అనేక మంది జీవితాలను ఆర్థికంగా ఛిన్నాభిన్నం చేస్తున్న గ్యాంబ్లింగ్ సెంటర్లను, పేకాట క్లబ్బులను తెలంగాణా ప్రభుత్వం మూసివేసింది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో అక్రమ దందాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఉండరాదనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం పేకాట క్లబ్బులను మూసివేసినా, ఆన్ లైన్ లో గేమింగ్, గ్యాంబ్లింగ్ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆన్ లైన్ రమ్మీ, పేకాట ఆడటాన్ని నిషేధించాలని 2017 జూన్ 17న కేబినెట్ నిర్ణయించింది. ఈమేరకు గ్యాంబ్లింగ్, గేమింగ్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. అప్పటి నుంచి తెలంగాణా రాష్ట్రంలో ఆన్ లైన్ పేకాట ఆడటం రద్దయింది. దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం వార్త ఇది.

ఇంకాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెడదాం. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలవుతున్న రోజుల్లో మందుబాబుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం కోసం ‘నాలుక’ చాచే వారు. ఆయా రాష్ట్రాలకు దగ్గరగా ఉన్నవారు ఏకంగా అక్కడికే వెళ్లి సురాపానాన్ని సేవించేవారు. హైదరాబాద్ నగరంలో నివసించే అనేక మంది అప్పట్లో కర్నాటకలోని బీదర్ వరకు వెళ్లి కడుపు నిండా బీర్లు తాగి వచ్చేవారు. ఏదైనా సరే మన దగ్గర లభించనప్పుడు పొరుగు, రాష్ట్రాలకో, దేశాలకో వెళ్లి సంబంధిత అలవాట్లకు వ్యసనపరులుగా మారిన వారు తమ అచ్చటా, ముచ్చటా తీర్చుకుంటుంటారు.

సింబాలిక్ ఫొటో

ఉదాహరణకు పేకాటకు అలవాటుపడ్డ జూదరులు ఎక్కడైతే తమ ఆటకు అవకాశం ఉంటుందో అక్కడి వరకు వెడుతుంటారు. ఇటీవలి కాలం వరకు అంటే జగన్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు వరకు ఆంధ్రా సరిహద్దుల్లో గల ప్రాంతాలకు తెలంగాణా ప్రాంతానికి చెందిన అనేక మంది జూదరులు వెళ్లి చతుర్ముఖ పారాయణంలో తేలాయాడేవారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ అవకాశం లేక కర్నాటకలోని పలు ప్రాంతాలకు వెడుతున్నారట.

సరే, మనుషులన్నాక కొన్ని అలవాట్లు ఉంటాయి. కొందరికి అలవాటు కాస్తా వ్యవసనంగా మారుతుంది. అచారాలను, సంప్రదాయాలను మంటగలిపి ఈ ‘పులస’ చేప రుచి బహు పసందుగా ఉన్నదేమిటి చెప్మా? అంటూ నలుగురితో తమ జిహ్వ చాపల్యాన్ని పంచుకుంటుంటారు అది వేరే విషయం. ఎవరి వ్యక్తిగత అలవాట్లు వారిష్టం. ఇందులో తప్పు పట్టడానికి కూడా ఏమీ లేదు. కానీ బ్యాంకాక్ వెళ్లిన వారు తాము చేయించుకున్న ‘మసాజ్’ అనుభవాన్ని పది మందికీ చెబితే ఎలా ఉంటుంది? విదేశీ మద్యాన్నిపీకల దాకా సేవించి అబ్బో…ఇంద్రలోకపు సురాపానం దీని ముందు బలాదూర్ అని అందరికీ తెలిసేలా వ్యవహరిస్తే ఎలా ఉంటుంది? ఓ శాకాహారి తాను తిన్న మాంసాహారం గురించి బహిర్గతం చేస్తూ బొక్కలు మెడలో వేసుకుని బజార్లలో తిరిగితే ఎలా ఉంటుంది? ఎవరో సామాన్యులైతే ఫరవాలేదు. వారిని ఎవరూ పట్టించుకోరు. కానీ బాధ్యత గల వ్యక్తులు ఇటువంటి చర్యలు దిగితేనే ఎవరికైనా అభ్యంతరం ఉంటుంది కదా? వారి వ్యవహార తీరుపై, వ్యవసనాల ముచ్చటపై చర్చ జరగడం కూడా సహజం. అదేదో సినిమాలో అల్లు అర్జున్ పాత్ర వ్యాఖ్యానించిన విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడే బాధ్యత గల వ్యక్తులు ‘సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇస్తున్నట్లు?’ ఇదీ అసలు సందేహం.

మొత్తంగా ఈ వార్తా కథనంలోని ప్రతి పదం పూర్తిగా బహుదూరపు బాటసారుల బహిర్గతపు వ్యసనం గురించి మాత్రమే. తమ బాధ్యతాయుతాన్ని, సమాజ హితాన్ని విస్మరించి డప్పు చాటింపు పద్ధతిలో వ్యవహరిస్తున్న వారి గురించి మాత్రమే. అన్వయించుకునే వారి గురించి మాత్రం కాదని మనవి.

Comments are closed.

Exit mobile version