ప్రభుత్వ పరంగా జరిగే అధికారుల బదిలీలను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. పరిపాలనా సౌలభ్యం కోసం ఏ అధికారిని ఎక్కడికైనా బదిలీ చేసుకుని, వారి చేత మరింత సమర్థవంతంగా విధులు నిర్వహింపజేసే అధికారం పాలకులకు ఉంది. ‘పరిపాలనా సౌలభ్యంలో భాగం’గా అనే పదం అధికారుల బదిలీ ఉత్తర్వుల్లోనే ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహంగాని, అనుమానాలుగాని అవసరం లేదు. కానీ ఎన్నికల సంఘం కన్నెర్ర జేసిన ఘటనల్లో కొందరు అధికారులకు ‘క్రీమ్’ పోస్టింగ్ గా భావించే ప్రదేశానికి బదిలీ జరిగితే…? అంతకన్నా అదృష్టం మరొకటి ఉండకపోవచ్చు.
తెలంగాణాలోని సూర్యాపేట కలెక్టర్ అమయ్ కుమార్ కు ఇటువంటి అదృష్టమే దక్కిందంటున్నాయి అధికార వర్గాలు. ఇది యాదృచ్ఛికమే కావచ్చు. అనూహ్య రీతిలో బదిలీ వేటు పడడం, వెంటనే రాజధాని నగరంలో పోస్టింగ్ లభించిన అమయ్ కుమార్ అదృష్టం గురించే అధికార వర్గాలు సంతోషంగా చర్చించుకుంటున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రాంచంద్రరావుకు కల్పించిన ఎక్స్ అఫీషియో ఓటు హక్కు అమలు వివాదంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. దీంతో అమయ్ కుమార్ ను సూర్యాపేట నుంచి బదిలీ చేస్తూ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ సీఎస్ సోమేష్ కుమార్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి వివిధ ఎన్నికల సందర్భంగా ఏర్పడే ఇటువంటి వివాదాల్లో అనేక మంది అధికారులు కొంతకాలంపాటు పోస్టింగ్ లకు కూడా నోచుకోరు.
కానీ బదిలీతోపాటే అమయ్ కుమార్ కు ‘క్రీమ్’ కలెక్టర్ స్థానంగా ప్రాచుర్యం పొందిన కేంద్రంలో పోస్టింగ్ లభించడం విశేషం. మున్సిపల్ ఎన్నికలు ముగియడం, ఫలితాలు వెలువడడం, పాలకవర్గాలు సైతం కొలువుదీరిన నేపథ్యంలో అమయ్ కుమార్ పోస్టింగ్ కు ఎలక్షన్ కోడ్ వంటి ఆటంకాలు కూడా కలగలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. సూర్యాపేటలో మంచి కలెక్టర్ గా పేరు తెచ్చుకున్న అమయ్ కుమార్ కు మంచి పోస్టింగ్ లభించడం మంచివాళ్లకు మంచే జరుగుతుంది అనే నానుడిని గుర్తు చేస్తోందని అధికార వర్గాలు ఈ సందర్భంగా నిర్వచిస్తున్నాయి.