పుష్ప-2 సినిమా చూసినవాళ్లకు ఓ సీన్ గుర్తుండే ఉంటుంది. సీఎంతో ఫొటో దిగాలని హీరో భార్య అతన్ని అడుగుతుంది. ఓ గంధపు చెక్కల స్మగ్లర్ తో ఫొటో దిగేందుకు ‘సినిమా సీఎం’ నిరాకరిస్తాడు. ఎంతగా తమకు పార్టీ ఫండ్ ఇచ్చినప్పటికీ, స్మగ్లర్ తో ఫొటో దిగితే జనంలో తన పరపతి ఏమైపోతుందనే భావనను ‘సినిమా సీఎం’ వ్యక్తీకరిస్తాడు. అంతే స్మగ్లర్ పాత్ర హీరో ఇగో తట్టుకోలేకపోతుంది. సీఎంతో ఫొటో దిగారా? అని మీడియా స్మగ్లర్ పాత్ర హీరోను ప్రశ్నించగా, ఈనెల 24వ తారీఖున సీఎం మా ఇంటికి భోజనానికి వస్తానన్నాడు, అప్పుడు ఎన్ని ఫొటోలు కావాలంటే అన్ని తీసుకోమన్నాడు.. అని హీరో బదులిస్తాడు. కట్ చేస్తే.. 24వ తేదీ వరకు ‘సినిమా సీఎం’ మారిపోతాడు. స్మగ్లర్ పాత్ర హీరో ఇంటికి భోజనానికి వచ్చిన తాజా ‘సినిమా సీఎం’ కిస్సిక్ పాటలో ఐటెమ్ సాంగ్ భామతో చిందులు సైతం వేస్తాడు.. ఇదీ పుష్ప-2 సినిమాలో గంధపు చెక్కల స్మగ్లర్ హీరోయిజం.. అక్షరాలా రూ. 500 కోట్లతో సీఎంనే మార్చేసే హీరోయిజం అది. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా సీన్ ను ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే…?
హీరో అల్లు అర్జున్ తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డితో గిల్లుకుంటున్నట్లుగానే కనిపిస్తోంది. తన సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు 18 రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్న అంశంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో స్పందించిన తీరు తెలంగాణా సమాజంలో తీవ్ర చర్చకు దారి తీసింది. అసెంబ్లీ వంటి చట్ట సభలో ఓ సినిమా హీరో గురించి సీఎం స్థాయి నాయకుడు అంతగా స్పందించాల్సిన అవసరం లేదు. చట్టం తనపని తాను చేసుకుపోతున్న నేపథ్యంలో సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనపై దాదాపు 50 నిమిషాలపాటు సీఎం రేవంత్ రెడ్డి హిందీ, తెలుగు భాషల్లో గుక్క తిప్పుకోకుండా మాట్లాడి సుదీర్ఘ ప్రకటన చేశారు. నిజానికి సంధ్య థియేటర్ ఉదంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి తనకు తానుగా అసెంబ్లీలో ప్రస్తావించలేదు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కోరిక మేరకు ఆ దారుణ ఘటనపై సీఎం కీలక ప్రకటన చేశారు.
ఓ మహిళ మరణానికి దారి తీసిన విషాద పరిణామాలను వివరిస్తూ, అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు ఇదీ.. అంటూ సీఎం స్పష్టతనిచ్చారు. హోంశాఖను నిర్వహిస్తున్న సీఎం పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకే అసెంబ్లీలో ఈ సుదీర్ఘ ప్రకటన చేసి ఉంటారనే అంశంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే సమయంలో సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మరణానంతరం సినిమా ఇండస్ట్రీ స్పందించిన తీరునూ సీఎం ఆక్షేపించారు. కనీస మానవత్వం లేదని సినిమావాళ్లను ఉద్ధేశించి సీఎం వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ అరెస్టు సందర్భంగా కొందరు రాజకీయ నేతలు వ్యవహరించిన తీరుపైనా సీఎం నిప్పులు చెరిగారు. పొలిటికల్ లీడర్లకు హీరోలు దోస్తులైనంత మాత్రాన చట్టం వర్తించదా? అని సూటిగా ప్రశ్నించారు. మొత్తంగా అక్బరుద్దీన్ కోరిక మేరకు సంధ్య థియేటర్ ఘటనపై ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి సుదీర్ఘ ప్రకటన చేశారు. అసెంబ్లీలోనే ఈ అంశంపై సీఎం మాట్లాడారంటే అది అధికారిక ప్రకటనే అవుతుంది. రాజకీయ ప్రకటన ఏమాత్రం కాదు.
సీఎం రేవంత్ రెడ్డి అలా అసెంబ్లీలో మాట్లాడిందే తడవుగా ‘అల్లు’ కుటుంబానికి రోషం పుట్టకొచ్చినట్లుంది. తన తండ్రి అరవింద్ ను, ఇతరులు కొందరితో అల్లు అర్జున్ నిన్న రాత్రి మీడియా ముందుకు వచ్చారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని అల్లు అర్జున్ బాధపడ్డారు. ఒకానొక దశలో భావోద్వేగానికి గురైనట్లు కూడా కనిపించారు. ప్రెస్ మీట్ అనంతరం విలేకరుల ప్రశ్నలకు తావు లేదనే విధంగా చెప్పుకొచ్చారు. లీగల్ గా ప్రాబ్లం అవుతుందని, అందువల్ల మీడియా ప్రశ్నలకు జవాబు ఇవ్వలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత అల్లు అరవింద్ తనదైన శైలిలో మాట్లాడారు.
అయితే తన ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. తాను ఎవరినీ నిందించడం లేదంటూనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, తనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఆయా వ్యాఖ్యలు చేశారంటే, ఎవరిని ఉద్ధేశించి అల్లు అర్జున్ ఈ ప్రెస్ మీట్ పెట్టినట్టు? సీఎం రేవంత్ రెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేసినట్లు అల్లు అర్జున్ చెప్పకనే చెప్పినట్టా? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి శాసనసభ సాక్షిగా ఓ సినిమా హీరోపై నిరాధార ఆరోపణలు చేయాల్సిన అవసరమేంటి? అల్లు అర్జున్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఏదైనా గెట్టు పంచాయతీ ఉందా? ఇటువంటి అనేక ప్రశ్నలు జనం నోళ్లలో నానుతున్నాయి.
అల్లు అర్జున్ తన అభిమానులకు గొప్ప హీరోనే కావచ్చు. కానీ బాధత మహిళ కుటుంబ సభ్యుల కూడా అల్లు అర్జున్ వీరాభిమానులే కావడం గమనార్హం. ఇటువంటి పరిస్థితుల్లో మరణించిన మహిళ కుటుంబం అంశంలో స్పందించాల్సిన పద్ధతిలోనే తాను స్పందించారా? అనే ప్రశ్నను కూడా అల్లు అర్జున్ సంధించుకుని ఆత్మపరిశీలన చేసుకోవలసి ఉందనే వాదనలున్నాయి. అంతేకాదు తెలుగువారు గర్వపడేలా సినిమా చేశానని భావిస్తున్నట్లు కూడా అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఓ గంధపు చెక్కల స్మగ్లర్ హీరోయిజపు చిత్రాన్ని తెలుగువారు గర్వపడే సినిమాగా అల్లు అర్జున్ అభివర్ణించడంపైనా భిన్నాభిప్రాయాలున్నాయి.
ఇంకా గమనించాల్సిన కీలక అంశమేమిటంటే.. అక్కడెక్కడో ఢిల్లీలోనో, మరెక్కడో జరిగిన ఓ సినిమా ఫంక్షన్ లో అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయి ప్రదర్శించిన హావభావాలపైన ఇప్పటికీ చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయరంగును పులుముకున్నాయి. ఈ నేపథ్యంలోనూ నిన్నటి ప్రెస్ మీట్ లోనూ అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరును మళ్లీ కూడా ఎక్కడా ప్రస్తావించలేదు.. కానీ తనపై చేసిన ఆరోపణన్నీ నూరుశాతం అబద్ధాలేనని పదే పదే పేర్కొన్నారు. అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యల నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఈ ప్రెస్ మీట్ పెట్టారనేది బహిరంగం. కానీ సీఎం పేరును ఎక్కడా ఉటంకించకుండానే తాను ‘కౌంటర్’ ఇచ్చారనేది కాదనలేని అంశం.
మొత్తంగా పరిశీలించినపుడు సీఎం రేవంత్ రెడ్డిని అల్లు అర్జున్ నేరుగానే ఢీకొంటున్నట్లు నిన్నటి ప్రెస్ మీట్ సీన్ ద్వారా కనిపిస్తోంది. కానీ అల్లు అర్జున్ గ్రహించాల్సిన ముఖ్యాంశమేమిటంటే.. సినిమా వేరు.. నిజ జీవితం వేరు. సినిమా అభిమానం వేరు.. ప్రజాభిమానం వేరు. ప్రతి సినిమా హీరో తన రేంజ్ కు తగిన అభిమానులను కలిగి ఉంటారు. కానీ హీరోలందరూ ప్రజాభిమానాన్ని పొందలేరు. కొందరికి మాత్రమే అది సాధ్యం. ప్రజాభిమానం పొందిన నాయకులే ముఖ్యమంత్రులవుతారు. ఆ ముఖ్యమంత్రిని సినిమా స్టయిల్లో ఢీకొనడం హీరోలకు సాధ్యమేనా? సినిమా హీరోలను దైవాంశ సంభూతులుగా జనం భావించడానికి అందరూ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ లు కాదు. ఈ వాస్తవాన్ని గుర్తెరగకుండా ప్రజాభిమానంతో గద్దెనెక్కిన సీఎం స్థాయి వ్యక్తితో ఢీకొనాలని అల్లు అర్జున్ వంటి సినిమా హీరోలు భావిస్తే.., చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయన్నది వేచి చూడాల్సిందే..
– ఎడమ సమ్మిరెడ్డి