్ అనంతరం లిక్కర్ షాపులు తెరిచిన తొలి, మలిరోజు చిత్రం కాదు సుమీ! నిన్నగాక మొన్న తీసిన లేటెస్ట్ ఫొటోనే. చారిత్రక ఖమ్మం నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఓ వైన్ షాపు ముందు సాక్షాత్కరించిన సీన్ ఇది. ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ఇటువంటి సీన్లు కనిపించే అటువంటి వైన్ షాపుల లైసెన్స్ రద్దు చేశారా? చర్యలు తీసుకున్నారా? అనే ప్రశ్నలను మాత్రం అడక్కండి… వదిలేయండి. ఇప్పుడు దిగువన గల సోషల్ మీడియా పోస్టును కూడా చదవండి.
శీర్షీకరించిన ప్రకారం ఫొటోకు, సోషల్ మీడియా పోస్టుకు సరిగ్గా కుదిరినట్లేగా? అయితే మరో సోషల్ మీడియా పోస్టును కూడా చదివేయండి… ఆ తర్వాత నిర్ణయం మీదే…!
లక్ష కేసులు దాటాక ఇచ్చేదాన్ని ‘సడలింపు’ అనరు…. ‘చేతులెత్తేయడం’ అంటారు. కావున మనమందరం జాగ్రత్తగా మన జీవితాన్ని కొనసాగించాలి. ప్రకృతి కోపాన్ని తుపాన్, సునామీ. భూకంపాల రూపంలో చూశాం. కరోనాతో అర్థమయింది ఏమిటంటే…? ప్రపంచాన్ని ఊడ్చేయగల శక్తి ప్రకృతికి మాత్రమే ఉందని. కరోనా సమయంలో మీ ప్రాణాన్ని మీరే కాపాడుకోవాలి. లేకపోతే కరోనా సుందరి మీ ఒడిలో వాలుతుంది.
కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్ లో కూర్చునేందుకు కూడా జాగా ఉండకపోవొచ్చు. మందైనా, విందైనా, చిందయినా ఇవ్వాళ కాకుంటే రేపైనా దొరుకుతాయి. ఉన్నది ఒకటే జిందగీ..! పోయిందంటే ‘చచ్చినా’ మళ్ళీ రాదు.
దాదాపుగా లాక్ డౌన్ ఎత్తివేసినట్లుగానే భావించాలి. ఫంక్షన్ హాళ్లు, మీటింగులు, దేవాలయాలు లాంటివి తప్ప మిగతావన్నీ అందుబాటులో ఉంటాయి.
కాబట్టి కరోనాతో సహజీవనం చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు వరకు మన పరిస్థితి ఒక ఎత్తు. ఇక రేపటి నుండి మరో ఎత్తు.
బస్సులో వెళ్లినా,
ఆటోలో వెళ్లినా,
షాపునకు వెళ్లినా,
ఆఫీసుకు వెళ్లినా,
ఎవరి ఇంటికైనా వెళ్ళాలన్నా,
బంధు, మిత్రులు,
ఎవరైనా సరే…
మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరితో అప్రమత్తంగా ఉండాలి… అనుక్షణం జాగ్రత్తతో వ్యవహరించాలి. ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాం కాబట్టి అంత టెన్షన్ లేకపోవచ్చు. ఇక ఇప్పుడు మొదలు కాబోతున్నది అసలు కత. ఇక మన పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగ రీత్యా, పర్సనల్ పనుల కోసం ఎక్కడికి వెళ్లినా COVID-19 విషయంలో జాగ్రత్తలు అన్ని తీసుకొని మనల్ని మనం కాపాడుకుంటూ… మన వాళ్ళను కాపాడుకుందాం..!!!
మరో సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం…
మొత్తంగా చెప్పేదేమిటంటే…?
లాక్ డౌన్ పాటిస్తున్నట్లు జనం నటిస్తున్నారు
లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు పాలకులు నటిస్తున్నారు
కానీ… కరోనా మాత్రం నటించడం లేదు, జీవిస్తోంది.
పెరుగుతున్న కేసులు, జరుగుతున్న మరణాలే ఇందుకు సాక్ష్యం.
ఇదీ మన దేశపు కరోనా కేసుల లెక్క
నిన్న ఒక్క రోజు కేసులు 6,977
మొత్తం కేసులు 1,38,848
మరణాల సంఖ్య 4,021