‘గరీబోళ్ల బిడ్డా… నిను మరువదు ఈ గడ్డ’ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి అంజయ్య మరణం సందర్భంగా ప్రచురితమైన వార్తా కథనానికి అప్పట్లో బాగా కుదిరిన హెడ్డింగ్ ఇది. ఈ శీర్షిక ద్వారానే వర్ధెల్లి మురళిలోని జర్నలిజపు ప్రతిభ బహిర్గతమైందని సీనియర్లు చెబుతుంటారు. ‘ప్రాస’ పదాలతో కూడిన ఇటువంటి శీర్షికల విషయంలో వర్ధెల్లి మురళి బాగా చేయి తిరిగిన జర్నలిస్టుగా ప్రాచుర్యం పొందారు. ప్రస్తుతం ఆయన ‘సాక్షి’ పత్రికకు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. వార్తా కథనాలకు హెడ్డింగులు పెట్టడంలో మురళి నైపుణ్యాన్ని ఏబీకే ప్రసాద్ వంటి సీనియర్ ఎడిటర్లు కూడా ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయని ఆయన గురించి ఆది నుంచీ తెలిసిన జర్నలిస్టులు చెబుతుంటారు.
అయితే ‘డెస్క్ మ్యాన్’ ఉన్నదే హెడ్డింగులు పెట్టడానికి, వాళ్ల డ్యూటీనే అది, అందులో గొప్పేముంది? అని మురళి అంటే గిట్టనివారు అప్పట్లో వ్యాఖ్యానించినట్లు కూడా ప్రచారం ఉంది. ఫీల్డ్ వర్క్ చేసే రిపోర్టలకు, డెస్కు మ్యాన్ గా కుర్చీలో కుదురుగా కూర్చుని వాటికి ‘హెడ్డింగులు’ పెట్టే సబ్ ఎడిటర్ల పనితీరుపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయనేది వేరే విషయం. ఇప్పుడీ అంశాలను ఎందుకు ప్రస్తావించాల్సి వస్తోందంటే…? వర్ధెల్లి మురళి ప్రతి ఆదివారం లాగే ఈరోజు కూడా తన ‘జనతంత్రం’ కాలమ్ ద్వారా సాక్షి ఎడిటోరియల్ పేజీలో సుదీర్ఘ వ్యాసాన్ని రాశారు.
‘చూడు చూడు నీడలు!’ శీర్షికన ఆయన రాసిన సుదీర్ఘ వ్యాసంలో ‘బర్నింగ్ ఇష్యూ’నే కంటెంట్ గా తీసుకున్నారు. ప్రముఖులపై నమోదైన ఎఫ్ఐఆర్ అంశంలో వార్తలు ప్రచురించకూడదనే అంశానికి సంబంధించి తనదైన శైలిలో సుదీర్ఘ విశ్లేషణ చేశారు. సుప్రీంకోర్టులోని ఓ న్యాయమూర్తికి, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడికీ ఉన్న సంబంధాలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చలమేశ్వర్ అప్పట్లోనే సందేహాలను లేవనెత్తారని ప్రస్తావించారు. ఇందుకు సంబంధించి ‘ఎకనామిక్ టైమ్స్’ పత్రిక కథనం ప్రకారం… అంటూ మురళి తన వ్యాసంలో ఎక్కువ వాక్యాలను కొనసాగించారు.
‘చంద్రబాబు ప్రభుత్వం 13 మంది సిటింగ్ జడ్జిలకు వ్యక్తిగతంగానే 600 గజాల చొప్పున రిజిస్టర్ చేసినట్లు వార్తలు వచ్చాయి’ అంటూ న్యాయమూర్తుల ఇళ్ల స్థలాలను మురళి ఉటంకించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధాని భూ సమీకరణ పేరుతో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాజీ అడ్వకేట్ జనరల్ పై ఏసీబీ తగిన సాక్ష్యాధారాలతో ఎఫ్ఐఆర్ వేసిందన్నారు. ఈ ఎఫ్ఐఆర్ లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇద్దరు కుమార్తెల పేర్లు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి’ అని మురళి తన వ్యాసంలో పేర్కొన్నారు.
ఈసారి మురళి రాసిన ‘జనతంత్రం’ వ్యాసంలో ఎక్కువగా ‘వార్తలు వచ్చాయి.., విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.., మేధావులు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.., ఉత్తర్వులపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.., విచారణను నిలువరించే అధికారం కోర్టులకు లేదని పలువురు అభిప్రాయపడ్డారు.., ఏసీబీ నమోదు చేసిన డాక్యుమెంటులోని వివరాలు ప్రచురిస్తే, ప్రసారం చేస్తే తప్పేమిటో అర్ధం కావడం లేదని పలువురు వ్యాఖ్యానించారు.’ అంటూ వ్యాసం సాగడం గమనార్హం. ఎవరు అభిప్రాయపడ్డారు? మరెవరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు? వ్యాఖ్యానించిన వ్యక్తులెవరు? అనే వివరాలు లేకపోవడమే అసలు విశేషం.
ఈ అంశంలో రాజ్ దీప్ సర్దేశాయి వంటి ప్రముఖ జర్నలిస్టుల, ఇతర ముఖ్యుల అభిప్రాయాలను ‘సాక్షి’ పత్రిక మూడు రోజుల క్రితం ఓ వార్తా కథనాన్ని కూడా ప్రచురించింది. ఆయా వ్యక్తులనైనా కనీసం ఈ వ్యాసంలో ఉటంకించకుండా సాగించారు. మొత్తంగా చెప్పొచ్చేదేమిటంటే… న్యాయవ్యవస్థకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ‘జనతంత్రం’ కాలమ్ వ్యాసంలో వర్ధెల్లి మురళి సాక్షి పత్రిక ఎడిటర్ హోదాలో తన అభిప్రాయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పలేకపోయారనే భావన కలుగుతోంది. ‘ఎకనామిక్ టైమ్స్’ కథనంలోని అంశాలనే ముందుగా బేస్ చేసుకుని, వ్యక్తీకరించినట్లు పేర్కొన్న ‘అభిప్రాయాలకు, వ్యాఖ్యలకు’ సంబంధించి ఎవరి పేర్లనూ రాయకపోవడమే ‘ప్రత్యేకత’గా కనిపించింది.
‘వార్తలు వచ్చాయి, ప్రజలు అనుకుంటున్నారు, పలువురు అభిప్రాయపడుతున్నారు, అనేక మంది వ్యాఖ్యానించారు’ వంటి పదాలను ఎక్కువగా మండల స్థాయి విలేకరులు వాడుతుంటారు. ఇటువంటి వ్యాఖ్యలతో కూడిన కథనాలను ‘ఫీల్డ్’ వర్క్ చేయకుండా రాసే వార్తలుగా జర్నలిజంలో అభివర్ణిస్తుంటారు. ఇందుకు సంబంధించి రిపోర్టర్ల పనితీరును వేలెత్తి చూపేది కూడా ‘డెస్క్’ జర్నలిస్టులే. వాస్తవానికి వర్ధెల్లి మురళికి ‘డెస్క్ మ్యాన్’గానే ఎక్కువగా సర్వీసు ఉంది. రిపోర్టర్ గా ఆయన ‘ఫీల్డ్’ వర్క్ చేసిన దాఖలాలు పెద్దగా ఉన్నట్లు కూడా లేవు.
ఫీల్డ్ వర్క్ అనుభవం గల జర్నలిస్టులు రాసే వార్తా కథనాలుగాని, వ్యాసాల తీరుతెన్నులుగాని భిన్నంగా ఉంటాయి. ఎలాగంటే… ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ ప్రతీ ఆదివారం తన పత్రికలోని ఎడిటోరియల్ పేజీలో రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ వ్యాసాల టైపు అన్నమాట. తమ రాతలను ప్రజలు నమ్మతున్నారా? లేదా? అనే తర్కం అనవసరం ఇక్కడ. తమ వాదనను రాతల ద్వారా జనం మస్తిష్కంలోకి సూటిగా నాటగలిగామా? లేదా? అనేదే ఆధునిక జర్నలిజంలో ముఖ్యం. అన్నట్లు ‘స్టాఫ్ రిపోర్టర్’గా ఫీల్డ్ వర్క్ అనుభవం గల వేమూరి రాధాకృష్ణ కూడా ఇదే ‘కంటెంట్’పై ఈసారి వ్యాసం రాశారు. సూటిగా, సుత్తి లేకుండా, ఘాటైన పదజాలంతోనే….! ఇది రాధాకృష్ణను ఎక్కువ చేయడం కాదు, వర్ధెల్లి మురళిని తక్కువగా చూపడం కాదు. ఓ అభిప్రాయం మాత్రమే.